బాబువి వెన్నుపోటు రాజకీయాలు: విశ్వనాథం

పూండి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్రకు మీకోసం అని కాకుండా ‘నాకోసం ఈ వేషం’ అని పెట్టుకుంటే బాగుండేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం అన్నారు. ఆయన వజ్రపుకొత్తూరు మండలం పూడిజగన్నాథపురం, తిమ్మలవానిపేట, బైనపల్లివానిపేట గ్రామాల్లో గడప గడపకూ వైయస్ఆర్ సీపీ నిర్వహించి మాట్లాడారు. పాదయాత్ర చేయడం వైయస్‌కూ, ఓదార్పు యాత్ర చేపట్టడం జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు. వెన్నుపోటు రాజకీయాలు నడపడం చంద్రబాబుకే సాధ్యమని ఎద్దేవా చేశారు. బాబు పాదయాత్ర పులినిచూసి నక్క వాతపెట్టుకున్నట్లుందని విమర్శించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా నమ్మేస్థితిలో లేరన్నారు. ఈ నెల 5న జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదలవుతారని భావించే టీడీపీ నాయకులు కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిసి ఈడీ చేత పిటిషన్ వేయించారని ఆరోపించారు. అప్పట్లో వైయస్ పాదయాత్ర చేస్తే అనేకమంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారని, బాబు పాదయాత్ర చేస్తుంటే ఒక్కొక్కరూ టీడీపీని విడిచి వెళ్లిపోతున్నారని అన్నారు. సీఎంగా ఉండి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసినందుకు బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై చీకటి ఒప్పందాలు చేసుకుని విచారణ, శిక్షల నుంచి తప్పించుకున్నా ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదని అన్నారు. గ్రామాల్లో తిష్ఠవేసిన సమస్యలపై అధ్యయనం చేసి వైయస్ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డికి నివేదిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దువ్వాడ జీవితేశ్వరరావు, పాలవలస వైకుంఠరావు, బి.రామయ్య, రమేష్ పాల్గొన్నారు.


Back to Top