లౌకిక వేదికపైకి పార్టీలన్నీ రావాలి

హైదరాబాద్, 6 అక్టోబర్ 2013:

మన దేశంలోని రాజకీయ పార్టీలన్నీ లౌకిక వేదికపైకి రావాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడినే కాకుండా దేశంలోని ప్రతి ఒక్కరినీ మద్దతు కోరతామని శ్రీ జగన్‌ తెలిపారు. అయితే.. బిజెపితో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా విభజించడానికి నిరసనగా, సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో శ్రీ జగన్మోహన్‌రెడ్డి లోటస్‌పాండ్‌లోని తన క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ఉదయం 'సమైక్య దీక్ష' ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు జాతీయ టి.వి. చానళ్ళ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరణాత్మకంగా బదులిచ్చారు.

గుజరాత్‌ సిఎం నరేంద్ర మోడిని ఇటీవలే మీరు పొడిగారు కదా... 2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? సమైక్యాంధ్ర విషయంలో మోడి మద్దతు కోరతారా? అని పలు జాతీయ టివి చానళ్ళ ప్రతినిధులు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. 'మోడి మంచి పరిపాలనా దక్షుడని నేనన్నాను. అది కూడా టివి చానళ్ళ ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగానే చెప్పాను. పొత్తుల గురించి ఇప్పుడే ఎందుకు? బిజెపితో పొత్తుకు అవకాశం లేదు. బిజెపి తీరును మోడి మార్చాలి. ఆ పార్టీని లౌకిక వేదికపైకి తీసుకురావాలి. బిజెపి ఒక్కటే కాదు.. ప్రతి పార్టీనీ లౌకిక వేదికపైకి తీసుకురావాలి. ఈ దేశానికి కావాల్సిందదే. మనం ముస్లిం, క్రిస్టియన్, హిందూ ఏదైనా అయి ఉండొచ్చు. కానీ మనమంతా భారతీయులం. ఇక్కడే పుట్టాం. ఇక్కడే పెరిగాం. ఇక్కడే ఉండాలి. ఇక్కడి ప్రజలు ఎలాంటి అభద్రతాభావంతోనూ ఉండకూడదు. వారికి అలాంటి పరిస్థితులు కల్పించకూడదు. కొందరి కోసం లౌకికవాదానికి దూరంగా ఉండటం సరికాదు. ఇది దేశంలో అంతర్గత తీవ్రవాదానికి దారితీస్తుంది' అని శ్రీ జగన్‌ పేర్కొన్నారు.

'ఈ తరానికి చెందిన నా వంటి వారంతా కోరుకుంటున్నది ఒక్కటే.. శాంతి, అభివృద్ధి. మనకు ముజఫర్‌నగర్‌లు వద్దు.. మొహబ్బత్‌నగర్‌ (ప్రేమ నిండిన నగరాలు) లు కావాలి. మరోసారి చెబుతున్నా... దేశంలోని పార్టీలన్నీ లౌకిక వేదికపైకి రావాలి. విభజన విషయంలో కాంగ్రెస్‌ దారుణమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో మేం ప్రతీ ఒక్కరి మద్దతు అడుగుతాం. ఛత్తీస్‌గఢ్,  జార్ఖండ్ తదితర రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో సంబంధిత అసెంబ్లీల తీర్మానాల ఆధారంగానే విభజనపై అప్పటి పాలక ఎన్డీయే ప్రభుత్వ సారథి అయిన బిజెపి నిర్ణయం తీసుకుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయంలో మాత్రం అసెంబ్లీ తీర్మానం లేకుండానే కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ తీర్మానం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయానికి బిజెపి ఎలా మద్దతిస్తుంది? ఇలాంటి చర్యలకు మద్దతు ఇవ్వవద్దని మేం బిజెపికి విజ్ఞప్తి చేస్తున్నాం. అసెంబ్లీ తీర్మానం ఆధారంగా విభజన నిర్ణయం లేనప్పుడు దయచేసి ఆ నిర్ణయానికి మద్దతు ఇవ్వవద్దని బిజెపిని కోరుతున్నారం. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యయుతంగా నడుచుకోవాలి. ఇలాంటి ఏకపక్ష, అన్యాయ నిర్ణయాలను ఎవరూ సమర్థించడానికి వీల్లేదు' అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 'నేను లౌకికవాదిని. లౌకికవాద కమ్యూనిస్టు పార్టీలున్నాయి. జెడి(యు) ఉంది. వాళ్ళేం చేస్తారో... నేనూ అదే చేస్తాను' అని 2014 ఎన్నికల అనంతర పరిస్థితులపై అడిగిన ప్రశ్నకు శ్రీ జగన్‌ సమాధానం చెప్పారు.

Back to Top