'‌అరెస్టులతో జగన్ ప్రభంజనాన్ని ఆపలేరు'

పాతపట్నం (శ్రీకాకుళం జిల్లా): వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అరెస్టులు, వేధింపులతో ఆపడం ఎవరితరకూ కాదని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ప్రజలంతా ముక్తకంఠంతో‌ శ్రీ జగన్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఆస్పత్రి జంక్షన్‌లో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ మార్కె‌ట్ కమిటీ ఆవరణలో జరిగిన సభలో ప్రసంగించారు. ప్రజలు కొత్తదనాన్ని, సమర్ధుడైన నాయకుడిని కోరుకుంటున్నారని, అందుకే వైయస్ కాంగ్రె‌స్ పార్టీని ‌హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్ష టిడిపి కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని అంబటి దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో రెండుసార్లు గెలిపించిన మహానేత మరణంపై పలు అనుమానాలు ఉన్నాయ‌ని అంబటి పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అది హత్యేనేమోనని ప్రజలు సైతం భావిస్తున్నారన్నారు.‌ మహానేత వైయస్ మరణం తర్వాత 156 మంది ఎమ్మెల్యేలు శ్రీ జగన్‌ను సీఎంను చేయాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదని సంతకాలు పెట్టి ప్రతిపాదించినా పట్టించుకోకుండా రోశయ్యను, కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రులను చేశారన్నారు. కాంగ్రెస్‌లో కుట్రల కారణంగా దానిలో ఇమడలేక శ్రీ జగన్మోహన్‌రెడ్డి పార్టీ పెడితే సహించలేక సిబిఐ ద్వారా కేసులు పెట్టించి సోనియాగాంధీ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సహకరించినట్లే శ్రీ జగన్ కూడా భయపడి సహకరిస్తారని సోనియా భావించారన్నారు. అది జరగకపోగా ఎన్నడూ రాజకీయాల్లో కల్పించుకోని శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల జనం మధ్యకు దూసుకువచ్చారన్నారు. త్వరలోనే శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయటకు వచ్చి మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు.

చంద్రబాబుది పాడె యాత్ర: గట్టు
పాదయాత్రను అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్నది టిడిపి పాలిట పాడె యాత్ర అని మరో అధికార ప్రతినిధి, బిసి సెల్ కన్వీన‌ర్ గట్టు రామచంద్రరావు అభివర్ణించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ని‌లబడే వైయస్‌ఆర్ కుటుంబానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు భయంతో వణికిపోతున్నాయన్నారు.

పార్టీ మూడు జిల్లాల కో ఆర్డినేటర్ ఎం.ప్రసా‌ద్‌రాజు మాట్లాడుతూ, గ్రామస్థాయిలో వైయస్‌ఆర్‌సిపికి లభిస్తున్న ఆదరణ చూసి ఇతర పార్టీలు బెంబేలెత్తుతున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జి రవిరాజ్‌, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌,  పార్టీ జిల్లా పరిశీలకుడు ప్రసాద్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ‌, పార్టీ నాయకుడు కొమరాపు తిరుపతిరావు తదితరులు మాట్లాడారు.

ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌కు సంబంధించిన వివరాలతో ప్రత్యేక వె‌బ్‌సైట్‌ను అంబటి రాంబాబు ప్రారంభించారు. అంతకుముందు బస్టాండ్ నుంచి మార్కె‌ట్ కమిటీ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు.‌
Back to Top