బాబుకు రాజకీయ శిరచ్ఛేదం తప్పదు

బాబు రోజాపై నీకెందుకంత అసూయ
చట్టాలను, న్యాయస్థానాలను ధిక్కరిస్తున్నావ్
ఇప్పటికే పాతాళానికి పడిపోయిన నీవు..
మరింతగా అథపాతాళానికి దిగజారుతున్నావ్
శాసనసభా హక్కులను కాలరాస్తే ప్రజలు సహించరు
రోజాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాంః అంబటి

హైదరాబాద్: వ్యక్తిగత కక్షతో రోజాను నిలువరించడం కోసం చంద్రబాబు వ్యవస్థలనే భ్రష్టుపట్టిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.  తాను శాసనసభలో ఉన్నంతకాలం రోజా సభలోకి రావడానికి వీల్లేదని బాబు మంత్రులకు, స్పీకర్ కు హుకూం జారీ చేయడం దారుణమన్నారు.  రోజాను సస్పెండ్ చేయడం ఓ తప్పైతే, ఏడాది పాటు సస్పెండ్ చేయడం మహా తప్పిదమన్నారు. చట్టాలను, న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తున్న చంద్రబాబు తగిన మూల్యం చల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బాబుకు  రాజకీయ శిరచ్ఛేదం తప్పదన్నారు. ఇప్పటికే పాతాళానికి పడిపోయిన చంద్రబాబు అథపాతాళానికి పడిపోయేలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. బాబు రోజాపై మీకెందుకు అంత అసూయ అని అంబటి ప్రశ్నించారు. తనపై పోరాడుతుందన్న కక్షతోనే చంద్రబాబు రోజాపై కక్షగట్టి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత కాలం సస్పెండ్ చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారని మండిపడ్డారు. రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం తప్పు అని కోర్టులు తేల్చాయని అంబటి తెలిపారు. న్యాయస్థానం తీర్పును కూడా అపహాస్యం చేస్తూ శాసనసవ్యవస్థ పనిచేస్తుందంటే..ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక  అరాచక పాలనలో ఉన్నామో  ఆలోచించుకోవాలన్నారు. 

మహిళా శాసనసభ్యురాలు ప్రజల మన్ననలతో గెలిచి శాసనసభకు వస్తే మీకెందుకంత కడుపు మంట అని బాబుపై అంబటి ఫైరయ్యారు. మహిళా ఎమ్మెల్యే మీద గౌరవం లేకుండా  ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ నిప్పులు చెరిగారు.  శాసనసభ్యులంటేనే గౌరవం లేని మీకు సామాన్యుల పట్ల ఎలా వ్యవహరిస్తారో చెప్పాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. బాబు మాట్లాడితే నీతి, నిజాయితీ అంటావే. చట్టాలన్నీ మాకే తెలుసంటావే. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఏం తెలవదు,  కొత్తవాళ్లు అని మాట్లాడుతావే..? న్యాయస్థానాలంటే గౌరవం లేదని వైఎస్ జగన్ ను ఆడిపోసుకుంటారే..?. వైఎస్ జగన్ అనని మాటాలను అన్నట్లు చూపి క్షమాపణ చెప్పాలంటారు.. లేకపోతే శాసనసభ జరగనివ్వమని మాట్లాడుతారే..? ఏమిటీ బాబు రాష్ట్రంలో ఈ అన్యాయం అని నిలదీశారు. ఎక్కడకు పోతున్నారు బాబు మీరు. ఇది సరైన పద్ధతి కాదని తీరు మార్చుకోవాలని హితవు పలికారు. 


రూల్ 340(2) ప్రకారం ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కు లేదని అన్నారు. కోర్టు తీర్పు మీకు అనుకూలంగా ఉంటే అంగీకరిస్తారా? లేకుంటే వ్యతిరేకిస్తారా? అంటూ బాబుపై ధ్వజమెత్తారు.  చట్టసభ తన పరిధిలో పనిచేస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు గానీ, లేకుంటే జోక్యం చేసుకుంటాయన్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యానికి కోర్టులకు హక్కు లేదంటున్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఎందుకు అప్పీల్కు వెళ్లారని ప్రశ్నించారు. చంద్రబాబుకు చట్టాలన్నా, కోర్టులన్నా గౌరవం లేదన్నారు. లంచం కేసులో చిక్కిన నేతలకు ప్రమోషన్లు ఇచ్చిన ఘటన బాబుదని ఫైరయ్యారు. రోజాకు న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
 
చంద్రబాబు  వికృతరూపాన్ని ప్రజలు చూస్తున్నారని అంబటి రాంబాబు తెలిపారు. బాబు మీకు అనుకూలంగా తీర్పు లేకపోతే ఎంత దారుణంగా చట్టాల్ని ఉల్లంఘిస్తారో  సాక్షాత్తు నిరూపితమైందన్నారు. వ్యక్తిగత కక్షలతో శాసనసభను వాడుకోవడం అధర్మమన్నారు. ప్రజాస్వామ్యం ప్రతి అంశాన్ని చూస్తూనే ఉంటుందన్నవిషయం తెలుసుకోవాలని బాబుకు చురక అంటించారు. నిబంధల్ని దాటి తీసుకునే అధికారం మీకు ఎవరిచ్చారని  ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ప్రజల సమస్యలపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని అంబటి తేల్చిచెప్పారు. ప్రభుత్వ దుశ్చర్యలను నడిబజారులో ఎండగడుతామన్నారు. శాసనసభలో చట్ట ప్రకారం వ్యవహరించకుండా మెజారిటీ ఏమిటని ప్రశ్నించారు.  మెజారిటీ ఉందని రోజాకు ఉరిశిక్ష వేస్తారా..? అని విరుచుకుపడ్డారు.  శాసనసభా హక్కులను కాలరాస్తే ఎవరూ సహించరని, చంద్రబాబు తగినఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. 
Back to Top