విభజన కారకులు కాంగ్రెస్, టీడీపీలే: అంబటి

హైదరాబాద్ 31 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ సారథ్యంలో 33 లోక్‌సభ సీట్లు ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక బంగారు గుడ్లు పెట్టే బాతు మాదిరిగా కోసుకుతినేసిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది.  రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఒక ప్రాంతం వారికి ఆనందకరంగానూ, మరొక ప్రాంతానికి దుఖకరంగానూ ఉన్నాయంది. పార్టీ  అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై చర్చోపచర్చల తర్వాత మంచి నిర్ణయం వెలువడుతుందని ప్రజలంతా ఎదురుచూశారనీ, దురదృష్టవశాత్తు... సీమాంధ్ర ప్రాంతానికి బాధ కలిగించే నిర్ణయాన్ని తీసుకున్నారనీ అంబటి చెప్పారు. 1953లో మదరాసును,  ఆ తదుపరి కర్నూలును రాజధానులుగా విడిచిపెట్టామన్నారు.  భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో చోటుచేసుకున్న విభజనతో ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానికి  హైదరాబాద్ కు వచ్చామన్నారు. 1956నుంచి 2000 వరకూ రాజధాని మాదేననుకున్నామన్నారు. మా గడ్డనుకున్నాం. మన ప్రాంతమనుకున్నాం... ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో వివరించామనీ తెలిపారు. కానీ హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వల్ల  సీమాంధ్ర హతాశమైందనీ, ఆందోళనలతో అట్టుడికిపోతోందనీ చెప్పారు. హైదరాబాద్‌ను వదిలివెళ్ళాల్సి రావడం, మరో రాజధానిని నిర్మించుకోవలసి వచ్చే స్థితి ఏర్పడిందన్నారు. ఈ కారణంగా సీమాంధ్ర ప్రజలు గందరగోళంలో పడిపోయారన్నారు. ఈ పరిణామానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టంచేశారు. ఇలాంటి వాతావరణం దురదృష్టకరమన్నారు.

సీమాంధ్ర లేదా తెలంగాణ ప్రాంతాలకు లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయానికి వచ్చారా అంటే కాదు.. రాష్ట్ర విభజన వల్ల తమకు వచ్చే ఓట్లు, సీట్లు అంచనా వేసుకుని ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించారనీ, ఇది శోచనీయమని అంబటి పేర్కొన్నారు.  ఇందుకు అనేక ఉదాహరణలున్నాయన్నారు. ఇటీవలి కాలంలో జరిగిన సర్వేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని సర్వేలు తేల్చడంతో రాష్ట్రాన్ని విభజించాలనే కుట్రతో ఈ నిర్ణయాన్ని ఆ పార్టీ తీసుకుందన్నారు. సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో  విలీనం చేసుకుంటారా అని ప్రశ్నిస్తే సిగ్గు, ఎగ్గు లేకుండా  ఆహ్వానిస్తామని బదులు చెప్పారని మండిపడ్డారు. ఈ రాష్ట్రం చేసిన పాపం ఏమిటని ఆయన ప్రశ్నించారు. యూపీఏ 2 రెండో సారి అధికారంలోకి వచ్చినా.. దానికి సోనియా ఛైర్‌పర్సన్ అయినా, మన్మోహన్ సింగ్ ప్రధాని అయినా దానికి కారణం ఆంధ్రప్రదేశ్.  దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కష్టంతో వచ్చిన 33 లోక్‌సభ సీట్లు ఇచ్చిన బంగారు గుడ్లు పెట్టిన బాతులాంటి రాష్ట్రాన్నిసోనియా కోసుకుని కేంద్రం కోసుకు తింటోందన్నారు. రాష్ట్రం మీకేం చేసిందనేది కాదు.. రాష్ట్రానికి మీరేం చేశారనేది ముఖ్యం అని స్పష్టం చేశారు.  అన్నం పెడితే అరిగిపోతుందనీ, చీర పెడితే చిరిగి పోతుందనేది సామెత.. దీనిని దృష్టిలో ఉంచుకునేమో ఆంధ్ర ప్రజలకు కర్రు కాల్చి వాతపెట్టారని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు.  ఇది అన్యాయమంటూ ఏ మొహం పెట్టుకుని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆందోళనకు ముందుకొస్తున్నారని నిలదీశారు. ఇలా ఎలా మాట్లాడుగలుగుతున్నారోననే సందేహాన్ని ఆయన వ్యక్తంచేశారు. మీకు చిత్తశుద్ధుంటే.. జరిగింది అన్యాయమనుకుంటే రాజీనామాలు చేయండంటూ డిమాండ్ చేశారు. అలా మాట్లాడడానికి సిగ్గుందా అని నిలదీశారు. పీమాంధ్ర నాయకుల వల్లే ప్రస్తుత  పరిస్థితి నెలకొందన్నారు. 'చీల్చి సీమాంధ్రుల్ని బయటపారేశారు. రాజధాని లేదు. నీళ్ళు లేవు.. ఎక్కడుండాలో తెలియని పరిస్థితి. విభజనకు ముందే ఈ అంశాలను చెప్పాలన్నా తర్వాత చెప్పుతారట. ఇంకేమిటి చెప్పేది' అంటూ అంబటి నిప్పులు చెరిగారు. పార్టీకి రాజీనామా చేయరట గాని, ఉద్యమంలో పాల్గొంటారట సిగ్గుందా మీకని అడుగుతున్నానన్నారు. మరో పెద్దాయన చెబుతున్నారు బ్రహ్మాస్త్రం ఉంది.. . తీస్తాననీ.. ఏమిటింక తీసేదంటూ ఎద్దేవా  చేశారు.  సీమాంధ్రలో కాంగ్రెస్ నాయకులకు పుట్టగతులుండవని స్పష్టంచేశారు. మంత్రి పదవులకు ఆశపడిన సీమాంధ్ర నాయకుల వల్లే ఇలాంటి దుర్గతి వచ్చిందని భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసమో, కేంద్ర మంత్రి పదవులకోసమో బిస్కట్లు వేస్తే తోకలు ఊపిన కుక్కల మాదిరిగా వ్యవహరించి రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడలేదనీ, సీమాంధ్ర అనే కొత్త రాష్ట్రాన్ని ఏర్పరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రశ్నలకు విభజనకు ముందే సమాధానం చెప్పాలని ఇంతకు ముందే కోరాం కానీ బదులు లేదన్నారు. సమాధానం తరవాత చెబుతామంటున్నారనీ, ఇంకేమిటి చెప్పేదనీ నిలదీశారు. ఇంకా చాలా ఉందనీ, అడ్డుకుంటామనీ చెబుతున్నారనీ.. ఇంకేమిటి అడ్డుకునేదని అడిగారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులకు పుట్టగతులుండవని చెప్పారు. అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని అయిదు గజాల లోతులో పాతి పెట్టేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంబటి స్పష్టంచేశారు. మీకు సిగ్గు, ఎగ్గు, చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి సీమాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టాలని సూచించారు. 

సీడబ్ట్యూసీ ప్రకటనకు కొనసాగింపే చంద్రబాబు ప్రసంగం
నిర్ణయం ప్రకటించిన 19 గంటల తర్వాత కలుగులో దాక్కున్న ఎలుకలా చంద్రబాబు బయటకొచ్చాడని విమర్శించారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ ప్రకటనకు కొనసాగింపుగా మాట్లాడారన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది.. ఏమేం కావాలి అనేది విపులంగా  చెప్పారనీ, ఈ విషయాలపై ఆనాడెందుకు మాట్లాడలేదనీ ఆయన చంద్రబాబును  ప్రశ్నించారు. ఏ మొఖం పెట్టుకుని మీడియా ముందుకు వచ్చారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆమోదం పొందిన తరవాత మాట్లాడిన ధోరణిలో ఆయన మాట్లాడారని తెలిపారు.  రాష్ట్ర విభజనకు చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే కారణమని అంబటి మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని చీల్చడానికి వీలుగా లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆనాడెందుకు మాట్లాడలేదన్నారు. కొత్త రాజధాని ఏర్పాటుకు 4, 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని చెప్పారనీ, ఇంకా చాలా అంశాలు ప్రస్తావించారనీ చెబుతూ లేఖ ఇచ్చినప్పుడు ఈ అంశాలు ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. అనేక పుకార్లు వచ్చినప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడలేదనీ, సోమిరెడ్డి మాట్లాడారనీ, పయ్యావుల కేశవ్ అయితే దారుణంగా ఏడ్చేశారనీ చెప్పారు. కానీ చంద్రబాబు ప్యాకేజీ గురించి మాట్లాడాడన్నారు. రాజధాని, తదితర విషయాలు తేలకుండా విభజన దారుణమనే మాట చెప్పలేకపోయారు. సీడబ్ల్యూసీ అనుమతి తీసుకున్న తరవాత చంద్రబాబు మాట్లాడినట్లుగా ఉందన్నారు. ఈ పెద్దమనిషిని కుప్పంలో చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. వీరి కుమ్మక్కు కుట్రలను తెలుసుకుని ప్రజలు దిష్టిబొమ్మలకు చొక్కా కాంగ్రెస్, పంచె టీడీపీ జెండాలు కట్టి తగలేస్తున్నారని తెలిపారు. వాస్తవాల్ని మాట్లాడలేని పిరికిపందగా చంద్రబాబు మిగిలాడని అంబటి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి స్థాపించిన టీడీపీలో ఉన్న చంద్రబాబు చేయాల్సిన పని ఇదేనా అని ప్రశ్నించారు.  జాతికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబన్నారు.' జాతి రెండుగా విడిపోయినా తెలుగు వారంతా ఒక్కటేట. దేశం రాష్ట్రాలయినా దేశం ఒక్కటే అని గుర్తురాలేదా' అని ప్రశ్నించారు. అందరికీ కావలసిన పనులు చేసి, కొందరి నోళ్ళు మూసి, జగన్మోహన్ రెడ్డిని జైలులో ఉంచి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పనులు చేస్తోందని తీవ్రంగా ఆరో్పించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నంలో భాగమే రాష్ట్ర విభజనన్నారు. ఎంపీ సీట్లు గెలుచుకోవాలనే తపనతోనే విభజించారన్నారు. సీమాంధ్రలో ఉద్యమం జరుగుతోంది... నువ్వు కూడా మాట్లాడు అని ఢిల్లీ నుంచి అహ్మద్ పటేల్ ఫోను వచ్చిన తర్వాత చంద్రబాబు మాట్లాడారని ఆరోపించారు. ఇంత దౌర్భాగ్యానికి దిగజారిన చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నాడని ప్రశ్నించారు.డిసెంబరు 9 ప్రకటన వచ్చేసరికి రాజీనామాలకు వారు, వీరు అని లేకుండా అందరూ క్యూ కట్టారు.. ఇప్పుడేమైంది ఆ స్ఫూర్తన్నారు. అప్పడు కావూరికి మంత్రి పదవి లేదు.. ఇప్పుడుంది.. అప్పడు జేడీ శీలం మంత్రి కాదు.. ఇప్పుడు మంత్రి.. అప్పుడు రాయపాటి సాంబశివరావుకు పోలవరం ప్రాజెక్టు లేదు.. ఇప్పుడుంది.. అప్పుడు లగడపాటిపై కేసులున్నాయి.. ఇప్పుడు లేవు.. అప్పటికి ఇప్పటికీ ఇంతే కదా మార్పు అన్నారు.  చంద్రబాబు ఉమ్మడి రాజధాని అంశం కూడా ప్రెస్ మీట్లో మాట్లాడలేదన్నారు. విభజన నిర్ణయంలో తానూ భాగస్వామినేనని ఆయన చెప్పకనే చెప్పారన్నారు. సమైక్యవాదాన్ని వేర్పాటువాదంగా చిత్రించిన వ్యక్తులు ఇప్పటికైనా వాస్తవం గుర్తించాలని అంబటి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణకి మేం వ్యతిరేకం కాదు
తెలంగాణకి మేము వ్యతిరేకం కాదని మొదట్లోనే చెప్పామని ఓ ప్రశ్నకు అంబటి బదులు చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోమన్నామని తెలిపారు. స్పష్టత లేని విభజనను వ్యతిరేకిస్తున్నామన్నారు. మనోభావాలకు అనుగుణంగా జరుగుతున్న పంపకం కాదిదని చెప్పారు.  కావాలంటే షిండే గారికిచ్చిన లేఖ మరోసారి ఇస్తామనీ, చూసుకోవచ్చనీ సూచించారు. మీ ఇష్టమైన నిర్ణయం తీసుకోండని కేంద్రానికి చంద్రబాబే చెప్పాడన్నారు. సీమాంధ్ర ప్రజలని మరింత మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారు. కాకమ్మ కథలు చెప్పి వారిని మోసం చేయడమేనని అంబటి స్పష్టంచేశారు.

తాజా వీడియోలు

Back to Top