కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుంది

ప్రైవేటు బిల్లును అన్ని పార్టీలు ఆమోదించాలి
ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి
హోదా వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుంది
హోదాకోసం గుంటూరులో వైయస్సార్సీపీ నేతల ర్యాలీ

గుంటూరు (పట్నంబజారు) :  రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న ప్రైవేట్‌ బిల్లును అన్ని రాజకీయ పార్టీలు కలసికట్టుగా ఆమోదించి 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి కోరారు. ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ.. అరండల్‌పేటలోని పార్టీ నగర కార్యాలయం నుంచి లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా మొహమ్మద్‌ ముస్తఫా, లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా బిల్లును ఆమోదించి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చిన కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఏ గతి పట్టిందో.. ఇప్పుడు ప్రత్యేక హోదా ప్రైవేట్‌ బిల్లు ఆమోదించకపోతే భవిష్యత్తులో అదే గతి పడుతుందని టీడీపీ, బీజేపీలను హెచ్చరించారు. రాష్టానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఎవరితోనైనా కలిసి ముందుకు సాగుతామని, గత అసెంబ్లీ సమావేశాల్లో హోదా కోసం అసెంబ్లీలో చేసిన తీర్మానం ఇందుకు నిదర్శనమన్నారు. హోదా వచ్చే వరకు అవిశ్రాంత పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. 

కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఆయా విభాగాల నేతలు కొలకలూరి కోటేశ్వరరావు, అంగడి శ్రీనివాసరావు, నూనె ఉమామహేశ్వరరెడ్డి, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, జగన్‌కోటి, షేక్‌ జానీ, గనిక ఝాన్సీరాణి, దాసరి కిరణ్, పానుగంటి చైతన్య, మేరువ నర్సిరెడ్డి, ఆరుంబడ్ల వెంకటకొండారెడ్డి, కోట పిచ్చిరెడ్డి, బోడపాటి కిషోర్, అంబేద్కర్‌  తదితరులు పాల్గొన్నారు.  
 
Back to Top