'అవిశ్వాసం' ఎందుకు పెట్టరు 'బాబూ'?

హైదరాబాద్, అక్టోబర్ 11, 2012. ఒక పక్క ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే, చంద్రబాబు ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి ఎందుకు వెనుకడుగు వేస్తూ వచ్చారో చెప్పాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌.విజయమ్మ ప్రశ్నించారు. ఇప్పుడు రోడ్డున పడి పాదయాత్ర చేస్తున్న చంద్రబాబునాయుడు 'అవిశ్వాసం' పెట్టి ఉంటే ప్రభుత్వం పడిపోయి ఉండేదని ఆమె అన్నారు. తొమ్మిదేళ్లపాటు ప్రజలను పట్టించుకోని బాబును ప్రజలు నమ్మడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆమె చంద్రబాబు తీరును ఎండగట్టారు. పెట్టవలసిన సమయంలో బాబు అవిశ్వాసతీర్మానం పెట్టలేదని ఆమె అన్నారు. చిరంజీవి కాంగ్రెస్ లో చేరేంతవరకూ బాబు అవిశ్వాసతీర్మానం పెట్టనేలేదనీ, ఆ తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్‌‌ పార్టీని దెబ్బతీసేందుకే వ్యూహాత్మకంగా అవిశ్వాసం ప్రతిపాదించారనీ ఆమె ఆక్షేపించారు. నిజానికి చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీతో 'బాగా కలిసి పని చేస్తున్నా'రనీ, ఇది జగన్మోహన్‌ రెడ్డిని జైలు పాలు చేయడంలో కనిపిస్తూ వచ్చిందనీ విజయమ్మ విమర్శించారు. బెయిల్‌ పిటిషన్‌‌ విచారణకు వచ్చే ముందు టిడిపి ఎంపీలు చిదంబరంను కలిసి మాట్లాడారనీ, దరిమిలా ఇడి నోటీసులు వెలువడ్డాయనీ ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో పూర్తిగా కలిసిపోయారనీ, వారిద్దరిదీ ఒకే మాటగా సాగుతోందనీ ఆమె అన్నారు. బాబుకు ప్రజాసమస్యల పట్ల ఎలాంటి శ్రద్ధా లేదనీ, మొన్నటి అసెంబ్లీ సమావేశాల బిఎసి మీటింగ్‌కు కూడా ఆయన హాజరు కాలేదనీ విజయమ్మ దుయ్యబట్టారు.
ప్రజలు కష్టాలు పడుతూ ఉంటే ప్రధానప్రతిపక్షం సరిగా ప్రతిస్పందించడం లేదనీ, పైగా వైయస్‌ ప్రజాప్రస్థానాన్ని, జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రను 'ఇమిటేట్‌' చేస్తూ పాదయాత్రకు దిగడమెందుకో తనకు అర్థం కావడం లేదనీ, దాని వల్ల ఒరిగేది కూడా ఏమీ ఉండదనీ ఆమె విమర్శించారు. ప్రధానప్రతిపక్షంగా ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెట్టాలని ఒత్తిడి చేయడం కూడా షర్మిల పాదయాత్ర ఉద్దేశ్యాలలో ఒకటని విజయమ్మ వివరించారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కు అయిన తీరును కూడా ప్రజలకు వివరిస్తామని ఆమె చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top