అవకాశవాదులను తరిమికొట్టండి

నాయుడుపేట (నెల్లూరు జిల్లా) :

విభజన శక్తులు, అవకాశవాదులను తరిమికొట్టాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు ప్రజల సంక్షేమం కన్నా తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి రాజకీయ విధానంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ శ్రీ వైయస్ జగ‌న్ చే‌స్తున్న సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం నెల్లూరు జిల్లాలో కొనసాగింది. నాయుడుపేట, మునుబోలు, గూడూరుల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.

ఓట్లు, సీట్ల కోసం, కొడుకును ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకోవడం కోసం సోనియా గాంధీ మన రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు సహకరిస్తున్నారని శ్రీ జగన్ ఆరోపించారు. తెలంగాణ ఎమ్మెల్యేలతో జై తెలంగాణ అనిపించి, సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర నినాదాలు చేయించిన చంద్రబాబు తమ పార్టీ విధానం ఏమిటో వెల్లడించలేదన్నారు. ‘జై సమైక్యాంధ్ర’ అనడానికి చంద్రబాబుకు నోరెందుకు రాలేదన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు సీఎం పదవికే కాకుండా కుమ్మక్కు రాజకీయాలతో ప్రతిపక్ష స్థానానికీ మచ్చ తెచ్చారని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. పార్టీ అధినేతగా ఉండి ఒక సమస్యపై ఒక్కొక్కరితో ఒక్కోలా మాట్లాడించే చంద్రబాబు అసలు నాయకుడేనా అని ప్రశ్నించారు. సోనియా అడుగులకు మడుగులొత్తుతున్న కిరణ్‌ను, ప్యాకేజీలతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు వైఖరిని శ్రీ జగన్‌ తీవ్రస్థాయిలో ఎండగట్టారు.

‘మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి మరణించి నాలుగున్నరేళ్లు దా‌టుతున్నా ఇప్పటికీ ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నారు. ఆ మహానేత పేరు వింటే చంద్రబాబు లాంటి వారి గుండెల్లో ఇప్పటికీ రైళ్లు పరిగెడతాయి. ఇప్పటికీ చంద్రబాబు వైయస్‌పై బురద చల్లని రోజు లేదు. శ్రీ జగన్‌ను విమర్శించని రోజు లేదు. అధికారంలోకి వచ్చేందుకు ఎత్తులు, పైఎత్తులు, వెన్నుపోట్లు, కుమ్మక్కు రాజకీయాలనే నమ్ముకున్న చంద్రబాబు లాంటి వారికి మాట తప్పని, మడమ తిప్పని వైయస్ అన్నా, రాజకీయాల్లో ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వారన్నా గుండెల్లో రైళ్లు పరిగెత్తడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. చంద్రబాబు ‌సీఎంగా ఉన్న ఆ భయానక రోజులు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయ'ని శ్రీ జగన్‌ అన్నారు.

జనం గుండె చప్పుడు విన్న నేత వైయస్‌ :
‌'తొమ్మిదేళ్ల చంద్రబాబు రాక్షస పాలనను అంతం చేసేందుకు మహానేత వైయస్ఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఎర్రటి ఎండల్లో 1,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అధికారం చేపట్టిన మరుక్షణమే పేదరికానికి వైద్యం చేసే డాక్టరయ్యారు. పెద్ద చదువులకు పేదరికం అడ్డు కాకూడదని ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదల కోసం ‘ఆరోగ్యశ్రీ’ తెచ్చారు. అక్కాచెల్లెళ్లను లక్షాధికారులను చేసేందుకు పావలా వడ్డీ పథకం పెట్టారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు, నిజాయితీకి చిరునామాగా నిలిచారు. కానీ వైయస్ఆర్ మనకు దూరమయ్యాక రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థే చెడిపోయింది. రాజకీయాలంటే ఎత్తులు, జిత్తులతో కూడిన చదరంగంగా మార్చేశా‌ర'  శ్రీ జగన్‌ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ప్రెస్‌మీట్ పెట్టి‌న చంద్రబాబు అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు చెప్పారని శ్రీ జగన్‌ అన్నారు. మా రాష్ట్రాన్ని విభజించడానికి అంగీకరించనని సోనియా ముఖాన కిరణ్ రాజీనామా లేఖ పడేస్తే పరిస్థితి ఇంత వరకూ వచ్చేదా?‌ అని ప్రశ్నించారు.

Back to Top