చంద్రబాబుది శ్మశానయుగం!


ఖమ్మం 19 నవంబర్ 2012 : రాజశేఖర్ రెడ్డిగారిది "సువర్ణ యుగ" మైతే చంద్రబాబునాయుడుగారిది "శ్మశానయుగ"మని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. తాను నిప్పులాంటివాడినని చెప్పుకుంటున్న చంద్రబాబును ఏ కోర్టు విచారించి నిర్దోషిగా తేల్చిందో చెప్పాలని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 18 అంశాలతో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తే సిబిఐ దర్యాప్తు జరపకుండా రోజులు గడిపిందనీ, ఈ లోపు తన మద్దతు దారులు స్టే తెచ్చుకున్నారనీ ఆమె గుర్తు చేశారు. బతుకంతా విచారణ లేకుండా ' స్టే' తెచ్చుకుని గడిపేస్తే మీరు నిర్దోషి అయిపోతారా? అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. జలగం వెంకట రావు వైయస్ఆర్ సీపీలో చేరిన సందర్భంగా ఖమ్మంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఒక భారీ బహిరంగసభలో విజయమ్మ ప్రసంగించారు. పాదయాత్ర అంటూ నాటకాలాడుతున్న చంద్రబాబు మాటలు నమ్మవద్దని ఆమె ప్రజలను కోరారు.
విజయమ్మ మాటల్లోనే...
"పేదలు మలమల మాడుతున్నా, ఇదేమి ప్రభుత్వమని నిలదీయాల్సిన చంద్రబాబు నిలదీయడం లేదు. అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి రారు. అవిశ్వాసం పెట్టమంటే పెట్టరు. మీ కోసం వస్తున్నానంటూ మహా నాటకాలు చేస్తూ మీ ముందుకు వస్తున్న చంద్రబాబు తన పరిపాలన గుర్తు తెచ్చుకోవాలి. ఆయన తొమ్మిదేళ్ల పరిపాలనలో పంటలు లేవు. తిండి లేదు. కూలీ చేద్దామంటే పని కూడా లేదు. దారుణమైన పరిస్థితులు ఉండేవి. పొట్ట చేతపట్టుకుని జనం వలసలు పోయారు. చంద్రబాబు ప్రభుత్వంలో బోర్లు లేవు. బోర్లకి కరెంటు లేదు.దయనీయ పరిస్థితుల్లో కరెంటు బిల్లులు కట్టలేమన్నా వినకుండా ప్రత్యేక పోలీసు స్టేషన్లు పెట్టి రైతులను జైళ్లలో పెట్టారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పెట్టి పోలీసులను ఉసిగొల్పి రైతులను వేధించారు. ఇళ్లల్లోని చెంబూ తపేళాలను కూడా ఎత్తుకెళ్లారు. ఫలితంగా నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. ఇవాళ చంద్రబాబు కొత్తగా రుణమాఫీ చేస్తానంటున్నారు. ఉచిత విద్యుత్తు ఇస్తానంటున్నారు. బెల్టు షాపులు రద్దు చేస్తానంటున్నారు. రుణమాఫీ చేస్తానని ఈ రోజు చెబుతున్న చంద్రబాబు మరి ఆనాడు కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు ఎందుకు ఆ పని చేయలేదు? రుణాల మాఫీ కోరుతూ ఒక్క లెటర్ అయినా రాయగలిగారా?" అని విజయమ్మ ప్రశ్నించారు.
"వైయస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాల రీ షెడ్యూలు చేశారు. 2008-09లో కేంద్ర ప్రభుత్వం ద్వారా 12 వేల కోట్ల రూపాయల మేరకు 64 లక్షల మందికి రుణమాఫీ చేశారు. అప్పుకట్టినవారికి రూ.5 వేల చొప్పున రూ. 1800 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉచిత విద్యుత్తు ఇస్తానని చెబుతున్న చంద్రబాబు మరి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు. అది ఆయన చేతిలోని పనే కదా! కానీ రాజశేఖర్ రెడ్డిగారు మొదటి ఫైలుపై సంతకం చేసిందిఉచిత విద్యుత్తుపైనే. రూ. 1259 కోట్ల మేరకు విద్యుత్తు బకాయిలను రద్దు కూడా చేశారు. చంద్రబాబు బెల్టు షాపులు రద్దు చేస్తానంటున్నారు. కానీ నిజానికి బెల్టు షాపులను గ్రామాలకు తీసుకుపోయింది ఎవరు? చంద్రబాబునాయుడు కాదా?"అని ఆమె నిలదీశారు.
ప్రాజెక్టులు కట్టమంటే ఇంకుడు గుంతలు...
"వ్యవసాయం శుద్ధ దండగ అన్న చంద్రబాబు ఇవాళ రైతులంటూ వస్తున్నాడు. పంటలకు కరెంటు అడిగితే ఆ రోజు పంటలు ఎండిపోయాయి కదా, కరెంటు ఎందుకని ఎగతాళి చేసినవాడు చంద్రబాబు. విద్యుత్తు చౌర్యం చేస్తే వేరే దేశాల్లోనైతే ఉరి తీస్తారు, నేను కాబట్టి జైలుకు పంపుతున్నానన్నాడు చంద్రబాబు ఆ రోజు. అంతేకాదు, ఈ ప్రాంతం (తెలంగాణ)లో నిజాం షుగర్ లాంటి ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి కావలసినవాళ్లకు ధారాదత్తం చేయలేదా చంద్రబాబు? మీ 'మనసులో మాట' పుస్తకంలో సంక్షేమం సోమరిపోతులను చేస్తుందని రాయలేదా? ఎన్టీఆర్ పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఐదున్నర రూపాయలు చేసి సామాన్యుడి కడుపు మీద కొట్టలేదా? ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.50 హార్స్‌పవర్ పథకాన్ని రూ. 650 చేసి జనం మీద భారం వేయలేదా? నీటి ప్రాజెక్టులు కట్టమంటే, ఇంకుడు గుంతల సిద్ధాంతం తీసుకువచ్చింది మీరు కాదా?"అని విజయమ్మ దుయ్యబట్టారు.
ఆల్మట్టి డ్యామ్ బాబు హయాంలోనే మొదలు పెట్టి బాబు హయాంలోనే పూర్తయిందనీ, ఆ రోజు ఆయన నోరు మెదపక పోవడం వల్ల ఇవాళ కృష్ణాజలాలు మనకు రావాలంటే ఎంతో కష్టమైపోతోందనీ ఆమె అన్నారు.

బాబును నమ్మొద్దు!

"చంద్రబాబునాయుడి మాటలు నమ్మొద్దు. చంద్రబాబు కొత్త పాఠం చెబుతున్నారు. నేను నిప్పు లాంటివాడిని. నా మీద 35 కేసులు పెట్టారు. వాటిలో ఏమీ తేలలేదు అని చెబుతున్నారు. ఏ కోర్టు మీరు నిర్దోషి అని తీర్పు ఇచ్చింది? ఏ కోర్టు మీ మీద విచారణ చేసింది? నేను 18 అంశాలతో 2424 పేజీలతో చంద్రబాబు అవినీతిపై కోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేశాను. కోర్టు నెల రోజులలోపు దర్యాప్తు జరపమని సిబిఐని ఆదేశించింది.చంద్రబాబుపై ఎంక్వైరీ చేయడానికి సిబిఐవాళ్లకు సిబ్బంది లేదట! నెల రోజులు చేయలేదు.ఆయన మద్దతుదారులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మీ బతుకంతా స్టే తెచ్చుకుని విచారణ లేకుండా ఉంటే మీరు నిర్దోషి అవుతారా?"అని ఆమె ప్రశ్నించారు.
"ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లి అడిగినా కూడా చంద్రబాబునాయుడు ఎంత నీతిపరుడో చెబుతారు! జగన్ బాబు కేసులో కోర్టు ఆదేశించిన 24 గంటల్లోనే 28 టీములు పెట్టి సిబిఐ దర్యాప్తు చేశారు. అన్యాయంగా పది నెలలు ఎంక్వైరీ చేసి జైలు పాలు చేశారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌గారిదా? మీదా? అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ తనదేనని చంద్రబాబు నాయుడు మీడియాను మేనేజ్ చేయలేదా? వైస్రాయి హోటల్ దగ్గర ఎన్టీఆర్ పై చెప్పులు వేసి ఆయన చనిపోయే స్థితికి తెచ్చింది మీరు కాదా? వెన్నుపోటు అనగానే గుర్తుకొచ్చేది మీరు కాదా? నిజం చెప్పని మాజీ ముఖ్యమంత్రి ఎవరని అడిగితే గుర్తుకొచ్చేది మీరు కాదా? తెహల్కా డాట్ కామ్  2002లోనే అత్యంత అవినీతిపరుడు, ఇంతటి షాహుకారు ఎవరూ రాజకీయనాయకుల్లో లేరని చెప్పింది మీ గురించి కాదా? మీ హయాంలోనే ఐఎంజీకి కోట్లు విలువ చేసే భూములను ఎకరా యాభైవేలకే 800 ఎకరాలు ఇవ్వలేదా? కోట్ల విలువైన భూమిని ఎమ్మార్‌కు 535 ఎకరాలు కట్టబెట్టలేదా? మనం టెండర్ వేయకుండా కేజీ బేసిన్ గ్యాస్‌ను రిలయన్స్‌కు కట్టబెట్టింది మీరు కాదా? రామోజీరావు, నామా నాగేశ్వరరావు, మురళీమోహన్, సిఎం.రమేశ్‌లకు సాయం చేసింది మీరు కాదా? మీకొక న్యాయం! రాజశేఖర్ రెడ్డిగారికి ఒక న్యాయమా! ఏ గైడ్‌లైన్స్‌తో వీళ్లందరికీ సాయం చేశారో! అదే రాజశేఖర్ రెడ్డిగారు చేశారు. రాజశేఖర్ రెడ్డి అవినీతిపరుడని మీరు చెబుతున్నారే!  ఏ కోర్టు వైయస్‌ని దోషి అని చెప్పింది? 

జగన్ జైలు పాలై నేటికి 175 రోజులు!

కాంగ్రెస్, మీరు కుమ్మక్కై రాజశేఖర్ రెడ్డిగారి పేరును కేసులో నిందితుడిగా చేర్చారు. జగన్‌బాబుకు దీంతో ఏమిటి సంబంధం? ఆయన ఎంపీనా? అధికారా? మినిస్టరా? ఉప ఎన్నికలకు ముందు అన్యాయంగా  అక్రమంగా జైలులో పెట్టారు. జైలులో పెట్టి ఈ రోజుకు175 రోజులౌతోంది. మీరు నీతిమంతులా? 1999 నుండి ఈ పదమూడేళ్లలో ప్రజలు మీకు శిక్ష విధించారు. కానీ మీకు అర్థం కావడం లేదు. 2012లో 50 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అందులో సగం స్థానాలలో మీకు డిపాజిట్లు కూడా రాలేదు. రెండు పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. దాంట్లోనీ డిపాజిట్లు పోయాయి. అయినా మీకు అర్థం కాలేదు. జగన్‌బాబు టన్నుల కొద్దీ డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొంటున్నారని నేరారోపణ చేస్తున్నారు. ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తానన్న మీరు తెలుగుదేశం పార్టీలోకి పోయారు. ఆ రోజు ఎన్టీఆర్ మీకు ఎన్ని కోట్లు డబ్బులిచ్చారు? ఎన్టీ రామారావును పడగొట్టడానికి ఎమ్మెల్యేలను వైస్రాయిలో పెట్టారు. వారికి ఎన్ని కోట్లు ఇచ్చారు?
ఇదీ విశ్వసనీయత అంటే...
విశ్వసనీయతకు మీకు అర్థం తెలుసా? విశ్వసనీయత అంటే నమ్మకం. రాజశేఖర్ రెడ్డిగారు ఇచ్చిన మాటకు నిలబడ్డారు. డజన్ల కొద్దీ పథకాలు అమలు చేశారు. రాజశేఖర్ రెడ్డిగారు కనబడనప్పుడు ప్రపంచమంతా ప్రార్థనలు చేశారు. ఆయన మరణించినప్పుడు ఎందరో గుండె పగిలి చనిపోయారు. అది ప్రజలకున్న విశ్వసనీయత. నల్లకాలువ మాట కోసం జగన్‌బాబు ప్రజల మధ్యకు వచ్చాడు. దీక్షలు చేశాడు. కడప నుండి కొవ్వూరు వరకు జగన్‌బాబును గెలిపించారు. అది ప్రజలకు ఉన్న విశ్వసనీయత. 2009 ఎన్నికల్లో కేసీఆర్‌తో కలిసి పోటీ చేసి తెలంగాణకు అనుకూలమని  మేనిఫెస్టోలో పెట్టి ఆ తర్వాత ప్లేటు ఫిరాయించినవారు  మీరు. ఇదీ మీ విశ్వసనీయత. తెలుగుదేశం పార్టీని పెట్టిన ఎన్టీఆర్‌ను కూలదోసి వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమవడం మీ విశ్వసనీయత. రెండు రూపాయల కిలో బియ్యం, మద్యనిషేధం పథకాలను తుంగలో తొక్కడం మీ విశ్వసనీయత. రాజశేఖర్ రెడ్డిగారిది సువర్ణయుగమైతే చంద్రబాబునాయుడుగారిది శ్మశానయుగం. తెలుగుదేశం పిలుస్తోంది కదలి రా! అన్నది నాటి నినాదమైతే, తెలుగుదేశం నుండి బయటకు రా! అన్నది నేటి నినాదంగా ఉంది." అని విజయమ్మ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వైయస్ కుటుంబాన్ని ఆదరిస్తున్నందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని ఆమె ప్రజలకు అభివాదం చేశారు.

Back to Top