నంద్యాల: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడివి పిచ్చి ప్రేలాపనలని వైయస్‌ఆర్‌సీపీ సీజీసీ మెంబర్, మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ హెచ్.ఎ.రెహ్మాన్ ఆరోపించారు. కర్నూలు నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో పార్టీ జిల్లాస్థాయి మైనార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కడపకు వెళ్తూ నంద్యాల పట్టణం ఆర్‌అండ్‌బీ విశ్రాంతి గృహంలో విలేకరులతో మాట్లాడారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంతో చంద్రబాబు నాయుడు గెలవలేకపోయారని గుర్తు చేశారు. ప్రస్తుతం వైయస్ జగన్‌మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ అధినేత ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై తమ పార్టీ అధినేతకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించానని, ఎక్కడ చూసినా వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని ఒక శక్తిగా చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మైనార్టీందరూ జననేత వెంట ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు తన కుమారుడు లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకే పాదయాత్ర చేస్తున్నారని, ప్రజల కోసం కాదని ఆరోపించారు. వైయస్ఆర్ ఉచితంగా రైతులకు విద్యుత్‌ను అందిస్తే ఎద్దేవా చేసిన వ్యక్తి నేడు ‘ఉచిత’ పాటనందుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి 90రోజుల తర్వాత బెయిల్ రావాలని, ఎలాంటి ఆధారాలు లేని చార్జి షీట్లు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఉదయం జననేతను కలిసేందుకు వెడితే అనుమతించలేదన్నారు. కలిసికట్టుగా ఉండి పార్టీని గెలిపించుకోవాలని జిల్లా మైనారిటీ సెల్ కన్వీనరు హఫీజ్‌ఖాన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని చంద్రబాబు చెప్పే మాటలను నమ్మరాదన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో మైనారిటీల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ముస్లింల బాగోగులపై ఆలోచించిన ఘనత ఒక్క వైయస్‌ఆర్‌కే దక్కుతుందన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే మైనార్టీల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో కర్నూలు జిల్లా మైనార్టీ సంఘం అధ్యక్షుడు హఫీజ్ ఖాన్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మహబూబ్‌బాష, కార్యదర్శులు కరీముల్లా, హిజర్, ఆదోని మాజీ కౌన్సిలరు ఏజాజ్, ఎమ్మిగనూరు నాయకుడు ఖిబ్లాహుసే న్, గూడూరుకు చెందిన అస్లం, నందికొట్కూరుకు చెం దిన హనీఫ్, నంద్యాలకు చెందిన బంగారుబాషా, నాయకులు అలీఖాన్, ఖాశీం, రఫీ, మున్నా, షబ్బీర్, అబ్దుల్హ్మ్రాన్, షాషా, షేక్షా, షకీల్, అంజద్ పాల్గొన్నారు.