ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు

వెలగపూడి: ఆర్థికమంత్రి యనమల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తిగా అంకెల గారడీ అని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ వైద్య సేవ కోసం రూ. 14 వందల కోట్లు కేటాయించాలని ప్రపోజల్స్‌ ఉండగా కేవలం రూ. వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు.  ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు గతంలో ఉన్న బకాయిలే రూ. 400 కోట్లు పోతే మిగిలిన నిధులతో ఆరోగ్య సేవలు ఎలా కొనసాగిస్తారని చంద్రబాబును నిలదీశారు.  వైద్య సేవలను బాబు నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు బిల్లుల కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. అదే విధంగా వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు 24 శాతం అని గవర్నర్‌తో చెప్పించి ఇప్పుడు వ్యవసాయ శాఖామంత్రి 14 శాతం మాత్రమే వృద్ధి రేటు అంటూ వాస్తవాన్ని బయటపెట్టారన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారు. స్వయాన వ్యవసాయ శాఖామంత్రి పుల్లారావు సొంత జిల్లా గుంటూరులో రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టారని దుయ్యబట్టారు.

Back to Top