కేంద్రం బాబును దొంగలా చూస్తోంది

హైదరాబాద్‌:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును మిత్రపక్షమైన కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోందని, సీఎంను దొంగలా చూస్తోందని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో బీజేపీ, టీడీపీలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో మంగళవారం ఆయన పార్టీలో చేరారు. అనంతరం పార్టీ నేతలతో కలసి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. ఏపీలో భారతీయ జనతా పార్టీకి మనుగడ లేదని, ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలుగా మారారని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ, సీఎం అభ్యర్థిగా చంద్రబాబు అనేక వాగ్ధానాలు చేశారన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక ఈ హామీలు అమలు చేయడం మరిచారని ధ్వజమెత్తారు. 

చంద్రబాబు దొంగలెక్కల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం చంద్రబాబును దొంగలా చూస్తోందని, అందుకే రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని శ్రీనివాస్‌ అన్నారు. ప్రజల కోసం వైయస్‌ జగన్‌ పోరాడుతున్నారని, ఆయన పోరాట పటిమను చూసి తాను వైయస్‌ఆర్‌ సీపీలో చేరానని చెప్పారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని ప్రకటించారు. తనను పార్టీలో చేర్చుకున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి, ఇందుకు సహకరించిన పార్టీ సీనియర్‌ నేతలు పార్థసారధి, వంగవీటి రాధాకృష్ణ, ఎమ్మెల్యేలకు శ్రీనివాస్‌ ధన్యవాదాలు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top