వైఎస్సార్సీపీ మద్దతు కోరిన కాంగ్రెస్

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబసభ్యులు పోటీ చేస్తే తాము పోటీ చేయమని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాంరెడ్డి కుటుంబ సభ్యులకే తమ మద్దతు అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క లోటస్ పాండ్ లో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు.  ఈ సందర్భంగా పాలేరు ఉప ఎన్నికలో భాగంగా వైఎస్ఆర్ సీపీ మద్దతు కోరారు.

ఈ భేటీ అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భట్టి విక్రమార్క...పరిస్థితిని తమ అధ్యక్షుడికి వివరించారన్నారు. ఐతే,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఏ ఎమ్మెల్యే మరణించినా...వారి కుటుంబసభ్యులు పోటీ చేస్తే తాము పోటీ చేయటం లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. మిగిలిన పార్టీకలు కూడా అదే విధానాన్ని అనుసరించాలని పొంగులేటి సూచించారు.

అనంతరం మల్లు భట్టి విక్రమార్క...వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నామని, అందరి మద్దతుతో పాలేరు ఉప ఎన్నికలో గెలుస్తామన్నారు. దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం నేపథ్యంలో పాలేరు ఉప ఎన్నిక జరుగుతోంది.

తాజా ఫోటోలు

Back to Top