అప్పుడు చోద్యం చూసి.. ఇప్పుడు దీక్షలా?

హైదరాబాద్, 4 ఏప్రిల్‌ 2013: ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నప్పుడు చోద్యం చూసిన ‌టిడిపి.. ఛార్జీలు పెరిగిన తరువాత దీక్షలు పేరిట నాటకాలు ఆడుతోందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ ఎం‌.వి. మైసూరారెడ్డి మండిపడ్డారు. ఈఆర్సీ ముందు ‌టిడిపి తన అభ్యంతరాలను ఎందుకు చెప్పలేదని ఆయన నిలదీశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నేతృత్వంలో హైదరాబాద్‌ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్ల ప్రాంగణంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్వహిస్తున్న నిరవధిక 'కరెంట్‌ సత్యాగ్రహం' దీక్షా శిబిరం వద్ద గురువారం ఆయన మాట్లాడారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వేళా విశేషం ఏమిటో గాని రాష్ట్రంలో వర్షాలే కురవలేదని మైసూరారెడ్డి అన్నారు.

అవిశ్వాసానికి ‌టిడిపి కలిసి వస్తే కిరణ్‌ ప్రభుత్వం ఉండేది కాదని, ప్రజలపై విద్యుత్ భారం పడేది కాదని ఆయన పేర్కొన్నారు. 'విద్యుత్‌ సంస్థలకు గ్యాస్‌ సరఫరా చేస్తామని విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ముందు చెప్పించింది మీరు కాదా ఆత్మవిమర్శ చేసుకోండి తెలుగుదేశం మిత్రులారా!' అని మైసూరా అన్నారు. రాష్ట్రంలో ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి కాకపోవడానికి బాధ్యత టిడిపిది కాదా? అని నిలదీశారు. ఆ రోజున టిడిపి ప్రభుత్వం థర్మల్‌, జల విద్యుత్‌ పైన ఏమాత్రం దృష్టి పెట్టి కృషి చేసినా ఇప్పుడు ఈ దుస్థితి వచ్చేదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఇలాంటి టిడిపి నాయకులకు విద్యుత్‌ సమస్యపై ఉద్యమం చేసే హక్కు ఎక్కడిదని మైసూరారెడ్డి నిలదీశారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టినప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేయడానికి అర్ధరాత్రి వరకూ సమయం ఉన్నదని, టిడిపి సభ్యులు తీర్మానానికి మద్దతుగా ఓటు వేసి ఉంటే ఈ ప్రభుత్వం పడిపోయేది కాదని, ఇంత పెను భారం ప్రజలపై పడేకాదని అన్నారు. అవిశ్వాసానికి ఎందుకు మద్దతివ్వలేకపోయారు? మూడు రోజులు దీక్ష ఎందుకు చేశారని టిడిపి ఎమ్మెల్యేలను మైసూరా నిలదీశారు.

తొమ్మిది వేల మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న గ్యాస్‌ ఆధారిత కేంద్రాలు ఇప్పుడు మూలన పడి ఉన్నాయని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. దానిలో ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ కూడా ఉత్పత్తి కాలేదని విచారం వ్యక్తంచేశారు.‌ మన ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి చేసి రిలయన్సు గ్యాస్‌ను ఈ కేంద్రాలకు ఇప్పిస్తే విద్యుత్‌ కొరత ఉండదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు.
Back to Top