కిరణ్‌ మాటలు రాజకీయ ఎత్తుగడే

హైదరాబాద్, 9 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తరువాత సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించడం రాజకీయ ఎత్తుగడలో భాగమే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. విభజనకు మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆద్యుడని కిరణ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆయన దుమ్మెత్తిపోశారు.

రాష్ట్ర విభజనపై సంప్రతింపులు జరిగినప్పుడు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నోరు తెరవలేదని, విభజన చేస్తున్నామని చెప్పినప్పడు మౌనంగా ఉండి తొమ్మిది రోజుల తరువాత కోస్తా ఆంధ్ర అంతా రావణకాష్టంలా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు తానేదో పెద్దమనిషిలా వ్యవహరించినట్లుగా మాట్లాడడం సరికాదని భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. దీనంతటికి రాజశేఖరరెడ్డి ఆద్యుడు అని తన దుర్మార్గపు పోకడని కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి ప్రపంచానికి చాటుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిడబ్ల్యుసి సమావేశానికి సిఎం వెళ్ళారని, ఢిల్లీ పెద్దలు ఆయనతో సంప్రతించారని అప్పుడు తన అభ్యంతరాన్ని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. ఆ రోజునే కిరణ్‌ రాజీనామా ఇచ్చి ఉండి ఉంటే పెద్ద సంచలనం అయ్యేది కదా అన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చి ఉంటే విభజన ఈ విధంగా జరిగి ఉండేది కాదుకదా అన్నారు. అలా చేసి ఉంటే సమతూకం, సమన్యాయం పాటించేవారు కదా అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రే తన పదవిని వదిలేస్తున్నారగానే కేంద్రం నిర్ణయం వేరేగా ఉండేది అన్నారు.

ఇప్పుడు కూడా రాష్ట్ర విభజననే తాను స్వాగతించడంలదు, వ్యతిరేకించడం లేదంటూ సిఎం కిరణ్‌ కపట నాటకం ఆడుతున్నారని భూమన విమర్శించారు. విభజనను తాను వ్యతిరేకిస్తున్నానని స్పష్టంగా చెప్పడంలేదన్నారు.

Back to Top