బాబు అవినీతి పంచభూతాలకు పాకింది

– ఏపీ జీడీపీ వృద్ధి 5 శాతమే 
– తప్పుడు లెక్కలతో బాబు ప్రజలను మోసగిస్తున్నాడు
– చంద్రబాబు మోసాన్ని ప్రధానికి వివరిస్తాం
– సీఎం అయ్యాక మూడు ప్రధాన రంగాలు కుదేలు 
– సంక్షోభాన్ని ఎదుర్కోవడమంటే మంచి రేటుకు హెరిటేజ్‌ను ఫ్యూచర్‌ గ్రూపుకు అమ్ముకోవమా..?
– చంద్రబాబుపై విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ ధ్వజం 

విశాఖపట్నం: సామాన్య జనానికి అర్ధంకాని జీడీపీ తప్పుడు లెక్కలతో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం కేవలం 5 శాతమే వృద్ధి రేటు సాధిస్తే కేంద్రాని కంటే అద్భుతంగా సాధించినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు లెక్కలని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తరఫున ఎవరైనా రావొచ్చని సవాల్‌ విసిరారు. చంద్రబాబు డ్యాష్‌ బోర్డులోని లెక్కలను ప్రధానికి వివరించి  అసత్యాలను ప్రచారం చేసుకోవడంపై అవగాహన కల్పిస్తామన్నారు. నోట్ల రద్దుకు తన లేఖ కారణమని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రజలు పడే కష్టాలకు కూడా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం 9.5లక్షల హెక్టార్లకు పడిపోయిందని గత ఏడాది ఇదే సమయంలో 14 లక్షల హెక్టార్లుగా ఉందని వివరించారు. బాబు ముఖ్యమంత్రి అయ్యాక ఏటా సాగు విస్తీర్ణం తగ్గి రైతులు కూలీలుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువుతో అల్లాడిపోతుంటే ప్రత్యామ్నాయం చూపకపోగా నదుల అనుసంధానం, పట్టిసీమ నది అంటూ కాలక్షేపం చేశారే తప్ప రెయిన్‌ గన్‌లతో ఒక్క ఎకరానికైనా నీరిచ్చారా అని ప్రశ్నించారు. 

మూడు ప్రధాన రంగాలు కుదేలయ్యాయి
నోట్ల రద్దు కారణంగా మూడు ప్రధాన రంగాలు కుదేలయ్యాయని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రబీకి విత్తనాలు కొనేందుకు, ఎరువులకు డబ్బుల్లేక నోట్లరద్దుతో రైతులు వ్యవసాయానికి దూరమయ్యారని గతేడాది తీవ్ర కరువు పరిస్థితుల్లో కూడా దాదాపు 14లక్షల హెక్టార్లలో సాగు చేశారని వెల్లడించారు. తాను చెప్పే ఈ గణాంకాలన్నీ ప్రభుత్వ లెక్కలే తప్ప మేము చెప్పేవి కాదన్నారు. నిర్మాణం రంగం, పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలు నోట్ల రద్దుతో పూర్తిగా కనుమరుగైన పరిస్థితి నెలకొందన్నారు. ఒక్క నిర్మాణ రంగంపై ఆధారపడి సిమెంట్, ఇసుక, హార్డ్‌వేర్, ఇనుము, తాపీ మేస్త్రీలు, కూలీలు ఇలా వందల రంగాలు వీధిన పడే పరిస్థితి నెలకొందని వివరించారు. కూలీలు ఉపాధి దొరక్క పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క పరిశ్రమ అయినా ఏపీకి తెప్పించగలిగారా అని ప్రశ్నించారు. మరో ప్రధానమైన సేవా రంగం కూడా దిక్కులేని స్థితిలో ఉందన్నారు. మూడేళ్ల కాలంలో రాష్ట్రానికి ఒక్క ఐటీ కంపెనీని కూడా తెప్పించలేకపోయిన అసమర్థుడు బాబు అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సింగపూర్, చైనా, జపాన్, దుబాయ్, మలేసియా వెళ్లిన ఫొటోలు చూసి మురిసిపోవడమే తప్ప ఇంకేమీ సాధించలేదన్నారు. అన్ని రంగాలు కుదలైతే జీడీపీ ఎలా పెరిగిందో అర్థం కావడం లేదని... పరిశ్రమలు స్థాపించకుండా ఉద్యోగాలు ఎలా వస్తాయి.. నిరుద్యోగం ఎలా పోతుందని ప్రశ్నించారు. 

అవినీతిలో మిన్న.. అభివృద్ధిలో సున్నా
మూడేళ్ల చంద్రబాబు పాలనలో పెరిగింది అవినీతి తప్ప అభివృద్ధి ఆనవాళ్లు భూతద్దం పెట్టి వెతికినా కనబడటం లేదని బొత్స పేర్కొన్నారు. బాబు హయాంలో ఆయన కుటుంబం, ముంత్రులు, ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీలు తప్ప సామాన్య ప్రజలు ఒక్కరూ బాగుపడలేదని వెల్లడించారు. మీ ఆదాయం పెంచుకున్నారే తప్ప ఒక్కరికైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. సీనియర్‌ ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న బాబు 13 జిల్లాల్లో శాంతిభద్రతలు కాపాడలేకపోతున్నారని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని నిత్యం రాష్ట్రం నలుమూలలా ఏదో ఒక చోట వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సహచర మంత్రులే జడ్పీటీసీలను వేధిస్తుంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే మహిళల పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. పైగా జడ్పీటీసీ జానీమూన్‌ మీడియా వద్దకు వచ్చి మంత్రి రావెల కిశోర్‌బాబు నుంచి ప్రాణ హాని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తే.. మంత్రేమో ఆమె మీద అవినీతి ఆరోపణలు చేస్తే దీన్ని పార్టీ విషయంగా చూపించి కేసును మూలన పడేయడం దారుణమన్నారు. అమరావతి చుట్టుపక్కలా అవినీతి రాజ్యమేలుతుందున్నారు. విత్తనాలు, నెయ్యి, కారం ప్రతిదానిలోనూ అవినీతి చోటుచేసుకుంటున్నా ముఖ్యమంత్రిలో చలనం లేదన్నారు. హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని తెలిపారు. పట్టిసీమ పేరు చెప్పి.. నకిలీ విత్తనాలు  అమ్ముకుని విచ్చలవిడిగా నల్లధనం కూడబెట్టిన ముంత్రులు కూడా గాంధేయ వాదుల్లాగా ఉపన్యాసాలు ఇవ్వడం దౌర్భాగ్యమన్నారు. అధికారం చూసుకుని వి్రరవీగే వారంతా తొందర్లోనే మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. 

సంక్షోభాన్ని అవకాశంగా తీసుకోవాలంటే ఇదా..
సంక్షోభాన్ని అవకాశంగా తీసుకోవడమంటే నోట్ల రద్దు చేస్తారని తెలిసి హెరిటేజ్‌ను ఫ్యూచర్‌ గ్రూపుకు అమ్ముకోవడమేనా అని ఎద్దేవా చేశారు. ఇది నిజంగా జాతి ద్రోహమేనని మండిపడ్డారు. నోట్ల రద్దుతో ప్రజలంతా నానా అవస్థలు పడుతుంటే చంద్రబాబు మాత్రం తానేదో ఘనకార్యం చేసిన మాదిరి మీడియా సమావేశాలు పెట్టుకుని పబ్లిసిటీ పొందడం ఏం బాలేదన్నారు. పేపర్లలో ఫొటోలు వేయించుకుంటేనో.. బ్యాంకర్లను తిట్టిపోస్తేనే డబ్బులు రావని ఆర్బీఐ అధికారులతో మాట్లాడితే ప్రయోజనం ఉంటుందని హితవు పలికారు. దాదాపు 40 శాతం మంది నోట్ల రద్దు తర్వాత పింఛన్లు రావడం లేదని దుయ్యబట్టారు. ఉపముఖ్యమత్రి మాట్లాడుతూ తమ జిల్లాకు రావడానికి చంద్రబాబు భయపడుతున్నారని చెప్పడం చూస్తుంటే ప్రజలు ఆయన మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వారు ఎక్కడ నిలదీస్తారోనని బాబు ఆ జిల్లాకు వెళ్లేందుకు వెనకాడుతున్నారని ఆరోపించారు. పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టును కాంట్రాక్టు కోసం తెచ్చుకుని లంచాలు అనుభవిస్తున్నారే తప్ప పూర్తి చేసే ఆలోచనేమైనా ఉందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి 95 శాతం పూర్తయిన ప్రాజెక్టు ఇప్పటికీ అలాగే అతీగతీ లేకుండా ఉండిపోయిందని ఆరోపించారు. పంచభూతాల్లో అవినీతి చేసిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇప్పటికైనా పబ్లిసిటీ మానుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని హితవు పలికారు. 
Back to Top