శాంతియుతంగా ఉద్యమిద్దాం: విజయమ్మ

గుంటూరు, 20 ఆగస్టు 2013:

రెండు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మొట్టమొదటి నుంచీ చెబుతోందని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పేర్కొన్నారు. న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని కోరుతోందన్నారు. సమ న్యాయం చేయలేకపోతే విభజన చేసే అధికారం తన చేతుల్లోకి కాంగ్రెస్‌ ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సమానంగా చూశారని చెప్పారు. రాష్ట్రాన్ని ఏకపక్షంగా, నిరంకుశంగా విభజిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా, అందరికీ సమన్యాయం చేయాలన్న డిమాండ్‌తో శ్రీమతి విజయమ్మ రెండు రోజులుగా గుంటూరులో 'సమరదీక్ష' పేరుతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్ష రెండవ రోజు మంగళవారం ఉదయం శ్రీమతి విజయమ్మ మీడియాతో కాసేపు మాట్లాడారు. అందరికీ సమన్యాయం జరగాలన్నదే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆశయం అని ఆమె స్పష్టంచేశారు. రాష్ట్రంపైన కాంగ్రెస్‌ పార్టీ చేసిన రాజకీయ కుట్ర పైనే తన సమరం అని తెలిపారు.

‌సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి వెళ్ళిపోవాలంటూ తెలంగాణ పూర్తిగా ఇవ్వక ముందే, కేవలం కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకున్న వెంటనే టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఏ విధంగా బెదరిస్తారని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. హైదరాబాద్‌ మాది అని ఆయన మాట్లాడుతున్నప్పుడు సీమాంధ్ర ప్రజలకు బాధ కలిగే పరిస్థితి వచ్చిందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు తమ జీతాలు వదిలేసుకుని సీమాంధ్ర ఎన్‌జివోలు ఉద్యమం చేస్తుంటే వారి మీద 'ఎస్మా' పెట్టడం న్యాయం కాదన్నారు. ఉద్యమం కోసం విద్యార్థులు తమ ప్రాణాలు తీసుకోవద్దని శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు. రాజకీయ కుట్రపై శాంతియుతంగా పోరాటం చేద్దామని చెప్పారు.

ప్రజల ఆగ్రహం ముందు ఏ పార్టీ గాని, ఏ శక్తి గాని నిలబడలేవని శ్రీమతి విజయమ్మ స్పష్టంచేశారు. ఎంతటి పెద్ద నిర్ణయం తీసుకున్నా జానాగ్రహానికి కిందికి దిగిరావాల్సిందే అన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్‌జివోలకు తగిన భద్రత కల్పిస్తుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ అందరిదీ అన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని 60 ఏళ్ళుగా అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నామన్నారు. హైదరాబాద్‌కు ఎలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు వచ్చినా సీమాంధ్రులు అక్కడే ఎందుకని ఏ రోజునా ప్రశ్నించని వైనాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. రాష్ట్ర రాజధాని కనుక 1956 నుంచి అనేక ప్రభుత్వం రంగ సంస్థలు హైదరాబాద్‌లోనే ఏర్పాటయ్యాయన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలను ఇప్పుడు పెట్టే పరిస్థితి లేదన్నారు. అంతా ప్రైవేటుపరం అవుతోందన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వమే ప్రైవేటు విధానాన్ని అనుసరిస్తోందని విచారం వ్యక్తంచేశారు.

ఉపాధి కోసం రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచీ కూడా హైదరాబాద్‌ వచ్చి ఏదో ఒక పనిచేసుకుని బ్రతకాలని ప్రజలు చూస్తున్నారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. అన్ని విధాలుగా అందరూ కలిసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌ ఇవాళ కేవలం తెలంగాణది అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుందన్నారు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తండ్రి లాగా న్యాయం చేయాలని తమ పార్టీ కేంద్రాన్ని కోరుతోందన్నారు. ఒక కొడుక్కి ఉన్న ఆస్తి, ఇళ్ళు అన్నీ ఇచ్చేసి మరో కొడుకును అన్నీ వదిలేసి కట్టుబట్టలతో వెళ్ళిపో లేదా పది నెలలు ఉండి వెళ్ళపో అంటే అది ఎలాంటి న్యాయం అవుతుందని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయే సీమాంధ్ర ప్రజల వాదనలు ముందుగా వినాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. వారి మనోభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సీమాంధ్ర ప్రజలు ఎన్నుకున్న నాయకులతో గాని, పార్టీలతో గాని కనీసం చర్చించకుండా ఉన్నపళంగా నిర్ణయం తీసుకోవడం తప్పు అని శ్రీమతి విజయమ్మ వ్యాఖ్యానించారు.

ప్రతి నీటిబొట్టునూ సద్వినియోగం చేయాలనే ఆనాడు మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞాన్ని ప్రారంభించారని, దానిలో భాగంగా ముందుగు పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. మూడు ప్రాంతాలకూ కలిపి మొత్తం కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని లక్షన్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 86 ప్రాజెక్టులను ఆయన చేపట్టారన్నారు. రాజశేఖరరెడ్డిగారు ఉన్నప్పుడే దాదాపు 90 శాతం పులిచింతల ప్రాజెక్టు పని పూర్తయిందన్నారు. ఏ ప్రాంతం నుంచి అపోహలు వచ్చినా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి పులిచింతల పూర్తిచేయాలనుకున్నారన్నారు. పులిచింతల ప్రాజెక్టును పూర్తిచేయాలన్న చిత్తశుద్ధి లేని కాంగ్రెస్‌ ప్రభుత్వం కారణంగా దాని పనుల వేగం తగ్గిపోయిందని విచారం వ్యక్తంచేశారు.

సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాజధాని కోసం ప్యాకేజిలు అడిగిన చంద్రబాబు ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర ఏ ముఖం పెట్టుకుని చేస్తారని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. ఆయనకు, కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ విభజనకు తమ పార్టీ అనుకూలమని చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చినందువల్లే కాంగ్రెస్‌ పార్టీ ఇంత ధైర్యంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆమె ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ఇమ్మని చెప్పినందువల్లే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఊహించలేదన్నారు.

Back to Top