చరిత్రాత్మకం.. 'జనం సంతకం': విజయమ్మ

హైదరాబాద్, 15 జనవరి 2013: దేశ చరిత్రలో ఎవరి కోసమూ జరగనంత అత్యధిక సంఖ్యలో రాష్ట్ర ప్రజలు 'జగన్‌ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో పాల్గొన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. ఇంత వరకూ కోటీ 96 లక్షల మంది సంతకాలు చేశారని ఆమె వెల్లడించారు. ఢిల్లీ తీసుకువెళ్ళి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అందజేసే సంతకాల పత్రాలను ఆమె మంగళవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాకు ప్రదర్శించారు. ఈ సంతకాలను సిడిల రూపంలో కూడా ఆయనకు అందజేసేందుకు సిద్ధం చేశామన్నారు. ఆ సిడిలను కూడా శ్రీమతి విజయమ్మ మీడియాకు చూపించారు. రాష్ట్రపతి తన అపాయింట్‌మెంటును రాత్రే ఇచ్చారని తెలిపారు. సమయాభావం కారణంగా స్కాన్‌ చేసిన కోటి 56 లక్షల సంతకాలను మాత్రమే సిడిల్లో రాష్ట్రపతికి అందజేస్తున్నట్లు ఆమె వివరించారు.

జగన్‌బాబును అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసి ఎనిమిది నెలలవుతోందని శ్రీమతి విజయమ్మ తెలిపారు. జగన్‌బాబు అక్రమ అరెస్టును ప్రజా కోర్టులో తెలపాల్సిన అవసరం ఉందని తాను ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది మంది ప్రజలు స్పందించారని ఆమె అన్నారు. శ్రీ జగన్‌కు మద్దతుగా సంతకం చేసిన ప్రతి ఒక్కరికీ శ్రీమతి విజయమ్మ ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కారాలు తెలిపారు. తన బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో శ్రీ జగన్‌ త్వరలోనే బయటికి వస్తారన్నారు. కడప ఎన్నికల్లోను, ఉప ఎన్నికల సందర్భంగాను తన బిడ్డ శ్రీ జగన్ పట్ల ఆదరణ చూపించారని శ్రీమతి ‌విజయమ్మ ప్రస్తావించారు. శ్రీ జగన్‌ గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రీమతి విజయమ్మ భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టారు. దేవుడు అన్నీ చూస్తున్నాడని, జగన్‌బాబును బయటికి తీసుకువస్తాడన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్న సువర్ణయుగాన్ని శ్రీ జగన్ త్వరలోనే ‌తీసుకువస్తారని శ్రీమతి విజయమ్మ తెలిపారు.

అనంతరం రాష్ట్రపతితో భేటికి సంబంధించిన విషయాలపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నాయకులు, ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
Back to Top