చంద్రశేఖర్‌ దంపతుల విడుదలకు కృషి చేయండి

హైదరాబాద్‌, 8 డిసెంబర్‌ 2012: ఓస్లో జైలులో నిర్బంధంలో ఉన్న ప్రవాసాంధ్రులు వల్లభనేని చంద్రశేఖర్ దంపతుల విడుదల కోసం నార్వే ప్రభుత్వంపై దౌత్యపరమైన వత్తిడి తీసుకురావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ‌ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భారత విదేశాంగ, ప్రవాస వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు శనివారం ఆమె లేఖలు రాశారు. ఓస్లో జైలులో ఉన్న చంద్రశేఖర్‌ - అనుపమ దంపతులు, హైదరాబాద్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వారి ఇద్దరు చిన్నారులను కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించాలని ఆ లేఖలలో శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

తమ పెద్ద కుమారుడు సాయి శ్రీరామ్‌ను వేధించారనే ఆరోపణలపై నార్వేలో జైలుశిక్ష అనుభవిస్తున్న చంద్రశేఖర్, అనుపమ దంపతులను త్వరగా విడుదల ‌చేసేలా చర్యలు చేపట్టాలని శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ పేరుతో వారు తమ కుమారుడిని విపరీతంగా శిక్షించారన్న అభియోగంపై నార్వేలోని ఒక కింది కోర్టు చంద్రశేఖర్‌కు 18 నెలలు, అనుపమకు 15 నెలల జైలుశిక్ష విధించింది. ఏడేళ్ళు, రెండేళ్ళ వయసు ఉన్న వారి ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని తాతగారి ఆశ్రయంలో ఉన్నారు.

విద్యావంతులైన తల్లిదండ్రులెవరైనా తమ పిల్లలు జీవితంలో ఉన్నత స్ధానంలో ఉండాలని కోరుకుంటారని తన లేఖలలో శ్రీమతి విజయమ్మ వివరించారు. నిజానికి సాయి శ్రీరామ్ ఇబ్బందికర ప్రవర్తనపై స్కూలు యాజమాన్యం చేసిన ఫిర్యాదులు, తెచ్చిన వత్తిడి వల్లే చంద్రశేఖర్‌ దంపతులు అతనిని క్రమశిక్షణలో పెట్టాలనుకున్నారని తెలిపారు. 'అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివిటి డిజార్డర్‌' (ఎడిహెచ్‌డి) అనే రుగ్మత కారణంగా సాయి శ్రీరామ్‌ అలా ప్రవర్తించేవాడని ఆమె వెల్లడించారు. స్కూలు యాజమాన్యం వత్తిడి, అంతర్జాతీయ సమాజంలో భారతీయుల గౌరవాన్ని కాపాడుకోవాలన్న ఆతృతతోనే వారు సాయి శ్రీరామ్‌కు క్రమశిక్షణ నేర్పేందుకు యత్నించారని శ్రీమతి విజయమ్మ తన లేఖలలో వివరించారు. అయితే, బాలల హక్కులు, నార్వే చట్టాలను చంద్రశేఖర్‌ దంపతులు పట్టించుకోకుండా ప్రవర్తించారని అక్కడి పోలీసులు అభియోగం మోపారని శ్రీమతి విజయమ్మ ఆ లేఖలలో పేర్కొన్నారు.

చంద్రశేఖర్‌ దంపతులకు నార్వే కోర్టు విధించిన శిక్ష చాలా బాధాకరమైనదని భారతదేశంలోని అత్యధికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. తెలుగువారైనా ఇతరులైనా ఇదే అభిప్రాయంతో ఉన్నారన్నారు. చంద్రశేఖర్‌ దంపతులకు జైలుశిక్ష కారణంగా వారి చిన్నారులకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తమ తల్లి నుంచి విడదీసిన కారణంగా ఇప్పటికే ఆ చిన్నారులు మానసికంగా కుంగిపోతున్నారని వివరించారు.

చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను నార్వే న్యాయ వ్యవస్థను గౌరవిస్తానని శ్రీమతి విజయమ్మ కేంద్ర మంత్రిత్వ శాఖలకు రాసిన లేఖలలో పేర్కొన్నారు. అయితే, చంద్రశేఖర్‌ దంపతుల నుంచి వారి ఇద్దరు చిన్నారులను మరో ఏడాదిన్నర పాటు దూరం చేస్తే వారి జీవితాల్లో ఈ సమాజం సరిదిద్దలేని నష్టం కలిగించినట్లు అవుతుందని శ్రీమతి విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు.

ఐరోపా న్యాయ విధానంలోని సంకుచిత చట్టాల కారణంగా విదేశాల్లో పనిచేస్తున్నతల్లిదండ్రులు తమ పిల్లలను భారతదేశంలోనే విడిచివెళ్ళాలని ఆలోచించే అవకాశం ఉందని, తద్వారా అవాంఛనీయ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదని ఆ లేఖలలో శ్రీమతి విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఐరోపా చట్టాల్లోని సంకుచిత దృష్టి కారణంగా విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళే భారతీయులు మరోమారు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నారు.

ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని నార్వేతో సానుకూలమైన సంప్రతింపులు జరిపి, ఆ ప్రభుత్వంపై దౌత్యపరమైన వత్తిడి తీసుకురావాలని శ్రీమతి విజయమ్మ విదేశాంగ, ప్రవాస వ్యవహారాల మంత్రిలను తన లేఖలలో కోరారు. నార్వే జైలులో ఉన్న చంద్రశేఖర్‌ దంపతులు వారికి దూరంగా ఉంటున్న చిన్నారులు మళ్ళీ త్వరగా ఒక్కటయ్యేందుకు దారులు సుగమం చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున సవినయంగా మనవి చేస్తున్నట్లు ఆ లేఖలలో శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తి చేశారు. నార్వే హైకోర్టులో చంద్రశేఖర్‌ దంపతుల కేసు విచారణకు వచ్చినప్పుడు వారు విడుదలయ్యేలా పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందించాలని కోరారు. నార్వేలోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఈ చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌సిపి తరఫున శ్రీమతి విజయమ్మ అభ్యర్థించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు, అభిమానులు ఆన్‌ లైన్‌ పిటిషన్ల ద్వారా నార్వే ప్రభుత్వాన్ని ఇదే విషయం కోరుతున్న విషయాన్ని శ్రీమతి విజయమ్మ ప్రస్తావించారు.

ఈ కేసుకు సంబంధించి చంద్రశేఖర్‌ తల్లిదండ్రులు పూర్తి వివరాలతో సమర్పించిన లేఖను కూడా తన లేఖతో శ్రీమతి విజయమ్మ జతచేసి పంపించారు.

చంద్రశేఖర్‌ దంపతుల కేసు పూర్తిగా సాంస్కృతిక పరమైన అంతరాలకు సంబంధించినదని శ్రీమతి విజయమ్మ అభివర్ణించారు. ప్రవాస భారతీయులెవరికీ భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదంటే వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయ కుటుంబాలకు స్థానిక చట్టాలు, సంస్కృతులపై ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాయాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే మంచిదని శ్రీమతి విజయమ్మ సూచించారు.
Back to Top