క్షతగాత్రులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పరామర్శ

హైదరాబాద్, 8 జూలై 2013:

సికింద్రాబాద్‌లోని సిటీలైట్‌ హొటల్‌ దుర్ఘటనలో క్షతగాత్రులై గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున వారిని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుల బృందం పరామర్శించింది. ఈ హోటల్‌ భవనం కుప్పకూలిపోయిన దుర్ఘటనలో 13 మంది మరణించారు, 20 మందికి పైగా గాయపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనలో బాధితులకు వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితులను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కె.కె. మహేందర్‌రెడ్డి, సీఈసీ సభ్యురాలు పి. విజయారెడ్డి తదితరులు ఉన్నారు.

క్షతగాత్రులను, వారి బంధువులను పరామర్శించిన అనంతరం బృందం సభ్యుడు కూన శ్రీశైలం గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మృతులు, క్షతగాత్రులంతా నిరుపేదలని అన్నారు. మరణించిన ఒక్కొక్కరి కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. దానితో పాటు ఒక్కొక్క మృతుని కుటుంబానికి నగరంలో 120 గజాల ఇంటిస్థలం, వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. క్షతగాత్రులకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. ‌ఈ సంఘటనలో గాయపడిన వారిని పరామర్శించకుండానే ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ వెళ్ళిపోవడంపై ఆయన విచారం వ్యక్తంచేశారు.

Back to Top