ఇది దగాకోరు ప్రభుత్వం

జననేతకు జన నీరాజనం
ఘనస్వాగతం పలికిన ప్రజలు,పార్టీశ్రేణులు, అభిమానులు
ప్రజల కష్టాలు తెలుసుకుంటూ మున్ముందుకు
పలు నూతన జంటలకు ఆశీర్వాదం
దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
బాధిత కుటుంబాలకు పరామర్శ
నయవంచకుడు చంద్రబాబుపై ఆగ్రహం

వైఎస్సార్ జిల్లాః  ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పులివెందులలో విస్తృతంగా పర్యటించారు. ప్రజల మధ్య బిజీబిజీగా గడిపారు. ప్రజల కష్టాలు తెలుసుకొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి వారిలో ధైర్యం నింపారు. అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.  ప్రజలు, పార్టీశ్రేణులు, అభిమానులు జననేతకు  ఘనస్వాగతం పలికారు.  అభిమాన నేతతో నాలుగు మాటలు మాట్లాడి, తమ కష్టాలు చెప్పుకున్నారు. ఓ వైపు ఎండ మండిపోతున్నా.. చెరగని చిరునవ్వుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఓపికగా అందరి సమస్యలు వింటూ.. ధైర్యం చెబుతూ వైఎస్ జగన్ ముందుకు సాగారు.


ఎన్నికల ముందు వందలకొద్దీ హామీలిచ్చిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఒక్క హామీ కూడా  నెరవేర్చిన పాపాన పోలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. వంచనతో ప్రభుత్వాన్ని నడుపుతున్న నయవంచకుడు చంద్రబాబు అని  వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చక్రాయపేట, వేంపల్లె మండలాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల వృద్ధులు, మహిళలు.. పింఛన్లు అందడం లేదని, రుణ మాఫీ కాలేదని, రేషన్ కార్డులు, ఇళ్లు మంజూరు చేయడం లేదని వైఎస్ జగన్ కు మొరపెట్టుకున్నారు.


‘అవ్వా బాధపడొద్దు.. మీ అందరి  తరఫున పోరాడుతున్నా.. అసెంబ్లీలో అన్ని సమస్యలపై చంద్రబాబును నిలదీస్తున్నా. అసెంబ్లీలో బాబు  అబద్దం చెప్పి తప్పించుకుంటున్నారే తప్ప.. ప్రజలకు అన్యాయం చేశామన్న ఆలోచన చేయడం లేదు.  ఎవరూ అధైర్యపడొద్దు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకే పోరాడుతున్నా. ఓపిక పట్టండి. త్వరలోనే  మంచి కాలం వస్తుంది.. దేవుడు ఆశీర్వదిస్తే అన్ని పనులు జరుగుతాయని వైఎస్ జగన్ వారికి ధైర్యం చెబుతూ ముందుకు కదిలారు. మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోసారి రుజువైందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నూతన జంటలకు ఆశీర్వాదం
ఇటీవల వివాహం చేసుకున్న పలు జంటలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో వివాహ కార్యక్రమాలకు వెళ్లలేకపోయిన వైఎస్ జగన్ బుధవారం వారి ఇళ్లకు వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. సిద్ధారెడ్డిగారిపల్లెలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు సుబ్బిరెడ్డి కుమారుడు భయారెడ్డి, భావనలతోపాటు దేవరగుట్టపల్లెలో మండల యూత్ కన్వీనర్ వెంకటసుబ్బయ్య సమీప బంధువు నాగప్రసాద్, స్వాతి జంటను ఆశీర్వదించి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. సింగిల్ విండో డెరైక్టర్ వెంకటసుబ్బయ్య కుమారుడు వెంకటకృష్ణ, పెద్దరెడ్డమ్మలను దీవించారు.


దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
గండికొవ్వూరు దర్గాలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ జగన్ వస్తున్న విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున మహిళలు, జనాలు అక్కడికి చేరుకున్నారు. వారి సాధకబాధలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీపంలో ఉన్న మౌళాలి సాహేబ్ దర్గాలో సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు వైఎస్ జగన్‌కు దర్గా విశిష్టతను వివరించారు. జరగబోయే ఉరుసు ఉత్సవాలకు హాజరు కావాలని వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలను ఆహ్వానించారు.


అడుగడుగునా హారతి పట్టిన మహిళలు  
అద్దాలమర్రి మొదలుకొని కుమార కాల్వ, చిరుకాంపల్లె, వెన్నపల్లె, సిద్ధారెడ్డిగారిపల్లె, తక్కళ్లపల్లె, నక్కలదిన్నెపల్లె, కె.రాజుపల్లె, దేవరగుట్టపల్లె, బీసీ కాలనీ, మారెళ్ల మడక, గండికొవ్వూరు, చక్రాయపేట, గండి, కుమ్మరాంపల్లె తదితర గ్రామాల వద్ద ఎక్కడికక్కడ జనమంతా వైఎస్ జగన్ కు నీరాజనం పట్టారు.  మండు వేసవిని సైతం లెక్కచేయకుండా  వైఎస్ జగన్ కోసం రోడ్లపై నిలబడి  వైఎస్ జగన్‌తో కరచాలనం చేశారు. బాణా సంచా పేల్చుతూ ఘన స్వాగతం పలకడంతోపాటు పూల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ గ్రామాల వద్దకు రాగానే చాలాచోట్ల మహిళలు హారతి పట్టి బొట్టుపెట్టి స్వాగతం పలికారు.


పలు కుటుంబాలకు పరామర్శ
ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చక్రాయపేట మండలంలో విస్తృతంగా పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు. ప్రధానంగా సిద్ధారెడ్డిగారిపల్లెలో పంటపై పెట్టిన పెట్టుబడులు రాక.. అప్పులు తీరక ఆత్మహత్య చేసుకున్న రైతు మోహన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. రైతు భార్య కళావతిని ఓదార్చారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన లక్ష్మినారాయణరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి భార్య సావిత్రి, కొడుకు సుబ్బారెడ్డిలను ఓదార్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న మోక్షం రంగారెడ్డి కుమారుడు ఓంకార్‌రెడ్డిని పరామర్శించారు. 

అనారోగ్యంతో మంగళవారం మృతి చెందిన పీరయ్య మృతదేహం వద్ద నివాళులర్పించారు. కె.రాజుపల్లెలో వైఎస్‌ఆర్‌సీపీ గ్రీవెన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు తల్లి, మాజీ సర్పంచ్ సరస్వతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బురుజుపల్లెలో అనారోగ్యంతో బాధపడుతున్న మస్తాన్ కుమారుడు షబ్బీర్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దేవరగుట్టపల్లెలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆళ్ల ఓబులు, గోపాల్, సింగిల్ విండో డెరైక్టర్ వెంకటసుబ్బయ్య, ఓబయ్య, రెడ్డయ్యల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని.. ఎలాంటి కష్టాలు వచ్చినా పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు.


అనారోగ్యంతో బాధపడుతున్న రెడ్డయ్యను పరామర్శించారు. చక్రాయపేటలో అంగన్‌వాడీ టీచర్ తుమ్మల లైజమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఆమె భర్త, బాబును పరామర్శించారు. అనంతరం వేంపల్లె మండలం కుమ్మరాంపల్లె గ్రామంలో మాజీ సర్పంచ్ హనుమంతురెడ్డి చనిపోయిన నేపథ్యంలో ఆయన కుమారుడు, మాజీ సర్పంచ్ రామాంజనేయరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెన్నెముక సమస్యతో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకున్న వేముల మండలం పెద్దజూటూరుకు చెందిన శివశంకర్‌రెడ్డి, వి.కొత్తపల్లెకు చెందిన బండి కొండారెడ్డిలను పులివెందులలోని దినేష్ మెడికల్ సెంటర్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ వెంట వేముల మండల నాయకులు సాంబశివారెడ్డి, వేల్పుల రాము, ఎంపీటీసీ సభ్యుడు మల్‌రెడ్డి, పెద్దజూటూరు సర్పంచ్ రామకృష్ణారెడ్డి, లాయర్ నరసింహారెడ్డి, కొత్తపల్లె కృష్ణారెడ్డి, ప్రసాద్‌రెడ్డి ఉన్నారు.

వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు
పులివెందుల పర్యటనలో ఉన్న జననేతను పలువురు నేతలు కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డిలు వైఎస్ జగన్ వెంట ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, డీసీఎంఎస్ వైస్ చెర్మైన్ ఆవుల విష్ణువర్థన్‌రెడ్డి, జెడ్పీ వైస్ చెర్మైన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, పులివెందుల నియోజకవర్గ నేతలు సాంబశివారెడ్డి, వేల్పుల రాము, మరకాశివకృష్ణారెడ్డి, ఆర్.జనార్థన్‌రెడ్డి, బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, తాలుకా అధికార ప్రతినిధి చవ్వా సుదర్శన్‌రెడ్డి తదితరులు వైఎస్ జగన్‌ను కలిశారు. పార్టీకి సంబంధించిన అంశాలతోపాటు ఇతర విషయాలపై చర్చించారు. కడపకు చెందిన కార్పొరేటర్లు, నాయకులు మాసీమ బాబు, నిత్యానందరెడ్డి, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగులకు చెందిన కార్యకర్తలు కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సి.మధుసూదన్‌రెడ్డి వైఎస్ జగన్‌కు బుద్ధుని ప్రతిమను, పులివెందుల జేఎన్‌టీయూ విద్యార్థులు మెమెంటోను అందించారు. పులివెందుల మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప ఆధ్వర్యంలో పలువురు కౌన్సిలర్లు వైఎస్ జగన్‌ను కలిసి చర్చించారు.

తాజా వీడియోలు

Back to Top