'అక్రమాల కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు'

ఆదిలాబాద్ : అవినీతి, అక్రమాలకు పాల్పడి సహకార ఎన్నికల్లో గెలిచిన‌ అధికార కాంగ్రెస్ పార్టీకి, దానితో అంటకాగుతున్న టిడిపికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆదిలాబాద్‌ జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌ బోడ జనార్ధన్‌ హెచ్చరించారు. పేదల సంక్షేమమే తమ పార్టీ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో సోమవారం జరిగిన వైయస్‌ఆర్‌సిపి జిల్లా సర్వసభ్య సమావేశంలో జనార్ధన్‌ మాట్లాడారు. ముందుగా దివంగత సిఎం, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో‌ ఇటీవలే చేరి, కేంద్ర కమిటీలో స్థానం పొంది, తొలిసారిగా జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరైన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని, ఇటీవల సహకార సంఘాల ఎన్నికల్లో ఎఫ్ఎ‌స్‌సిఎ‌స్ చైర్మ‌న్‌గా ఎన్నికైన రాంకిషన్‌రెడ్డి, ఆలూరు సంఘం చైర్మన్ రమే‌శ్‌లను సత్కరించారు.

అనంతరం జనార్ధన్‌ మాట్లాడుతూ, పార్టీని బలోపేతం చేయడానికి మండల, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రామగ్రామాన తిరుగుతామని అన్నారు. దీనికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై ఈ నెల 20న పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ సమక్షంలో హైదరాబాద్‌లో సమావేశం జరుగుతుందన్నారు.‌

ప్రజల నుంచి పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని దూరం చేయడానికే కాంగ్రెస్, ‌టిడిపిలు కుమ్మక్కై జైలులో పెట్టించాయని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఇంద్రకరణ్‌రెడ్డి ఆరోపించారు. విద్యుత్ చార్జీలు, స‌ర్‌చార్జీలు పెంచిన ప్రభుత్వం రైతులకు ఏడు గంటల విద్యుత్ సరఫరా కూడా చేయడం లేదన్నారు. ఇటీవల ఆకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.15వేలు నష్టపరిహారం చెల్లించాలని‌ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్న చంద్రబాబు ప్రజల సమస్యలు మరిచి, ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ పాదయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Back to Top