అవిశ్వాసాన్ని తిరస్కరిస్తే సూట్‌కేసులు ముట్టినట్లే

హైదరాబాద్ 14 మార్చి 2013:

అవిశ్వాస తీర్మానంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తే ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పారు. పడగొట్టకపోతే రాజకీయాల నుంచి వ్యక్తిగతంగా తప్పుకుంటానని ప్రకటించారు. అవిశ్వాసానికి మద్దతుగా టీడీపీ ఓటు చేయకుంటే వారికి సూట్‌కేసులు ముట్టినట్లే భావించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అనుసరిస్తున్న వైఖరేమిటని బాలినేని ప్రతిపక్షనేత చంద్రబాబును నిలదీశారు.

ఇలా ఉండగా, మరో పదిహేనుమంది టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. మరోవంక, కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ఉదయం స్పీకరు నాదెండ్ల మనోహర్‌ను కలిసి తాను సమర్పించిన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. తాను అవిశ్వాసానికి మద్దతుగా ఓటేస్తానని విలేకరులకు చెప్పారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే అయిన పెద్దిరెడ్డి మంగళవారం ఉదయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే.

Back to Top