పబ్లిసిటీ బాబు


ఢిల్లీ పార్లమెంటు ముందు ఫోజులు అయిపోయాయి. ముఖ్యులతో ఫొటోలు అయిపోయాయి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా లాగా ఢిల్లీ కి వచ్చామా, ఫొటోలకు ఫోజులిచ్చామా, ఎమ్.పిలతో షేక్ హేండ్ ఇచ్చామా అన్నట్టు అయిపోయింది. ఇదంతా బాబు మొక్కుబడి వ్యవహారం అంటూ సోషల్ మీడియా ఏకి గీకి హడావిడి చేసినా బాబు టార్గెట్ మాత్రం రీచ్ అయిపోయాడు. అంతకు మించి ఏదైనా చేయాలి అనే ఆలోచన అర్థరాత్రి పుట్టింది బాబుకి. అందుకే కేంద్రం రాష్ట్రానికి ఎలా అన్యాయం చేసిందో నేను మీడియా కి చెబుతా...అన్నాడు. 

’అదేంటి మీడియాకు ఎందుకు తెలియదు...అసలీ వ్యవహారం అంతా జరుగుతున్నది, తమరు ఢిల్లీ దాకా వచ్చి సీరియస్ యాక్టింగ్ చేస్తున్నదీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అటు ప్రతిపక్షం, ఇటు మీడియా చెబుతుండబట్టే కదా’...ఎవరికో సందేహం వచ్చింది...
అంటే జాతి మీడియాకు నే ఎంత చెబితే అంత కానీ, జాతీయ మీడయాలోనూ కాస్త పాపులారిటీ కావాలిగా...పైగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లంటే నాకెంత ఇష్టమో మీకూ తెలుసు కదా. విజన్ 2020 నుంచి రాజధాని గ్రాఫిక్స్ దాకా ఏదైనా నాకు ప్రజెంటేషన్ చేయందే సంతృప్తిగా ఉండదు  అన్నాడు బాబు.
మీ డెమో ప్రజంటేషన్ లో ఏం చెప్ప బోతున్నారు? అడిగారు వాళ్లు.
బిజెపి టిడిపికి అన్యాయం చేసింది?
అంటే ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేయలేదా?
నాకు అన్యాయం చేస్తే నా పార్టీకి చేసినట్టే, నా పార్టీకి చేస్తే రాష్ట్రానికి చేసినట్టే అదీ లెక్క. 
సరే మీకు, మీ పార్టీకీ ఏం అన్యాయం జరిగింది?
విభజన హామీలు నెరవేర్చకపోవడం వల్ల నాకూ, పార్టీకి, తద్వారా రాష్ట్రానికి అన్యాయం జరిగింది.
అవి నెరవేర్చమని మీరెందుకు పట్టుబట్టలేదు?
అప్పుడు ఎన్నికలు దగ్గర్లో లేవు..
సరే విభజన హామీలు కేంద్రం నెరవేర్చలేదు. దాని వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం...మరి మీకెలా నష్టం..?
మోదీ ప్రభుత్వం ఆ పని చేసేసుంటే అదంతా నా ఘనతే అని చెప్పేసుకునేవాడిని. నా వల్లే రాష్ట్రానికి అన్నీ వచ్చాయని చెప్పుకుని మళ్లీ ఎన్నికల్లో జెండా ఎగరేసే వాడిని...నాకా అవకాశం లేకుండా చేసింది బిజెపి. 
కేంద్రం ఆల్రెడీ అన్నీ ఇచ్చేసిందని మీరు చాలా సార్లు చెప్పారే?
వాట్ ఐ యామ్ సేయింగ్ ఈజ్  చెప్పింది చెప్పినట్టు చెప్పడం నా పాలసీ కాదు. చెప్పిందో, చెప్పందో చెప్పి, చెప్పాననో, చెప్పలేదనో చెప్పడం నా పద్ధతి. 
కేంద్రం ప్యాకేజీ ఇస్తానంటే ఒప్పుకున్నారుగా అని జాతీయ మీడియా అడిగితే ఏం చెబుతారు?
ప్యాకేజీ ఇస్తానన్నప్పుడు పరిస్థితులు వేరు..ఇప్పుడు వేరు అని చెబుతాను..
అఖిల పక్షం పెట్టారుగా ఏం సాధించారు?
ప్రధాన ప్రతిపక్షాల వ్యతిరేకత. 
మరి ఢిల్లీకొచ్చి ఏం సాధించారు?
పబ్లిసిటీ..

 
 
Back to Top