బెయిలును అడ్డుకోవడమే వారి అజెండా

అనంతపురం

: ‘రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టాయి. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ను అడ్డుకోవడమే అజెండాగా పెట్టుకున్నాయ’ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ శంకరనారాయణ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయలుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జగన్ విడుదలైతే తమ పార్టీలు గల్లంతవుతాయనే భయంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ ఇష్టానుసారం ఛార్జిషీట్లు వేస్తూ జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకుంటోందని విమర్శించారు. చంద్రబాబు అధికార దాహంతోనే పాదయాత్ర చేపట్టారన్నారు. అధికారం కోసం పగటి కలలు కంటున్నారని విమర్శించారు. అసలు ఆయనకు విశ్వసనీయత ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి రెండు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదన్నారు. మహానేత వైయస్ ఆశయాలకు తూట్లు పొడుస్తోందన్నారు. గ్రామాల్లో డెంగీ, చికెన్ గన్యా, విషజ్వరాలతో ప్రజలు మృత్యువాత పడుతున్నా పట్టించుకోలేదన్నారు. గుక్కెడు తాగునీరూ ఇవ్వలేని దుస్థితిలో ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీ విధానాల వల్ల ప్రజలు వైఎస్సార్ సీపీ వైపు వస్తున్నారని తెలిపారు. గుత్తి మాజీ సర్పంచ్ హుస్సేన్‌పీరా, ఆయన సోదరుడు, రిటైర్డ్ డీఎస్పీ వన్నూర్‌సాబ్‌తో పాటు వందలాది మంది ఆదివారం పార్టీలో చేరారన్నారు. శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శరత్ చంద్రారెడ్డి కూడా ఈ నెల 16న పార్టీలో చేరతారని వెల్లడించారు. ఇప్పటికే గార్లదిన్నె టీడీపీ నాయకుడు అమరేంద్రనాథ్ రెడ్డి పార్టీలోకి వచ్చారన్నారు. బోరంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ‘అనంత’కు ఒరిగిందేమీ లేదన్నారు. ఫ్యాక్టరీలను మూయించి వేలాది మంది ఉపాధి దెబ్బతీశారన్నారు.‘చంద్రబాబు తీరు ఏ కులం వారు ఆ పనే చేయాలనే విధంగా ఉంటుంది. టీడీపీలో బీసీలకు స్వేచ్ఛ లేదు. అందుకు నిదర్శనం నిమ్మల కిష్టప్పే’నని విమర్శించారు. సమావేశంలో వైయస్ఆర్‌ సీపీ శింగనమల నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆలూరు సాంబశివారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, రాప్తాడు మండల కన్వీనర్ భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

Back to Top