'అవిశ్వాసం' మాని డొంకతిరుగుడు మాటలా

హైదరాబాద్:

రాష్ట్ర ప్రభుత్వం పట్ల చంద్రబాబుకు విశ్వాసం ఉందో, అవిశ్వాసం ఉందో తనకు అర్థం కావడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడూ అయిన డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీ అవిశ్వాసం పెడితే మద్దతిస్తారా అని శుక్రవారం నాడు తాను చేసిన ప్రతిపాదనపై చంద్రబాబు స్పందన చూశాక తనకీ సందేహం కలిగిందని ఆయన తెలిపారు. శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం పట్ల అవిశ్వాసం ఉంటే ఆ మేరకు తీర్మానం పెడతామని చెప్పాలి కానీ డొంకతిరుగుడుగా మాట్లాడరాదని బాబుకు సూచించారు. ప్రభుత్వంపై విశ్వాసం ఉంటే ఉందని చెప్పాలి తప్ప.. పాదయాత్రలు చేపట్టడం.. విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించినట్లవుతుందన్నారు. తామడిగిన దానికి మెలికలు పెడుతూ చంద్రబాబు సమాధానం చెప్పడం చూస్తే ఆయన వెనక్కిపోయినట్లుగా భావించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. లేదా ప్రభుత్వంతో లాలూచీ పడినట్లు కూడా అనుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెడతామని నేరుగా చెప్పాలని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. అవిశ్వాసం ఎలా పెట్టాలో విధానం తెలియని వాళ్ళు అడిగితే మేం పెట్టాలా అని బాబు ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. తమకు అవిశ్వాస తీర్మానం ఎప్పుడు, ఎలా ప్రవేశ పెట్టాలో తెలుసన్నారు. తనకు పాలక, ప్రతిపక్షాలలో పనిచేసిన అనుభవం ఉందన్నారు. అసెంబ్లీ జరిగే సమయంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనే విషయం తమకు తెలుసన్నారు. శాసన సభ జరిగే సమయంలో అవిశ్వాసం పెడతామని చెప్పడం మాని డొంకతిరుగుడుగా తమకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదనీ, ఒక్కరోజు కూడా అధికారంలో ఉండకూడదని అందరూ భావిస్తున్నారనీ బాబు ప్రతిరోజూ తన పాదయాత్రలో విమర్శిస్తున్న వార్తలను చూస్తూనే ఉన్నామనీ, ఈ ప్రభుత్వం అంత పనికిమాలినదైనప్పుడు దానికి వ్యతిరేకంగా తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టరని ఆయన ప్రశ్నించారు. తమకు సంఖ్యా బలం లేకపోయినప్పటికీ ఆ పని చేసేందుకు ముందుకొచ్చామనీ, మద్దతు కోరామనీ చెప్పారు. ప్రజాస్వామ్యం పట్ల చిత్తశుద్ధీ, విశ్వసనీయత ఉన్నాయి కాబట్టి తాము ప్రతిపాదన చేశామన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులున్నాయనీ వాటని వినియోగించుకోవాలనీ మైసూరా రెడ్డి సూచించారు. మాకే సంఖ్యా బలముంటే మద్దతు ఇవ్వాలని వారిని ఎందుకు కోరతామని అడిగారు. బలప్రదర్శన వేరు.. అవిశ్వాస తీర్మానం వేరని ఆయన పేర్కొన్నారు. బలప్రదర్శన గురించి చంద్రబాబు పదేపదే ప్రస్తావిస్తున్నందున ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నానన్నారు. మాకు అధికార దాహం లేదన్నారు. ప్రజల దగ్గరకి వెళ్ళి అధికారంలోకి వస్తామే తప్ప.. అడ్డదిడ్డమైన పనులూ చేయమని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేలు, క్యాబినెట్లో ఉన్న మంత్రులే పాలనా యంత్రాంగం అచేతనావస్థలో ఉందని, విశ్వాసం లేదనీ పదేపదే ప్రకటనలిస్తున్నారనీ, ఇంతకంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అనువైన సమయమేమిటనీ, భయమా అనీ  ఆయన ప్రశ్నించారు. 'చట్ట సభలు ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకుని ప్రభుత్వాన్ని ఉతకాలి గానీ, ఊర్ల వెంట తిరిగితే ప్రయోజనమేమిటన్నారు. అవిశ్వాసం పెడతానని చెప్పమంటున్నాం. ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనేది తమకు సంబంధించని సమస్యని' పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని బలవంతంగా కూలదోయాలని తమకే మాత్రం లేదన్నారు. ఏ ఒక్క శాసన సభ్యుడు డివిజన్ కోరినా స్పీకర్ అనుమతించాల్సిందేననీ, సంఖ్యను లెక్కించాల్సిందేననీ చెప్పారు. అది అధికార పక్షానికి సంబంధించిందన్నారు. పాదయాత్ర చేసి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పుడు అవిశ్వాసం ఎందుకు పెట్టరని నిలదీశారు. ప్రతిపక్షంగా అది మీ బాధ్యతన్నారు. తెరాస, తామూ మద్దతిస్తామని ప్రకటించినప్పటికీ వెనుకాడటంలో అర్థం లేదని మైసూరా రెడ్డ్డి చెప్పారు. మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా అవిశ్వాస తీర్మానానికి అనుగుణంగా ఓటు వేస్తారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చల వల్ల సమస్యలు పరిష్కారమవుతాయని తమకు నమ్మకముందని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రితో సమాన హోదా ఉందనీ, అంతటి ప్రాధాన్యత ఉన్న చంద్రబాబు ప్రజా సమస్యలపై స్పందించకుండా పాదయాత్రలు చేయడం ఎందుకనేది తన ప్రశ్నన్నారు.

Back to Top