బురదజల్లి లబ్ధి పొందాలనుకుంటున్నారా చంద్రబాబూ!

హైదరాబాద్ 26 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజన రూపంలో రగులుతున్న అగ్ని గుండానికి మంచి ముగింపు ఇవ్వాలని కోరడానికి తమ పార్టీ బృందం మంగళవారం రాష్ట్రపతిని కలుస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ వెల్లడించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమానికీ, అభివృద్ధికీ దోహదపడాలనీ ఆకాంక్షిస్తూ రాష్ట్ర పరిస్థితులను దేశ ప్రథమ పౌరుడి దృష్టికి తీసుకెడతామని చెప్పారు. ఉన్న సమస్యలను పరిష్కరించకుండా విభజన వంటి దుందుడుకు చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని ఇరుప్రాంతాలూ తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందన్నారు. పారిశ్రామికంగా గానీ, సాగు నీటి వనరులు గానీ, ఉద్యోగాలు గానీ, పెట్టుబడిదారులకు భద్రత, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని సముచితంగా ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్రపతిని కోరతామన్నారు. ఇదే అంశంపై మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్‌గుడా జైలులో నిరవధిక దీక్షను ప్రారంభించారన్నారు. రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే రోడ్డుపై దీక్షకు కూర్చోవాలన్నారు. బెయిలు గురించో, రాజకీయంగా రక్షణ కల్పించుకోవడానికో దీక్ష చేయాల్సిన అవసరం శ్రీ జగన్మోహన్ రెడ్డికి లేదని కొణతాల స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యకు దిగారన్నారు.

చరిత్ర మరిచి మహానేతపై నిందలా
దిగ్విజయ్ సింగ్ మొదలు ప్రతిపక్ష నాయకుడు, అధికార పక్ష నాయకులనుంచి ప్రతి ఒక్కరూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డిగారే తెలంగాణకు బీజం వేశారని నిందిస్తున్నారని ఆరోపించారు. మహానేత హయాంలో రోశయ్య కమిటీ విధివిధానాలు కాంగ్రెస్, టీడీపీ నేతలకు తెలియవా అని నిలదీశారు. మరణించిన ఆ మహానుభావుడిపై అభండాలు వేయడం తగదన్నారు. అప్పట్లో ఉన్న మిగిలిన రాష్ట్రాల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని డాక్టర్ వైయస్ఆర్ రెండో ఎస్సార్సీ వేయాలని కోరిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 2008 డిసెంబరులో అసెంబ్లీలో దివంగత మహానేత మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంటు తనకి తెలుసుననీ, దానిని తాను గౌరవిస్తాననీ చెప్పిన విషయాన్ని కొణతాల ప్రస్తావించారు. అప్పటి రోశయ్య కమిటీలో తానూ సభ్యుడినేనని కొణతాల గుర్తుచేశారు.  మహానేత మరణానికి ముందు 2009 మార్చిలో పరిష్కరించాల్సిన అంశాలు తొమ్మిదింటిని గుర్తించి శాసన సభకు నోట్ అందజేశారన్నారు. ఇలాంటి నిర్ణయాన్ని విడిచిపెట్టి, ఆయన వల్లే రాష్ట్రం విడిపోతోందని నిందలు వేసేయడం తగదన్నారు.  ఈ అంశంలో టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 2008లో ఆ పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చిన విషయాన్ని కొణతాల గుర్తుచేశారు.రోశయ్య గారి అధ్యక్షతన సెక్రటేరియేట్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ మరో ఉత్తరం ఇచ్చారన్నారు. 2009లో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలోనే ప్రకటించారన్నారు. 2012 డిసెంబరులో జరిగిన సమావేశంలో మరోసారి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారని చెప్పారు. తెలంగాణకు ప్రధానంగా దోహదపడింది టీడీపీయేనని ఆయన స్పష్టంచేశారు. తాను నాలుగుసార్లు లేఖలు ఇచ్చిన విషయాన్ని మరిచి ఎదుటివారిని నిందించడం గర్హనీయమన్నారు. రూ. 4 లక్షల కోట్లతో సీమాంధ్రను అభివృద్ధి చేసుకుందామని చంద్రబాబు తెలిపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వాళ్ళ ఆలోచన తీరులో మార్పు వచ్చి ఉంటే ఇప్పటికైనా తమ లేఖను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

టీడీపీ, కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి విభజనపై వైఖరి స్పష్టం చేయాలి డిమాండ్ చేశారు. తెలంగాణపై లేఖకు కట్టుబడి ఉంటారో.. సమైక్యాంధ్రకు  కట్టుబడి ఉంటారో స్పష్టం చేయాలని సూచించారు.

కలిసి పోరాడదాం రండి
 సమస్యలను పరిష్కరించలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్నామన్నారు. తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు చరిత్ర మరిచిపోతారనుకోవడం మంచిది కాదన్నారు. కృష్ణా జలాలు, రాజధానిలో వచ్చే ఆదాయం, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన శాలలు, భారీ పరిశ్రమలు, రాజధాని సమస్య తదితరాల పరిష్కారంపై ఆలోచించాలన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సమస్య కాదనీ, రాష్ట్ర ప్రజలకు సంబంధించిందని గుర్తించాలన్నారు. దీనికోసం అన్ని వర్గాలతో ప్రభుత్వ కమిటీని వేయాలని ఆయన సూచించారు. వెనుకబడిన ప్రాంతాలను ఏరకంగా అభివృద్ధి చేయాలో సూచించే రోడ్ మ్యాప్ రూపొందించాలన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేశామని చేతులు దులుపుకుంటే చాలదని కొణతాల స్పష్టం చేశారు. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు మహానేత ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించి, దాని పూర్తికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితేనే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందనీ, లేకపోతే ఎడారిగా మారుతుందనీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆస్తుల, అభివృద్ధితో అన్నదమ్ముల్లా విడిపోయేలా చేయాలి కానీ, యుద్ధ వాతావరణాన్ని సృష్టించి, కాంగ్రెస్ స్వీయప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడదీసేస్తామనడం తగదని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్ళి మీరేమైనా చేయండి.. మద్దతిస్తామని చెప్పి, ఇక్కడికొచ్చి ఓ ప్రాంతంలో రాజీనామాలు, ఆందోళనలు చేయించి డ్రామాలాడించడం టీడీపీకి తగదన్నారు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవమున్న చంద్రబాబుకు మొసలి కన్నీరు కారుస్తూ ఒకరిమీద నిందవేసి తప్పించుకోజూడటం మంచిది కాదన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని రాజీనామాలు చేయాలని కొణతాల డిమాండ్ చేశారు. అందరం సమష్ఠిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని భావించాలి తప్ప ఎదుటివాడి మీద బురదజల్లేసి, లబ్ధి పొందాలని చూడడం సమంజసం కాదన్నారు. రోమ్ నగరం తగులబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు.. చంద్రబాబుగారు ఇక్కడ కూర్చుంటారు.. పార్లమెంటు ఆవరణలో ఆయన ఎంపీలు ధర్నా చేస్తుంటారని ఎద్దేవా చేశారు. ఈ ద్వంద్వ వైఖరిని ఇప్పటికైనా కట్టిపెట్టాలని హితవు పలికారు. మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు...మేం ప్రతిపక్షంగా ఉన్నాం.. ఈ సమస్య మీద కలిసిపోరాడదాం రండని చంద్రబాబును కొణతాల కోరారు.

Back to Top