పీపుల్సు మాన్యువల్నీ గమనించండి

హైదరాబాద్:

జైలు మాన్యువల్ గురించి తరవాత ఆలోచిద్దురు గాని... ముందు పీపుల్సు మాన్యువల్‌ను గమనించుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీకి సూచించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు విస్మయానికి గురిచేశాయని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి జైలులో సెల్ ఫోను వాడుతున్నారనీ, ఆయనను ఎందరో వచ్చి కలుస్తున్నారనీ ఆరోపించిన అంశంపై బహిరంగ లేఖ రాశారు.
     యనమల ఆరోపణలలో నిజాలను తెలుసుకునేందుకు తాను ప్రయత్నించానని ఆయన తెలిపారు. జైళ్ళలో విచారణ ఖైదీల హక్కులు, నిబంధనలు తెలుసుకుని, పదవీ విరమణ చేసిన కొందరు పోలీసు అధికారులతో మాట్లాడానని వివరించారు. వారు చెప్పిన అంశాలను ప్రజల ముందుంచే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు.

విచారణ ఖైదీలతో ములాఖత్ లకు నిబంధనలుండవు


    1971వ సంవత్సరంలో రూపొందించిన జైలు మాన్యువల్ ప్రకారం విచారణ ఖైదీల ములాఖత్‌లపై ఎటువంటి నిబంధనలూ లేవనీ, నేరం రుజువైన ఖైదీలకు మాత్రమే వారి కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులతో ములాఖత్‌కు అవకాశం లభిస్తుందనీ లేఖలో పేర్కొన్నారు. విచారణ ఖైదీలకు సమయం, సందర్భాన్ని బట్టి జైలు అధికారి సంతృప్తి చెందితే ములాఖత్‌లకు అవకాశాన్ని ఇవ్వవచ్చన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడు, విచారణ మాత్రమే ఎదుర్కొంటున్నారు, పైగా పార్లమెంటు సభ్యుడు కూడా అయిన విషయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలని గుర్తుచేశారు. పార్లమెంటు సభ్యుడూ, పలుకుబడి కలిగిన వ్యక్తీ కావడం వల్లనే సాక్ష్యాధారాలను తారుమారుచేసే అవకాశం ఉందన్న అనుమానంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ చెప్పిన విషయం కూడా మరువరాదన్నారు. ఇప్పటి వరకూ ఆయనను కలవడానికి వచ్చిన  వారి వివరాలు పరిశీలించి, సాక్ష్యాలను తారుమారు చేసే వ్యక్తులు ఉండి ఉంటే వాటిని విడుదల చేయాలని తెలుగు దేశం పార్టీనీ, యనమల రామకృష్ణుణ్ణి ఆ లేఖలో జ్యోతుల డిమాండ్ చేశారు.

జగన్ నేరస్థుడెలా అవుతారు


      జగన్ కు చెందిన విజయవంతంగా నడుస్తున్న సంస్థల్లో పెట్టుబడులు 'క్విడ్ ప్రోకో' సూత్రంపై వచ్చాయని శంకరరావు, అశోక గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి తదితరులు పిటిషన్ దాఖలు చేయడం, ప్రభుత్వం నుంచి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండానే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రచారం మధ్యలో జగన్ను జైలుకు పంపించారనీ, ఆయనను జైలుకెళ్ళి ఎవరైనా కలిస్తే తప్పెలా అవుతుందనీ జ్యోతుల ఆ లేఖలో ప్రశ్నించారు. సాక్ష్యాలు తారుమారు చేస్తారనే సీబీఐ కోర్టు ఆయనను కొంతకాలం జైలులో ఉంచాలని ఆదేశించినపుడు జగన్ నేరస్థుడు ఎలా అవుతారని కూడా అడిగారు. విచారణ పూర్తికాకుండానే, ట్రయల్ మొదలవకుండానే జగన్ నేరస్థుడైపోతారా? అని ప్రశ్నించారు. న్యాయవాది కూడా అయిన యనమలకు శిక్ష పడని వారికి ఎలాంటి హక్కులుంటాయో తెలియదనుకోవాలా లేక రాజకీయం కోసం అసత్య ప్రచారం చేస్తున్నారనుకోవాలా? అని జ్యోతుల ధ్వజమెత్తారు.
ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్ ప్రకారం నేరం రుజువైన ఖైదీలు కూడా సంపూర్ణ హక్కులు కలిగి ఉంటారన్నారు. కరెంటు దీపంతో పనిలేకుండానే వార్తా పత్రిక చదివేందుకు వీలైన వెలుతురు ఉండే గదిలో వారిని ఉంచాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు కుటుంబ సభ్యులనూ, స్నేహితులనూ కలిసే అవకాశముండాలి. తాజాగా చర్లపల్లి  జైలులో ఈ మధ్యే ఖైదీలకు వారానికి రెండు మూడుసార్లు కుటుంబ సభ్యులు, బంధువులతో ఫోనులో మాట్లాడుకునే సౌకర్యం కల్పించారని జ్యోతుల చెప్పారు. విచారణ ఖైదీగా కోర్టు ఆదేశాల మేరకు జగన్ ప్రత్యేక సౌకర్యాలు కోరితే తప్పా అని ఆయన అడిగారు.
జగన్ ఉన్న సెల్‌లో తాజాగా టైల్సు వేశారని యనమల ఆరోపించారనీ, దీనిని నిరూపించగలరా అని సవాలు చేశారు. జైలు అధికారుల అనుమతితో ఆ సెల్‌ను సందర్శించవచ్చు కదా అని సూచించారు. 'విచారణ ఖైదీల్లో వీఐపీలు ఉన్నారన్న అంశాన్ని గమనించిన జైళ్ళ శాఖ నిజాం కాలంలో నిర్మించిన ఓ భవనాన్ని సిద్ధం చేసింది. అందులో షాబాద్ బండలతో వేసిన ఫ్లోరింగ్ ఉంది. ఏ సెల్ లోనూ టైల్సు లేవు. వీఐపీ ఖైదీలకంటే జగన్మోహన్ రెడ్డికి ఏ ఒక్క  అదనపు సౌకర్యమూ లేదు'  అని జ్యోతుల తెలిపారు. జగన్ జైలుకు రావడానికి చాలాకాలం ముందే మరమ్మతులు చేశామని పదవీ విరమణ చేసిన ఓ అధికారి తనకు చెప్పారన్నారు.
ఖైదీల హక్కులు హరించడానికి కంకణం కట్టుకున్నారా!

ఖైదీల హక్కులు హరించాలని కంకణం కట్టుకున్నారా



     న్యాయవాది అయిన యనమల జైలులో ఖైదీల హక్కులను హరించాలని కంకణం కట్టుకున్నట్లుందన్నారు. బ్యాండ్మింటన్ కోర్టు ఏర్పాటు చేసింది ఖైదీలు ఆడుకోవడానికే.. జగన్ వస్తున్నారని ప్రత్యేకంగా చేసిన ఏర్పాటు కాదన్నారు. నాలుగు నెలల్లో జగన్ 150మందిని కలిశారని అభియోగం మోపుతున్నారనీ, కుటుంబ సభ్యులనూ, పార్టీ నేతలనూ, సన్నిహితులనూ  కలిస్తే తప్పెలా అవుతుందనీ ఆ లేఖలో నిలదీశారు. ఎవరినీ కలవనీయకుండా, ఏ సౌకర్యాలూ లేకుండా జగన్ ను చీకటి గదిలో బంధించాలని టీడీపీ, ఎల్లో మీడియా కోరుకుంటున్నాయా అన్న అనుమానం దీనివల్ల కలుగుతోందన్నారు. దేశంలో మరే పార్టీ అధ్యక్షుడినీ ఇలా అరెస్టు చేసిన దాఖలాలు లేవని జ్యోతుల స్పష్టంచేశారు. సాక్షుల్ని ప్రభావితం చేస్తారని సీబీఐ ఓ అర్థంపర్థం లేని సాకును సృష్టించిందన్నారు. 26 జీవోలను జారీచేశారని విచారించాల్సిన మంత్రులు, ఐఏఎస్ అధికారులను అధికారంలోనే ఉంచి, వారు సాక్షులను ప్రభావితం చేయలేరని సీబీఐ తీర్మానించేసిందని ఎద్దేవా చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతామని ఇదే కేసులో మంత్రులు సీబీఐతో అంటే సమన్లు అందుకున్న మరుక్షణం బెయిల్‌పై బయటకు వెళ్ళే అవకాశాన్నికూడా కల్పిస్తోందన్నారు. ఒకే కేసులో కొందరి బెయిలును సీబీఐ మాట వరుసగా కూడా వ్యతిరేకించడం లేదన్నారు. దీన్నిబట్టే సీబీఐ ఉద్దేశాలు అందరికీ అర్థమవుతున్నాయని జ్యోతుల ఆ లేఖలో పేర్కొన్నారు.

జైలు మాన్యువల్ గురించి తర్వాత ఆలోచించుకోండి


    జగన్ సాక్షుల్ని ప్రభావితం చేస్తారని భయపడుతున్నారా లేక వైయస్ఆర్ మాదిరిగా ప్రజలకు భరోసా ఇస్తారని ఆందోళన చెందుతున్నారా అని తెలుగు దేశం నాయకులను ఆయన నిలదీశారు. ప్రజలంతా ఆయన వెంట ఉన్నరనేదే కదా మీ బాధని ఎద్దేవా చేశారు. ప్రజా క్షేత్రంలో జగన్ ను ఎదుర్కొంటామని ఎందుకు సవాలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆయన జైలులోనే ఉండాలనీ, నేరాభియోగాలు మోపకుండానే ఆయన్ను ఎవరూ కలుసుకోకుండా నిరోధించాలనీ ఎందుకు కోరుకుంటున్నారని అడిగారు. ధర్మం మీద నమ్మకం ఉన్న ఏ ఎమ్మెల్యే పార్టీలో మిగలడని భయపడుతున్నారన్నారు. 'కలల్లో కూడా మీకు జగన్ గుర్తుకువస్తున్నారంటే.. అది మీ బలమా బలహీనతా అని ప్రశ్నించారు. అధికార పార్టీతో కుమ్మక్కయ్యి జగన్‌పై దాడులు చేస్తున్నారన్నారు. ప్రజలు మీకంటే తెలివైన వారనీ, వారికి మీలా కుట్రలు తెలియవనీ పేర్కొన్నారు. నమ్మకం కుదిరితే అభిమానిస్తారు. లేకుంటే విసిరేస్తారు. ఇదీ పీపుల్సు మాన్యువల్' అని స్పష్టం చేశారు. జైలు మాన్యువల్ గురించి తరువాత ఆలోచించవచ్చు.. ముందీ మాన్యువల్ ఒకటుందని గుర్తుంచుకోండని జ్యోతుల ఆ లేఖలో పేర్కొన్నారు.

Back to Top