మహిళల మాన, ప్రాణాలతో పచ్చచొక్కాల వికృత క్రీడతమ్ముళ్లను తప్పించేందుకు పోలీసులపై ఒత్తిళ్లునాలుగు రోజుల తర్వాత నోరు విప్పిన చంద్రబాబుఅధికారులు విఫలమయ్యారంటూ రుసరుసలుదోషులను తప్పించే కుట్ర
విజయవాడలో బెంబేలెత్తించిన టీడీపీ నేతల కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. కాల్ మనీ సెక్స్ దందాలో అధికార పార్టీకి చెందిన నాయకులు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడ్డారు. అందులో టీడీపీ ప్రజాప్రతినిధులు, మరికొంత మంది నేతల ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. మహిళల మాన, ప్రాణాలతో పచ్చచొక్కాలు వికృతంగా ప్రవర్తిస్తే...బాధ్యత గల ముఖ్యమంత్రి అయి ఉండి తమ్ముళ్లను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయడం బాధాకరం. నగరం నడిబొడ్డున జరిగిన టీడీపీ అరాచక ప్రక్రియను పట్టుకున్నది పోలీసులేనన్న విషయం చంద్రబాబు మర్చిపోయినట్టున్నారు.
చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మరోసారి ఆ నెప్పాన్ని అధికారులపై నెట్టేశారు. విజయవాడలోని కలెక్టర్ల సదస్సులో కాల్ మనీ వ్యవహారంపై మాట్లాడిన చంద్రబాబు...రాజధానిపై నిఘా ఉంటుంది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని తప్పును వారిపై తోసేశారు. కాల్‌మనీ వ్యవహారంలో నిఘా వ్యవస్థలు విఫలమయ్యాయని, ఇలాంటి దారుణాలను ముందుగా పసిగట్టడంలో అధికారులు విఫలమయ్యారంటూ విమర్శించారు. వీటిపై ముందే సమాచారం రావాల్సిందంటూ రుసరుసలాడారు. చంద్రబాబు వ్యాఖ్యలతో ఒక్కసారిగా విస్తుపోయిన అధికారులు...టీడీపీ నేతల తప్పుడు పనులకు తమను బాధ్యులు చేయడం పట్ల గుర్రుగా ఉన్నారు.
కాల్‌మనీ లాంటి ఘటనల వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇమేజ్ దెబ్బతింటుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మహిళలపై దారుణాలకు ఒడిగట్టిన వారిపై నిర్భయ కేసులు పెట్టాలని చంద్రబాబు సూచించారు. ఐతే, చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇందులో భాగస్వాములైన ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధావెంకన్నతోపాటు.... కాల్ మనీ గ్యాంగ్ లో ఉన్న మిగతా టీడీపీ కన్నింగ్ నేతలను జైల్లో పెట్టాలని ప్రజాసంఘాలు, మహిళాసంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉన్నతస్థాయి అధికారులతో నిష్పక్షిపాతంగా దర్యాప్తు జరిపించి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక మహిళలను ఆసరాగా చేసుకొని... అధికారపార్టీకి చెందిన బడా, చోటా నేతలు కాల్ మనీ ముసుగులో అధిక వడ్డీలకు అప్పులివ్వడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఫైనాన్స్ వ్యాపారాన్ని అడ్డుపెట్టుకొని బలవంతంగా మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపి లైంగికంగా వేధింపులకు గురిచేయడం ... వీడియోలు తీసి బలవంతంగా బ్లాక్ మెయిల్ కు పాల్పడడం కలకలం రేపుతోంది. అంతేకాదు అందమైన అమ్మాయిలను తీసుకురావాలంటూ సదరు మహిళలపై ఒత్తిళ్లు తీసుకొచ్చి మరికొంతమంది విద్యార్థినిలను ఈరొంపిలోకి లాగారు. ఎట్టకేలకు ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీడీపీ నాయకుల బండారం బట్టబయలైంది. పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా 12 మందిని అదుపులుపోకి తీసుకున్నారు.
పచ్చచొక్కాలు అడ్డంగా బుక్కవ్వడం...వారి అరాచకాలు ఒక్కక్కటిగా వెలుగుచూస్తుండడంతో ఉన్నతాధికారులు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఒత్తిళ్లు పెరిగాయి. ఐతే, ఆ కేసు నుంచి టీడీపీ ప్రజాప్రతినిధులను తప్పించే ప్రయత్నాలు జరుగుతుండండతో రాష్ట్రమంతటా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ప్రజలు, మహిళాసంఘాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో చంద్రబాబు నాలుగు రోజుల తర్వాత నోరు విప్పారు. కాల్ మనీ కేసులో తప్పంతా అధికారులదే అన్నట్లు మాట్లాడడం శోచనీయం.

ఇసుక మాఫియా, కల్తీ నెయ్యి, కల్తీమద్యం, కాల్ మనీ సెక్స్ రాకెట్ ..ఇలా రాజధానిలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. అధికారులపై దాడులు, మహిళలపై లైంగిక వేధింపులు, కల్తీమద్యంతో ఆడవాళ్ల బతకులు అంధకారంగా మారుతున్నాయి. చంద్రబాబు తెలుగుతమ్ముళ్ల నేరాలను ప్రోత్సహిస్తుండడం వల్లే రాష్ట్రంలో అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని పలువురు మండిపడుతున్నారు. ప్రజల ప్రాణాలు హరించిపోతున్నా చంద్రబాబుకు చీమకుట్టినట్టైనా లేదని మండిపడుతున్నారు. తూతూమంత్రంగా దర్యాప్తు జరిపించడం మినహా ఎక్కడ కూడా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.