కొల్లేరు ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లు..!అడ్డుకునేందుకు వచ్చిన అధికారులపై బెదిరింపులు..!<br/>మచిలీపట్నం : రోజురోజుకు పచ్చనేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అడ్డొచ్చిన అధికారులపై దాడులు చేయడం, అందినకాడికి దోచుకోవడం పచ్చచొక్కాలకు మామూలైపోయింది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీరీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు మరోసారి అధికారులపై దాడులకు తెగబడ్డారు. కోల్లేరు ప్రాంతంలో నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తున్న రోడ్డును అడ్డుకోబోగా...అధికారులపై దౌర్జన్యానికి దిగారు. తమ అక్రమవ్యాపారాల కోసం అడ్డగోలు వ్యవహారాలు చేపడుతూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. <br/>దాడులు, దౌర్జన్యాలు..!కొల్లేరు నిషేధిత ప్రాంతమైన ఆటపాక-కోమటిలంక మధ్య నిషేదాజ్ఞలు ఉల్లంఘించి...రాత్రికి రాత్రే చింతమనేని బ్యాచ్ రోడ్డు నిర్మించింది. అడ్డుకునేందుకు వచ్చిన అధికారులపై చింతమనేని, అతని అనుచరగణం దురుసుగా ప్రవర్తించడమే గాకుండా...తనపై కేసు పెట్టుకో అంటూ బెదిరింపులకు దిగి రోడ్డు తంతు కానిచ్చారు. దీంతో, అటవీశాఖ డిప్యూటీ రేంజర్ ఈశ్వరరావు కైకలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతమనేనితో పాటు 60మంది అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. <br/>చంద్రబాబు అండతో బెదిరింపులు..!గతంలోనూ ఓసారి ఇక్కడ చింతమనేని రోడ్డు వేయాలని చూడగా..అక్కడ పక్షుల కేంద్రం ఉండడంతో ఎలాంటి రోడ్లు వేయవద్దని అటవీశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐనా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు అండతో చింతమనేని రెచ్చిపోతున్నారు. ఇటీవలే కృష్ణాజిల్లాలో తన ఇసుక తవ్వకాలను అడ్డుకుందని ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.