సోనియా ఆదేశాలను పాటిస్తున్న కాంగ్రెస్, టీడీపీ

హైదరాబాద్ 16 అక్టోబర్ 2013:

సీమాంధ్ర ప్రాంతంలో 74రోజులుగా సాగుతున్న సమైక్య ఉద్యమాన్ని నీరు గార్చడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అలాగే, కాంగ్రెస్, టీడీపీలు తమ కుమ్మక్కు రాజకీయానికి కొనసాగింపుగా రాష్ట్ర విభజనకు వీలుగా మరో రాజకీయ నాటకానికి తెర తీశాయని మండిపడింది. పార్టీ సీజీసీ, పీఏసీ సభ్యుడైన డాక్టర్ ఎమ్.వి. మైసూరా రెడ్డి బుధవారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పారు.

ఇందులో భాగంగానే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఇప్పుడు టీడీపీ ఎంపీలతోనూ, వారి నాయకుడు చంద్రబాబుతోనూ కలిసి సమన్యాయం అనే రాగాన్ని ఆలపిస్తున్నారని చెప్పారు. కుమ్మక్కు కుట్ర సోనియా ఆదేశాలమేరకే అమలవుతోందని ఆయన తెలిపారు. ఈ ఉదంతంతో ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో స్పష్టంగా ప్రజలకు తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. కేంద్ర క్యాబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించిన మరుసటి రోజునే రెండు ప్రాంతాలకూ సమన్యాయం కోరుతూ తాను ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్షను చేపడతానని చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని మైసూరా రెడ్డి గుర్తుచేశారు.

కాంగ్రెస్, టీడీపీలు చెబుతున్న సమన్యాయ సూత్రం ఒకటేనన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ రెండు పార్టీల నేతలు సోనియా గాంధీ దర్శకత్వంలో రాజకీయ నాటకంలో కొత్త అంకానికి శ్రీకారం చుట్టారన్నారు.

రాష్ట్ర విభజన నిర్ణయంపై సీమాంధ్రలో విరజిమ్ముతున్న నిప్పులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నీళ్ళు జల్లుతున్నారనీ, ఇది కూడా కాంగ్రెస్ అధిష్ఠానం స్క్రిప్టు మేరకే జరుగుతోందని ఆయన మండిపడ్డారు. కిరణ్ నిజంగా సమైక్యవాదే అయితే తమ పార్టీ కోరినప్పుడు అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యాంధ్ర ప్రదేశ్ అంశంపై తీర్మానం చేసి ఉండేవారని అభిప్రాయపడ్డారు. కానీ ఆయన ఈ అంశాన్ని పట్టించుకోలేదని తెలిపారు. సీమాంధ్ర టీడీపీ నాయకులు ఇలాంటి డిమాండే చేయకపోవడాన్ని కూడా ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలని మైసూరా రెడ్డి సూచించారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ముఖ్యమంత్రి చొరవ చూపించలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని 60శాతం మంది ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారనీ, ఉద్యోగులు 74రోజులుగా సమ్మె చేస్తున్న విషయాన్నీ ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని తన స్వలాభం కోసం చీల్చడానికి సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నారని తెలియగానే తమ పార్టీ ఎమ్మెల్యేలు తక్షణం రాజీనామాలు సమర్పించిన విషయాన్ని మైసూరా రెడ్డి గుర్తుచేశారు. తాము ఇప్పటికీ సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కానీ కాంగ్రెస్, టీడీపీ నేతలు సమన్యాయం అంటూ మాట్లాడుతున్నారన్నారు.  ఆ పార్టీలు రెండూ కుమ్మక్కయ్యాయని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలని ఆయన పేర్కొన్నారు.

Back to Top