అన్నదాతల అవస్థలు కిరణ్‌కు పట్టవా?

బూడిదంపాడు (ఖమ్మం జిల్లా) : ‘నీలం తుపాను వల్ల ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటకు నష్టం జదిగింది. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పరిశీలించేందుకు వచ్చి లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రకటించారు. ఆయన వెళ్ళాక అధికారులు 11 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు చెప్పారు. సిఎం చెప్పిన లక్ష ఎకరాల్లో పంట నష్టం ఎటు పోయినట్లు? ఆపదలో ఉన్న రైతులను ప్రభుత్వం పట్టించుకోదా? ఇది దుర్మార్గపు ప్రభుత్వం..’ అని శ్రీమతి షర్మిల నిలదీశారు. ఖమ్మం జిల్లాలో మరో ప్రజాప్రస్థానం ఏడవ రోజు పాదయాత్రలో భాగంగా ఆదివారం ఖమ్మం అర్బన్ మండలం బూడిదంపాడులో మహిళలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

ఖ‌మ్మం జిల్లాలో పత్తి, మిర్చి, వరి పంటలకు తుపాను కారణంగా తీవ్ర నష్టం జరిగి రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా మీనమేషాలు లెక్కపెడుతోందని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు పడక, కరెంట్ కోతలు, పెరిగిన ఎరువుల ధరలతో జిల్లాలో ఎన్నడూ లేని విధంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో పనులు లేకపోవడంతో లక్షలాది మంది ప్రజలు వలస బాట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో కూడా కరువు కాటకాలతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు.

‌మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సిఎం అయ్యాక రైతులను ఆదుకునేందుకు రూ. 12 వేల కోట్ల రుణాలను మాఫీ చేశారన్నారు. రైతులు, మహిళలకు చంద్రబాబు రూపాయి వడ్డీకి రుణాలిస్తే వైయస్ మాత్రం వారిని ఆదుకునేందుకు పావలా వడ్డీకే రుణాలిచ్చారని తెలిపారు.‌ డాక్టర్ వై‌యస్ హయాంలో నిరుపేదలపై భారం పడకూడదని కరెంట్ చార్జీలు, గ్యా‌స్, మున్సిప‌ల్ టాక్సులు ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. ఆయన హయాంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా గడిపారని గుర్తు చేశారు. ఇప్పటి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దుర్మార్గపు పాలన చేస్తోందన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపాల్సిన చంద్రబాబు వారికి వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ‌టిడిపిలకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

సిఎం కాగానే రైతులకు జగన్ చేయూత‌ :
జగనన్న ముఖ్యమంత్రి కాగానే రైతులను అన్నివిధాలా ఆదుకుంటారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.3 వేల కోట్లతో వ్యవసాయ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతు సంక్షేమ ప్రభుత్వంగా రాజన్న రాజ్యం వెలుగొందుతుందన్నారు. పేదవారి చదువుల కోసం పదవ తరగతి చదివే వారికి రూ.500లు, ఇంటర్మీడియ‌ట్‌కు రూ.700లు, డిగ్రీ చదివే వారికి వెయ్యి రూపాయల చొప్పున తల్లి ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. గుడిసెలున్న వారికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top