ప్రాజెక్ట్ కడతానని చెప్పి బాబు రైతులను మోసం చేశారు

వెలగపూడి: పల్నాడు ప్రాంతంలో ప్రాజెక్టు కడతానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను, రైతు కూలీలను మోసం చేశాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో ఆయన పల్నాడు ప్రాంత ప్రాజెక్టుపై చంద్రబాబును నిలదీశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 2008లో పల్నాడు ప్రాంత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 702 జీవో కూడా విడుదల చేశారని గుర్తు చేశారు. 1.7 టీఎంసీల సామర్థ్యంతో రూ. 197.7 కోట్లతో 44,326 ఎకరాలల్లో ప్రాజెక్టు డిజైన్‌ చేసి టెండర్లు కూడా పిలిచారని చెప్పారు. కానీ ఆయన మరణాంతరం ఆ ప్రాజెక్టు కలగానే మిగిలిపోయిందన్నారు. 1952లో అప్పటి ప్రభుత్వం కోసల కమిటీ పల్నాడు ప్రాంతంలో ప్రాజెక్టు అనుకూలమా లేదా అని ఓ కమిటీని కూడా వేశారని చెప్పారు. 1955లో ఆ కమిటీ అనుకూలమే అని కూడా రిపోర్టు ఇచ్చిందని గుర్తు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో పల్నాడు ప్రాంతానికి వచ్చి పెద్ద సభ ఏర్పాటు చేసి ప్రాజెక్టు కట్టితీరుతామని హామీ ఇచ్చినా ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కలగానే మిగిలిపోయిందన్నారు. 2015లో పల్నాడు ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, సంబంధిత మంత్రికి లేఖ రాస్తే కట్టడానికి వీల్లేదని రద్దు చేశారని ధ్వజమెత్తారు. పల్నాడు ప్రాంత రైతాంగం కోసం ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

Back to Top