<strong>మహబూబ్‌నగర్ :</strong> అన్నదాతలంటే కిరణ్‌కుమార్‌రెడ్డి అస్సలు లెక్కే లేకుండాపోయిందని పాలమూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను ఆయన గాలికి వదిలేశారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా మొత్తాన్ని కరవుగా ప్రాంతంగా ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని కోరుతూ కిష్టారెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్ టిఎన్‌జిఒ కార్యాలయం ఎదుట 30 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా కిష్టారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు ఇప్పటికే పలుమార్లు వచ్చిన సిఎం కిరణ్ వల్ల ఒరిగేందేమీ లేదన్నారు.<br/>వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు రావుల రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కై శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై కుట్రలు చేయడం తప్ప ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు వంగూరు బాలమణెమ్మ మాట్లాడుతూ, మహానేత వైయస్ ప్రారంభించిన జలయజ్ఞాన్ని పూర్తిచేస్తే పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, మహానేత వైయస్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకోగా సిఎం కిరణ్ కుమార్‌రెడ్డి ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.