చంద్రబాబుపై షర్మిల విమర్శల పిడుగులు


అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, తొమ్మిదేళ్ళ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకు వైయస్ తనయ, జగన్మోహనరెడ్డి సో దరి అయిన  షర్మిల గురువారం తన విమర్శలతో చుక్కలు చూపించారు. ‘జనం తీవ్రమైన సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ఎల్లో డ్రామాలో భాగంగా పాదయాత్ర చేస్తున్నారు. మాలాంటి వాళ్లు పాదయాత్ర చేస్తే అర్థముంది. ఎందుకంటే మాకు సంఖ్యాబలం లేదు. చంద్రబాబుకు సంఖ్యాబలం ఉంది. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి.. దించేసే శక్తి ఉంది. కానీ.. ఆ పని చేయరు. టీడీపీకీ కాంగ్రెస్‌కు మధ్య రహస్య ఒప్పందం కుదిరింది. ఐఎంజీ భూముల కేసులో విచారణను ఆపుకోవడానికి చీకట్లో చిదంబరాన్ని కలుస్తున్నారు. గొప్పగా మేనేజ్ చేసుకుంటున్నారు. ఇందుకు ప్రతిఫలంగానే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం లేదు. పైగా ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడిగా వ్యవహరిస్తున్నార’ని షర్మిల బాబుపై  మండిపడ్డారు. ‘జగన్ ప్రజల్లో ఉంటే కాంగ్రెస్, టీడీపీలకు ఉనికి ఉండదని భావించారు. అందుకే కలిసి కేసులు పెట్టారు. అరెస్టు చేయించారు. దేవుడనే వాడు ఉన్నాడు. ఉదయించే సూర్యుణ్ని ఎవరూ ఆపలేరు. రాజన్న రాజ్యాన్ని జగనన్న స్థాపిస్తారు. అప్పుడు కోటి ఎకరాలకు నీళ్లందిస్తారు. గుడిసెలేని రాష్ట్రంగా అభివృద్ధి చేస్తారు. ఫీజు రీయింబర్సుమెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను సమర్థంగా అమలుచేస్తార’ంటూ ప్రజలకు ధైర్యం చెప్పారు. గురువారం సుబ్బరావుపేట క్రాస్, తుమ్మలక్రాస్ మీదుగా సాగిన పాదయాత్ర తుమ్మల శివారులో రోడ్డు పక్కన వేసిన గుడారాల వద్దకు చేరింది. షర్మిల అక్కడే బస చేశారు. గురువారం మొత్తం 14.8 కిలోమీటర్లు నడిచారు. మొత్తమ్మీద ఇప్పటిదాకా 120.8 కిమీ నడిచారు. తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా తాడిమర్రి చెరువుకు నీళ్లు నింపేలా చర్యలు తీసుకోవాలని షర్మిలను కోరారు.

ఇందుకు ఆమె స్పందిస్తూ ‘మీ జిల్లాకు ఎంత మంది మంత్రులు ఉన్నారు? వారేం చేస్తున్నారు? సొంత ప్రాంత రైతుల సమస్యలు తీర్చకపోతే మంత్రి పదవుల్లో కొనసాగడమెందుకు’ అంటూ చురకలంటించారు. ‘‘చంద్రబాబు ‘మనసులో మాట’ అని ఓ పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో తన మనసులోని మాటలన్నీ రాసుకున్నారు. వ్యవసాయం దండగట! ఏదీ ఉచితంగా ఇవ్వకూడదట! ఇస్తే ప్రజలు సోమరిపోతులుగా మారుతారట! నీటిపారుదల ప్రాజెక్టులు వృథా అట! రాష్ట్రాన్ని ఓ కంపెనీగా అభివర్ణిస్తూ... సీఈవో తానేనని ప్రకటించుకున్నారు.

అంటే.. చంద్రబాబు వ్యాపారం చేస్తారట! లాభం వచ్చే వ్యాపారం చేస్తారట’ అంటూ ఎద్దేవా చేశారు. ‘మహానేత సీఎంగా పగ్గాలు స్వీకరించగానే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ప్రజలకు సేవ చేశారు. ఈ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతోంది. వ్యాపారులు కావాలో.. ప్రజా సేవకులు కావాలో తేల్చుకోండ’ంటూ ప్రజలకు సూచించారు. ‘మాకు వైఎస్ వంటి ప్రజాసేవకులే కావాలి. చంద్రబాబు వద్దు’ అంటూ ప్రజలు నినదించారు. శివంపల్లిలో రైతులు షర్మిల వద్ద వైఎస్‌ను గుర్తు చేసుకున్నారు.

‘వైఎస్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో మా గ్రామానికి వచ్చి ఎండిపోయిన చీనీ తోటలను పరిశీలించారు. రైతులకు ధైర్యం చెప్పారు.. సీఎం కాగానే మమ్మల్ని ఆదుకున్నారు. మళ్లీ ఇప్పుడు మీరు వచ్చారు. జగనన్న సీఎం కాగానే మమ్మల్ని ఆదుకుంటార’ని అన్నారు. కాగా బుధవారం రాత్రి శివంపల్లి శివారులో షర్మిల పాదయాత్ర ముగించుకుని బసకు చేరుకున్నాక అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి, ఆయన సోదరులు గురునాథరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి ఆమెను కలుసుకుని మాట్లాడారు.

అసలైనా దసరా పండుగ

అసలైన దసరా పండుగ ‘అనంత’ యవనికపై బుధవారం ఆవిష్కృతమైంది. షర్మిల పాదయాత్రకు దసరా పర్వదినమైన బుధవారం జనం నీరాజనాలు పలికారు. పాదయాత్ర సాగే రోడ్లపైనే ప్రజలు పండుగ జరుపుకున్నారు. పండుగ రోజూ షర్మిల పాదయాత్రలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొనడం రాజకీయ పరిశీలకుల మెదళ్లకు పనిపెట్టింది. పాదయాత్రలో భాగంగా మంగళవారం దాడితోటకు 4.5 కిమీ దూరంలో రోడ్డుపక్కన వేసిన గుడారాల్లో బస చేసిన షర్మిల బుధవారం ఉదయం 11 గంటలకు యాత్రను కొనసాగించారు.

చిల్లకొండయ్యపల్లికి చేరుకున్నారు. అక్కడ షర్మిలపై బంతిపూల వర్షం కురిపించిన జనం.. అడుగడుగునా హారతులు పట్టి నీరాజనాలు పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తోండటంతో తమ గ్రామానికి ఇన్‌పుట్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వంటివేవీ అందివ్వకుండా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వేధిస్తున్నారంటూ గ్రామస్తులు వాపోయారు. చిత్రావతి నదిలోకి నీళ్లు విడుదల చేయకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, బోర్లు ఎండిపోయి పంటలు దెబ్బతింటున్నాయని తెలిపారు. కదిరి ప్రాంతం నుంచి తరలివచ్చిన వికలాంగులు పెద్దకోట్ల శివారులో షర్మిలను కలిశారు. ‘అక్కా.. మహానేత వైయస్ మాకు నెలకు రూ.500 పెన్షన్ ఇప్పించి ఆదుకున్నారు. ఈ ప్రభుత్వం వికలాంగుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది. కొత్తగా వికలాంగులకు పెన్షన్ ఇవ్వడం లేదు.

జగనన్న సీఎం అయితేనే మా సమస్యలు తీరుతాయి. అందుకే మీ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నాం. మేం కూడా మీ వెంటే నడుస్తామ’ంటూ మద్దతు పలికారు. పెద్దకోట్లకు చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందు కదిరి ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు షర్మిలను కలిశారు. ‘అమ్మా.. నాకు పింఛన్ నిలిపేసినారు. ఎందుకని అధికారులను అడిగితే నువ్వు ముసలిదానివి కాదని చెబుతాండారు’ అని వాపోయింది. ఇందుకు షర్మిల స్పందిస్తూ ‘ఇది గుడ్డి సర్కారు. కొద్ది రోజులు ఓపికపట్టు అవ్వా.. మనకు మంచి రోజులు వస్తాయ’ంటూ ధైర్యం చెప్పారు. పెద్దకోట్లలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఆ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. పెద్దకోట్ల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్  ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌రెడ్డి సొంతూరైన తాడిమర్రికి చేరుకునే సరికి ఆ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. ఊళ్లోకి ప్రవేశించినప్పటి నుంచి.. నిష్ర్కమించేవరకూ సుమారు కిలోమీటరు మేర బంతిపూల వర్షం కురిపించారు. బోర్లు బావులు ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయామంటూ తాడిమర్రి రైతులు తమ దీనగాథలను విన్పించారు.

తాజా వీడియోలు

Back to Top