అన్నీ ఆర్భాటాలే

 • చంద్రబాబు తీరుపై ప్రతిపక్ష నేత జగన్ విమర్శ
 •  పీబీసీకి 1.5 లక్షల ఆయకట్టుకు 12 వేల ఎకరాలకే ఏడాదిలో ఒక తడి నీరిచ్చారు
 •  16 టీఎంసీలు అవసరమైతే.. 2.55 టీఎంసీలు ఇచ్చి గొప్పలకు పోతున్నారు
 •  ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ
 • కడప: ‘చేసింది గోరంత.. చెప్పేది కొండంతలా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. ఇక్కడ పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు 1.52 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అందులో 12 వేల ఎకరాలకు ఏడాది కాలంలో ఒకే ఒక తడి నీరిచ్చారు. మరోవైపు పులివెందుల ప్రజల తాగునీటి ఇక్కట్లూ తీర్చట్లేదు. ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే.. ఆయన ప్రభుత్వం చాలా గొప్పగా పని చేస్తోందని పులివెందుల నుంచి రైతులు వచ్చి చంద్రబాబుకు శాలువాలు కప్పి సన్మానాలు చేశారని చెప్పుకొంటున్నారు’’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యంగ్యోక్తులు విసిరారు. చంద్రబాబువన్నీ ఆర్భాటపు మాటలేనని విమర్శించారు.

  శుక్రవారం ఆయన వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రాముడిని దర్శించుకుని, కమలాపురంలో ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నీటి కేటాయింపులపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
   
  ‘‘చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 10 టీఎంసీలు. పైడిపాలెం రిజర్వాయర్ ఆరు టీఎంసీలు. పులివెందుల ప్రాంతంలో అవసరమైన 16 టీఎంసీలకుగాను చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది 2.55 టీఎంసీలు మాత్రమే. ఈ నీటిలో కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పులివెందుల మున్సిపాలిటీలకు తాగునీరు, యూసీఐఎల్‌కు కేటాయింపులకుగాను 1.5 టీఎంసీలు అవసరం అవుతాయి. ఇక ఉన్న ఒక టీఎంసీలో 0.55 టీఎంసీల నీరు పీబీసీ ఆయకట్టుదారులకు విడుదల చేశారు. దాదాపుగా 1.52 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఏడాది కాలంలో కేవలం 12 వేల ఎకరాలకు ఒక తడి మాత్రమే నీరందించారు. మరోవైపు 1 టీఎంసీ సామర్థ్యమున్న సమ్మర్ స్టోరేజి ట్యాంకులో ప్రస్తుతం 0.1 టీఎంసీ మాత్రమే నిల్వ ఉంది.

  అంటే ప్రస్తుతం పది శాతం మాత్రమే నీరు చేరింది. ఇంకా 90 శాతం నీరు చేరాల్సి ఉంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.55 టీఎంసీ నీరు ఉంది. అయితే ఇందులో కనీస నీటిమట్టంగా 0.95 టీఎంసీల నీరు నిల్వ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మరో 0.63 టీఎంసీలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ నీటి ద్వారా సమ్మర్ స్టోరేజీ ట్యాంకును 30 శాతం నింపవచ్చు. ఎటుచూసినా పులివెందుల ప్రాంత ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పనిసరి. ఇంతటి దారుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటే, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి చంద్రబాబులకు పులివెందుల రైతులు శాలువాలు కప్పి సన్మానం చేశారని అసెంబ్లీలో చెప్పార’ని అన్నారు.

  బ్రహ్మంసాగర్‌కు చుక్క నీరు ఇవ్వలేదు
  ‘పది సంవత్సరాలుగా బ్రహ్మంసాగర్ నీటితో కళకళలాడింది. 10 నుంచి 12 టీఎంసీల నీరు నిల్వ చేసిన చరిత్ర ఉంది. సీఎం చంద్రబాబు హయాంలో ఒక చుక్క నీరు ఇవ్వలేద’ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. ఇదే విషయాన్ని శుక్రవారం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాకు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కలసి స్వయంగా వివరించారని చెప్పారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీరు ఉందంటే, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా 0.5 టీఎంసీల నీరు డ్రా చేసుకుని రాగలిగామంటే ఆ ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే సాధ్యమైందని తెలిపారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పథకానికి సీఎంగా తొమ్మిదేళ్ల హయాంలో చంద్రబాబు కేవలం రూ.13 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు కోసం రూ. 6,500 కోట్లకుగాను 5,800 కోట్లు వెచ్చించి పనులు చేపట్టారన్నారు. కాబట్టే చిత్రావతిలో ఈ నీరైనా సాధ్యమైందన్నారు.  దర్గాలో చాదర్ సమర్పణ 
  విపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి కమలాపురంలోని దర్గా-యే-గప్ఫారియాలో శుక్రవారం నుంచి ప్రారంభమైన ఉరుసు ఉత్సవాలకు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఠాధిపతి హజరత్ ఫైజుల్ గఫ్ఫార్ సాహెబ్ దర్గా మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. గురువుల మజార్ వద్ద గంధం, పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా గురువుల చరిత్ర, ఉరుసు ఉత్సవాల నిర్వహణ గురించి పీఠాధిపతిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, జయరాములు, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, అంజద్‌బాషా, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్లు గూడూరు రవి, రాఘవేంద్రారెడ్డి (నెల్లూరు), ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
   
  కోదండరాముడిని దర్శించుకున్న ప్రతిపక్ష నేత
  ఒంటిమిట్ట కోదండ రాముడిని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం ఆయన సీతా లక్ష్మణ సమేత రాముల వారిని దర్శించుకున్నారు. ఏకశిలా నగరం విశిష్టతను అక్కడి వేద పండితులు వివరించారు. కోదండరాముని ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అధికారికంగా కల్యాణోత్సవం నిర్వహించడం హర్షించదగ్గ పరిణామమన్నారు. అనంతరం కోదండ రాముని రథానికి ఆయన పూజలు నిర్వహించారు.

తాజా వీడియోలు

Back to Top