చంద్రబాబుకు మతిభ్రమించింది

అలవెన్స్, జీతాలకు తేడా తెలియని వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి
ప్రతిపక్ష ఎమ్మెల్యే జీతాల గురించి మాట్లాడడం సిగ్గుచేటు
చంద్రబాబు దుబారా ఖర్చు రూ. 6 వేల కోట్లు 
పార్కుహయత్‌ హోటల్‌కు రోజుకు రూ. మూడున్నర లక్షలు
ఇళ్ల మరమ్మతులకు వందల కోట్లు దుబారా
ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం చంద్రబాబు, రాధాకృష్ణ కూర్చొని రాసిందే..
ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీకి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

విజయవాడ: సీఎం చంద్రబాబు మతిభ్రమించిందని, అలవెన్స్, జీతాలకు తేడా తెలియని వ్యక్తి 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకోవడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య వెన్నుపోటు సిద్ధాంతంతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాడని మండిపడ్డారు. రాజ్యాంగం షెడ్యుల్‌ 10ను నీరుగారుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ అండదండలతో ఫ్యాన్స్‌ గుర్తుపై గెలిచి టీడీపీకి అమ్ముడుపోయిన ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని కోరినా ఇవాల్టీకి దిక్కులేదన్నారు. వారిపై చర్యలు తీసుకుంటేనే ప్రతిపక్షం శాసనసభ సమావేశాలకు వస్తుందని చెప్పినా చంద్రబాబు, స్పీకర్‌ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష ఫిర్యాదును పట్టించుకోకుండా జీతాల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 ఎన్నికల ముందు వస్తున్నా మీ కోసం అంటూ పాదయాత్ర చేసిన చంద్రబాబు అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. వస్తున్నా మీ కోసం కాదు.. వస్తున్నా నా కోసం.. నా కొడుకు కోసం అని ప్రజలకు తెలియక అధికారం కట్టబెట్టారన్నారు. 

శాసనసభలో ప్రభుత్వ అవినీతి, ప్రజా సమస్యలపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నపుడు గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆర్కే గుర్తు చేశారు. ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తూ రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా కనీసం వార్డులను కూడా గెలవలేని వ్యక్తులకు అధికారం కట్టబెట్టినప్పుడు గ్రామస్థాయి నుంచి పోరాటాలు చేస్తుంటే జీతాలు ఎందుకు తీసుకుంటారని అనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళితే జీతం ఇవ్వరని, శాసనసభ సమావేశాలకు వెళ్తే వచ్చిది అలవెన్స్‌ వస్తాయని కూడా చంద్రబాబుకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. అసలు చంద్రబాబు నువ్వు మనిషివేనా అని నిలదీశారు. ఎమ్మెల్యేకు జీతం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. 

ప్రతిపక్ష ఎమ్మెల్యే జీతాల గురించి మాట్లాడిన చంద్రబాబు రాష్ట్ర సంపదను ఎంత దుబారాగా ఖర్చు చేస్తున్నాడో ప్రజలంతా ఆలోచించాలన్నారు. ఖర్మకొద్ది ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రరాష్ట్రంలో సుమారు రూ. 6 వేల కోట్ల ప్రజధనాన్ని చంద్రబాబు దుబారాగా ఖర్చు చేశారన్నారు. రూ. 5 కోట్లు బస్సు కొనుగోలు చేసి ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయి ఆ బస్సులో దాచుకొని శాటిలైట్‌ ఫోన్‌తో ఆ కేసు మాఫీకి రకరకాల ప్రయత్నాలు చేశాడన్నారు. ఇప్పుడు ఆ బస్సు పనికిరాకుండా పక్కకు పడవేశాడన్నారు. అదే విధంగా హైదరాబాద్‌లో ఇల్లు, లేక్యూగెస్ట్‌ హౌస్, కోట్లాది రూపాయల డబ్బు ఇంటి రిపేర్లకు వందల కోట్లు ఇది భావ్యమేనా చంద్రబాబూ అని ప్రశ్నించారు. అంతే కాకుండా ఏ దేశానికి వెళ్లినా ప్రత్యేక విమానం,  పనికిమాలిన గంట కొట్టడానికి అమరావతి బాండ్లు అమ్ముతున్నానని బాంబే వెళ్లి కోటిన్నర ఖర్చు చేశాడన్నారు. మళ్లీ ఎమ్మెల్యేల జీతాల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రూ. 2 వేలతో చేయించుకునే రూట్‌ కెనాల్‌ ట్రీట్‌మెంట్‌కు రూ. 3 లక్షలు ఖర్చు చేశారన్నారు. 

చంద్రబాబు కొడుకు, కోడలు, మనవడు హైదరాబాద్‌లో ఉండేందుకు సంవత్సరన్నర కాలంగా పార్కుహయత్‌ హోటల్‌లో మూడు సూట్లు బుక్‌ చేశారని, వాటి ఖర్చు రోజుకు రూ. 3.5 లక్షలు చెల్లిస్తున్నారన్నారు. ఆ హోటల్‌లో ఒక్క కాఫీకి రూ. 720, లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రూ. 450.. ఈ విధంగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేల జీతాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పట్టిసీమ, పోలవరం, ఇసుక, మట్టి, నీరుచెట్టు కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయలు దోచుకున్నారన్నారు. మళ్లీ నాకు ఉంగరం, వాచీ లేదని బీద అరుపులు అరుస్తున్నాడన్నారు. చంద్రబాబు మాటలు వింటుంటే మతిభ్రమించిందని అర్థం అవుతుందన్నారు. 
ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు.. వీరు వారవుతారన్న సామెత చంద్రబాబు, లోకేష్‌కు బాగు సరిపోతుందని ఆర్కే విమర్శించారు. చదువు రాని, జ్ఞానం లేని వర్ధంతికి జయంతికి తేడా తెలియని లోకేష్‌ను కేబినెట్‌లో పక్కన కూర్చోబెట్టుకుని ఆయన బుద్ధి చంద్రబాబుకు వచ్చిందన్నారు. బ్రిటీష్‌వారితో పోరాటం చేశాను.. అలెగ్జండర్‌ను దేశానికి అధ్యక్షుడిని చేశానని మతిభ్రమించి మాట్లాడుతున్నాడన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందిద్దాం.. హామీలను అమలు చేద్దామనే ఆలోచన లేదు కానీ.. లేచింది మొదలు అబద్ధాలు, మోసాలు, అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతూ ఎదుటివారిపై రుద్ధుతున్నాడన్నారు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తే ఇప్పటికి ఇప్పుడు సమావేశాల్లో పాల్గొంటామని చెబితే దానిపై పల్లెత్తు ఆట మాట్లాడకుండా వ్యవహరిస్తున్నాడన్నారు. అసెంబ్లీ బులిటెన్‌లో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు 66 మందిని చూపిస్తూ అందులో మంత్రులు, విప్, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ అని రాసి ఉన్నాయన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నాడన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ 2017లో అసెంబ్లీకి సభ్యుల లిస్టు ఇచ్చారని, అయినా ఫిరాయింపుదారులు జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పనను డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌లుగా చూపించడం దారుణమన్నారు. 

2013 జూన్‌లో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా.. బాబుకు డోలు కట్టి సన్నాయి ఊది డ్యాన్స్‌ చేసే ఏబీఎన్‌ రాధాకృష్ణ కథనాలు రాశారని, అప్పటి మంత్రులకు కొనసాగే అర్హత లేదు.. నైతిక అర్హత కోల్పోయిన వారి సమాధానాలు అంగీకరించం. వారిని మీము బహిష్కరిస్తున్నామని చెప్పారన్నారు. పాత సినిమాల్లో విలన్ల మాదిరిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడన్నారు. స్వర్గీయ నందమూరి రామారావు మరణానికి కారణమై.. ఆయన పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నప్పటి నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మొదలు పెట్టాడన్నారు. మధ్యలో కేసీఆర్‌కు పట్టుబడ్డాడు. ఇవాల్టికి ఆ డబ్బు ఎవరిది అంటే తండ్రీకొడుకులిద్దరూ నోరు కూడా మెదపడం లేదన్నారు. ఇప్పటికైనా స్పష్టంగా చెబుతున్నాం. జీతాల గురించి మాట్లాడాలంటే నైతిక విలువలు ఉండాలి. చంద్రబాబు చెంపలు వేసుకొని తప్పు చేశాను.. జీవితంలో ఎమ్మెల్యేలను కొననని ఒప్పుకోవాలన్నారు. 
 
వైయస్‌ జగన్‌పై ఆంధ్రజ్యోతిలో రాయించింది చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణ కూర్చొని మాట్లాడుకొని రాసిందేనని, వీరికి ఆ తెలివితేటలు లేవని ఆర్కే ఎద్దేవా చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలియకుండా వార్తలు రాశారన్నారు. చంద్రబాబు, స్పీకర్‌ ఇద్దరూ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు తెలియదు.. పనికిమాలిన సిగ్గులేని వ్యక్తి ఏపీలో స్పీకర్‌ అవుతాడని, తెలిసి ఉంటే 10 షెడ్యుల్‌ స్పీకర్‌ పరిధిలో ఉంచేవారు కాదన్నారు. వైయస్‌ జగన్‌ సభకు వస్తే టీడీపీ వెన్నులో వణుకుపుడుతుందన్నారు. ప్రతిపక్షనేత వచ్చినప్పుడు మూడు రోజులే.. రాకపోతే పది రోజులు సభ పెడుతున్నాడు. చంద్రబాబు సోది వినలేక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. సభలోనే నిద్రలు పోతున్నారన్నారు. ఇప్పటికైనా కూడా 22 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేశారు. 
 
Back to Top