బాబూ! మీ అలవాట్లు మాకు ఆపాదిస్తారా!!

హైదరాబాద్, 31 మే 2013:

  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన బ్లూ ఫిల్మ్, మద్య పానం ఆరోపణలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు మండిపడ్డారు. ఆయనకు మతిభ్రమించిందని ధ్వజమెత్తారు. జైళ్ళ శాఖ డీఐజీ కృష్ణంరాజు ఇచ్చిన వివరణకు టీడీపీ ఇంతవరకూ స్పందించలేదని జూపూడి విమర్శించారు. కృష్ణంరాజు ఇచ్చిన వివరణ టీడీపీకి చెంపపెట్టు వంటిదన్నారు. చేసిన ఆరోపణలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. చంద్రబాబు తనకున్న అలవాట్లను ఇతరులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు. బాబుకు ఆయన కుటుంబ సభ్యులు విదేశాలలో పరీక్షలు చేయించాలని సూచించారు. చంద్రబాబు చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. బాబు వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. గతంలో యనమలతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ములాఖత్‌లపై ఆరోపణలు చేయించిన ఆయన ఇప్పుడు నేరుగా విమర్శలకు దిగుతున్నారన్నారు. ఈ అంశంపై తమ పార్టీ విసిరిన సవాలుకు నోరువిప్పని విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు.

ములాఖత్ అంశంపై తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి వైయస్ భారతి  గతంలో  చేసిన సవాలుకు ఇప్పటి వరకూ స్పందన లేదన్నారు. టిడిపి నేతలు అనుచిత ఆరోపణలు చేస్తున్నారనీ, శ్రీ జగన్మోహన్ రెడ్డి గురించి ఇష్టారీతిన  మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని జూపూడి హెచ్చరించారు. తను చెప్పినట్లు సాగితే పరిపాలన లేకపోతే కాదన్నట్లు చంద్రబాబు వ్యవహార శైలి ఉందని ఎద్దేవాచేశారు. ఆయన ఆరోపణలను సమాజం తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. బాబు సభలు, మహానాడు విజయవంతం కాలేదనే నిస్పృహలో మాట్లాడుతుండి ఉంటారని జూపూడి అభిప్రాయపడ్డారు. జైళ్ళను అవమానించేలా మాట్లాడుతున్న చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు చేయాల్సిన విమర్శలా ఇవని ప్రశ్నించారు.

గతంలో యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలపై అప్పటి చంచల్‌గుడా జైలు సూపరింటెండెంట్ సైదయ్య వివరణ ఇచ్చారనీ, దానికి టీడీపీ వద్ద బదులు లేకపోయిందనీ తెలిపారు. చంచల్‌గుడా జైలులో ఖైదీలు బ్లూ ఫిల్ములుచూస్తున్నారనీ, మద్యం సేవిస్తున్నారనీ చంద్రబాబు చెబుతున్నారనీ, ఇది జైళ్ళను కించపరిచేలా మాట్లాడడమేననీ జూపూడి చెప్పారు. వీరికి చెంపదెబ్బ కొట్టినట్లుగా జైళ్ళ డీఐజీ సమాధానం చెప్పారన్నారు. జగన్మోహన్ రెడ్డిగారిని వారంలో రెండు సార్లు తప్ప ఎవరికీ కలిసే అవకాశం కల్పించడం లేదని ఆయన తెలిపారన్నారు. జైళ్ళలో చాలామంది తమకు సంబంధంలేని ఆరోపణలతో శిక్ష అనుభవిస్తున్న విషయం అందరికీ తెలుసన్నారు. కాబట్టి చంద్రబాబు ఆరోపణలను సమాజం తీవ్రంగా పరిగణించాలన్నారు. ఆయనను విదేశాలలో పరీక్షలకు తీసుకెళ్ళాలని కోరారు.  నాలుగు రోజులు అక్కడే మానసిక స్థితి బాగుపడిన తర్వాత ఇక్కడికి తీసుకురావాలన్నారు. మీ పాదయాత్ర కానీ, మహానాడు కానీ విజయవంతం కాలేదనీ, అనుమానాలు చుట్టుముట్టడంతో ఢిల్లీకి యాత్రలు చేస్తున్నారనీ జూపూడి చెప్పారు.

శ్రీ జగన్మోహన్ రెడ్డిగారు ఒక ఆరోపణమీద జైలులో ఉన్నారు తప్ప రుజువై కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలన్నారు. ఆయన్నెవరూ కలవకూడదనడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. శిక్ష పడని వారని ఎంతమందైనా ఎన్నిసార్లయినా కలవచ్చన్నారు. కానీ జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండుసార్లు మాత్రమే ములాఖత్ ఏర్పాటు చేశారన్నారు. పార్టీ సభ్యులు, కృతజ్ఞత ఉన్న వ్యక్తులు వెళ్ళి కలుస్తున్నారన్నారు. వీటిని విస్మరించి.. జగన్మోహన్ రెడ్డిగారు జైలునుంచి బయటకు రాకూడదనే లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా శ్రీ జగన్ గారిని కలిస్తే.. లేనిపోని ఆరోపణలకు దిగుతున్నారన్నారు. బ్యాండ్మింటన్ ఆడినా.. వ్యాయామం చేసిన టీడీపీ వారు యాగీ చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిగారు మీలాగ చిల్లర వ్యక్తి కాదని గుర్తించాలని పేర్కొన్నారు. చంద్రబాబు కుమారుడు వంట గదిలో ఏంచేశాడో రాష్ట్రానికి తెలుసన్నారు. మీరు చేస్తున్న చిల్లర పనులని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదన్నారు. జైలులో బ్లూ ఫిల్ములు, మద్యం ఉన్నాయని  అన్నప్పుడు జైలు అధికారులు ఇచ్చిన సమాధానం చూసిన తరువాత చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. జగన్మోహన్ రెడ్డిగారి మీద కక్షతో మీరు చేస్తున్న కుట్ర ఇదన్నారు. ప్రతిరోజూ ఏదో ఒక ఆరోపణ చేయాలనే తపన ఆయనలో కనిపిస్తోందన్నారు. టీడీపీ నుంచి వెళ్ళిపోయిన వారి కాళ్ళు పట్టుకుని వెనక్కి రమ్మని బతిమాలుకోండి తప్పితే జగన్మోహన్ రెడ్డిగారి మీద నిందలు మోపడం సరి కాదని ఆయన స్పష్టంచేశారు. మా నాయకుడు మీరన్నట్లు తాగుబోతు కాదన్నారు.

గాలి ముద్దు కృష్ణమనాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పిన ఓ మాటను జూపూడి ఈ సందర్భంగా వివరించారు.  ముఖ్యమంత్రిగా ఉండగా సింగపూర్ వెళ్లినపుడు హొటలులో చంద్రబాబు బ్లూ ఫిల్ము చూసినట్లు బిల్లులో వచ్చిందని గాలి ముద్దు కృష్ణమనాయుడు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మీకున్న అలవాట్లన్నీ మాకు ఆపాదిస్తే ఎలాగని నిలదీశారు. ఫోనులో మాట్లాడుకుంటున్నారనీ, ల్యాప్ టాప్ వాడుతున్నారనీ గతంలో ఆరోపించారనీ.. దీనిని రుజువు చేయాల్సిందిగా శ్రీమతి భారతి విసిరిన సవాలుకు చంద్రబాబు నోరు విప్పని విషయాన్ని జూపూడి గుర్తుచేశారు. ఒక అధికారికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిగారిని ఉద్దేశించినట్లుగా మాట్లాడిన బ్లూ ఫిల్ము, మద్యం ఆరోపణలకు చంద్రబాబు బహిరంగంగా సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు.  ఆయన మానసిక పరిస్థితిని సమీక్షించుకోవాలన్నారు. తమ పార్టీ మీద రోజూ నిందలు మోపడం తగదన్నారు. వీటికి క్షమాపణ చెప్పాలన్నారు.

బెయిలు మీద జగన్మోహన్ రెడ్డిగారు బయటకు వస్తారనే ఊహ వచ్చినా చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారన్నారు.  అయన్ను జైల్లో ఉంచి ఎన్నికలకు వెళ్ళాలన్న మీ ఆలోచనను ప్రజలు పసిగట్టారని తెలిపారు. శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల ప్రజా సమస్యల మీద స్పందిస్తున్న తీరునూ ప్రజలు గమనిస్తున్నారనీ, వారి చేతిలో చంద్రబాబు ఓటమి తప్పదనీ స్పష్టంచేశారు. జగన్మోహన్ రెడ్డిగారిని జైల్లో పెడితే ప్రత్యామ్నాయం ఉండదనుకున్న చంద్రబాబుకు శ్రీమతి విజయమ్మ, శ్రీమతి భారతి, శ్రీమతి షర్మిల తామున్నామంటూ ముందుకు రావడంతో నిద్ర కరవైందన్నారు. చంద్రబాబు వయసుకు గౌరవం ఇద్దామనుకున్నా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. జైల్లో ఎలాంటి అక్రమాలూ జరగడం లేదని స్పష్టంగా అధికారులు చెప్పినప్పటికీ పదేపదే ఇలాంటి ఆరోపణలకు చంద్రబాబు దిగుతున్నారన్నారు. నిజానికి ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠతో ముడిపడి ఉన్న అంశమనీ, కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించాలనీ జూపూడి డిమాండ్ చేశారు. మీరు ఆరోపణలు చేయండి అధికారులు సమాధానం చెప్పుకుంటారు అన్న చందంగా ప్రభుత్వం ఉండడానికి వీల్లేదన్నారు. సీబీఐ చేసిన ఆరోపణ కారణంగానే తమ నాయకుడు జైలులో ఉన్నారని జూపూడి పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top