ప్రజలారా..పగటి వేషగాళ్లొస్తున్నారు జాగ్రత్త

  • కాకినాడను స్మార్ట్ సిటీ చేస్తామని చొప్పి టీడీపీ మోసం చేసింది
  • టక్కుటమార విద్యలతో మళ్లీ మీ ముందుకు వస్తున్నారు
  • కాకినాడల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..బాబుకు తగిన బుద్ధి చెప్పాలి
  • కాకినాడలో బీజేపీతో పొత్తు..నంద్యాలలో మాత్రం పచ్చటోపీలతో ప్రచారం
  • ముస్లింలను మోసం చేసేందుకు బాబు ఎత్తుగడ
  • వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
కాకినాడః అధికార తెలుగుదేశం పార్టీ కాకినాడలో బీజేపీ కండువాలు వేసుకొని తిరుగుతూ...నంద్యాలలో మాత్రం కేవలం పచ్చకండువాలు వేసుకొని తిరగడమేంటని  వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నంద్యాలలో ముస్లిం ఓట్ల కోసమే బాబు బీజేపీ కండువాలను పక్కనబెట్టారని అన్నారు. ముస్లింలను మోసం చేసేందుకు పచ్చటోపీలు పెట్టుకొని ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. టీడీపీకి ఓ విధానం గానీ, సిద్ధాంతాగానీ ఉందా..? అని బొత్స నిప్పులు చెరిగారు. పక్క జిల్లాల నుంచి కో ఆర్డినేటర్స్ ను తీసుకొచ్చి టీడీపీకి ఓటేయకపోతే ఇళ్లు, పెన్షన్ రద్దు చేస్తామని ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.  బీజేపీ మంత్రి మాణిక్యాలరావు కాకినాడలో పర్యటిస్తూ బీజేపీ అభ్యర్థిని గెలిపించమని ప్రచారం చేస్తున్నారని..మరి నంద్యాలలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ముస్లింలకు ఎక్కడ కోపమొస్తుందో, మననుంచి ఎక్కడ వేరవుతారోనని భయపడే బాబు ఇక్కడ మెడలో బీజేపీ కండువాలు..అక్కడ పచ్చటోపీలు ధరిస్తున్నారని చురక అంటించారు. టీడీపీ నేతలు పగటి వేషగాళ్లాగ వస్తున్నారని....టక్కుటమార విద్యలతో మభ్యపెట్టి, కాకినాడను దోచుకునేందుకు వస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలు మోపిదేవి వెంకటరమణ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలతో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 

కాకినాడను రెండున్నరేళ్ల కిందట స్మార్ట్ సిటీగా ప్రకటించారు. రూ. 1900కోట్లు స్మార్ట్ సిటీగా చేసేందుకు కేంద్రం కేటాయింపులు చేసింది.  సంవత్సరానికి రూ.400 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి సంవత్సరం  రిలీజ్ చేశారు. కేవలం రూ.5కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అవినీతి దాహంతో అధికార టీడీపీ అభివృద్ధి పేరిట కేంద్రం నుంచి వచ్చిన నిధులను దోచుకుంటోందని బొత్స ఆరోపించారు. ప్రారంభ దశ నుంచే స్థానిక టీడీపీ నేతలు లోకేష్ తో లాలూచీ అయి దోపిడీకి తెరలేపారన్నారు.  కాకినాడ పట్టణంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఇది వాస్తవం కాదా..? టీడీపీ సమాధానం చెప్పాలి. కాకినాడ ప్రజల్లారా రేపు మీ దగ్గరకు వస్తున్నారు. స్మార్ట్ సిటీ చేస్తానని చెప్పి ఎందుకు దోపిడీ చేస్తున్నారో అడగండి.  చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ముందుకెళ్లలేదని చొక్కా పట్టుకొని అడగండి. ఇదేనా పరిపాలన..? ఇలాగేనా దోపిడీ..? అని  టీడీపీ నేతలను నిలదీయాలని బొత్స పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే తూర్పుగోదావరి జిల్లాను అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు ప్రకటించారు. కాకినాడ స్మార్ట్ సిటీ చేస్తాం, పెట్రోలియం యూనివర్సిటీ తీసుకొస్తాం. ఎల్ అండ్ టీ టర్మినల్, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం, తెలుగు విశ్వవిద్యాలయం, కోనసీమలో కొబ్బరిపీచు పరిశ్రమ, ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని అట్టహాసంగా చెప్పారు. ఏ ఒక్కటైనా మచ్చుకు తీసుకొచ్చారా.? మాటలే తప్ప కార్యాచరణ లేదు. ఇవాళ తగుదనమ్మా అంటూ ఇంటింటికీ తిరుగుతూ వైకుంఠం చూపెడతామని చెప్పుకొస్తున్నారంటూ చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

కాకినాడ ఏమాత్రమైనా అభివృద్ధి జరగిందంటే అది వైయస్ఆర్ హయాంలో జరిగిందేనని తెలిపారు. దురదృష్టంకొద్దీ ఆయన మరణం తరువాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఇంకో సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయని, వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జగన్ నాయకత్వంలో ఏపీలోనే  కాకినాడను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో తిరుగుతూ కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటూ అడుగడుగునా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ముద్రగడ పోరాటానికి ఆ జాతి అంతా మద్దతు తెలిపిందన్నారు. ప్రభుత్వానికి ఉద్యమం పట్ల, ఉద్యమాకారుల పట్ల , సమస్యలు, జాతుల పట్ల ఎంత హేళన ఉందో ప్రజలు గమనించాలన్నారు. పాదయాత్రలు, మోకాలి యాత్రలకు పర్మిషన్ లు ఉండవంటూ చంద్రబాబు హోంమంత్రితో చెప్పించడం దారుణమన్నారు.  యావత్ జాతిని అవమానంచడం కాదా..? బాధ్యతగల ముఖ్యమంత్రి హేళన చేస్తుంటే నిలదీయాల్సిన బాధ్యత మంత్రికి లేదా అని బొత్స ఫైర్ అయ్యారు. ఏపీలో విశాఖ తర్వాత తీర ప్రాంతం, పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం కాకినాడ అని అన్నారు. విశాఖలో వేలాది ఎకరాలను మింగేసిన టీడీపీ నేతలు మళ్లీ కాకినాడకు వస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రతిపక్షంగా కాకినాడ సమగ్ర అభివృద్ధికి  మా వంతు కృషి చేస్తామన్నారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో వైయస్సార్సీపీ అభ్యర్థులకు సహకరించాలని కోరారు. ప్రభుత్వం మూడేళ్లలో చేసిన అరాచకానికి, అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 

Back to Top