భావోద్వేగానికి గురైన విజయమ్మ

హైదరాబాద్, 3 ఏప్రిల్‌ 2013: దివంగత‌ మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి మాతృమూర్తి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ 'కరెంట్‌ సత్యాగ్రహం' వేదికపైన ఒక్కక్షణం ఉద్వేగానికి గురై గంభీరంగా మారిపోయారు. దుఃఖం పొంగిరావడంతో కన్నీరు పెట్టుకున్నారు. విద్యుత్ ‌ఛార్జీల పెంపునకు నిరసనగా‌ శ్రీమతి విజయమ్మ నేతృత్వంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చే‌స్తున్న నిరవధిక నిరాహార దీక్ష ప్రాంగణంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖ‌రరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ కళాకారులు పాడిన పాటలు ఆమెను కదిలించాయి. 'జగనన్నా మా తోడు ఉండే...మా షర్మిలక్క నడుము గట్టెనూ.. మా విజయమ్మా దీక్ష జేసెనూ... అన్నా రాజశేఖరన్నా...' అంటూ కళాకారులు పాడుతుండగా శ్రీమతి విజయమ్మ మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌ను స్ఫురణకు తెచ్చుకుని విచార వదనంతో కనిపించారు. మహానేత డాక్టర్‌ వైయస్ ‌మరణించడంతో రాష్ట్ర ప్రజలతో పాటు ఆయన కుటుంబం పడుతున్న కష్టాలను కళాకారులు పాటల రూపంలో వినిపించారు. ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న వైయస్‌ను కీర్తిస్తూ పాడిన పాటలతో విజయమ్మ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. దీనితో దీక్షా ప్రాంగణంలో ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొన్నది.
Back to Top