లోకేష్‌తో కుమ్మకై కలెక్టర్‌ భూ దందా

  • నదుల ఆక్రమణపై చర్చలెక్కడ..?
  • లోకేష్‌ బినామీపై మంత్రి చర్యలు తీసుకోరా
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
వెలగపూడి: తెలుగుదేశం ప్రభుత్వంతో కుమ్మకై చిత్తూరు జిల్లా కలెక్టర్‌ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. తిరుపతి రూరల్‌ పరిధిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల విలువెంత.. విస్తీర్ణం ఎంత.. ఆక్రమణకు గురై ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి అని ప్రభుత్వాన్ని నిలదీస్తే రెవెన్యూ మినిస్టర్‌ సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ... తిరుపతి వెంకన్న ఆధ్యాత్మిక క్షేత్రం పరిధిలో అగ్రికల్చర్, ఆర్టికల్చర్, బరేల్‌గ్రౌండ్‌ భూములు 790 ఎకరాల భూములు ఆక్రమణకు గురైందని తహశీల్దార్‌ కలెక్టర్‌కు నివేదిక ఇస్తే.. జిల్లా కలెక్టర్‌ వాటిని 296.28 ఎకరాలుగా తప్పుడు నివేదిక చూపిస్తున్నారని విమర్శించారు. ఎవరికి నచ్చిన లెక్కలు వారు రాసి తప్పుడు లెక్కలు సభకు పంపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూముల ఆక్రమణపై ప్రతిపక్షాలు మాట్లాడితే ఎక్కడ వాస్తవాలు బయటపడతాయోనని స్పీకర్‌ మాకు అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. 

మంత్రి భయపడుతున్నారా
2016 సంవత్సరంలో వరదలు వచ్చినప్పుడు చిత్తూరు జిల్లాలోని భీమానది, స్వర్ణముఖి నదులు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయని చెవిరెడ్డి చెప్పారు. స్వర్ణముఖి నదిలో 520 ఎకరాలు, భీమా నదిలో 210 ఎకరాలు కొందరు కబ్జాదారులు ఆక్రమించి వాటిల్లో ఇళ్లు కూడా నిర్మించుకున్నారని చెప్పారు. నదులు ఆక్రమించి వాటిల్లో ఇళ్లు కట్టుకోవడంతో వరదలొచ్చినప్పుడు కాలువల ద్వారా పోవాల్సిన నీరు గ్రామాల మీదకు వచ్చాయన్నారు. నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ అనే సంస్థ వచ్చి ప్రజలను కాపాడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరితే మంత్రి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. లోకేష్‌ బినామీగా పేరున్న జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకోవడానికి మంత్రి భయపడుతున్నారా అని నిలదీశారు. తక్షణమే భూకబ్జాదారులపై కమిటీ వేసి వాస్తవాలను బయటకు తీయాలని కోరారు. ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ సీపీ వద్దనుకుంటే ఒక ఐఏఎస్‌ అధికారితో లేదా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక బీజేసీ శాసనసభ్యుడితో కమిటీ వేసి విచారించి వాస్తవాలు బయటకు తీయాలన్నారు.
Back to Top