22న తెలంగాణలోకి షర్మిల పాదయాత్ర

హైదరాబాద్

16 నవంబర్ 2012 : షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర ఈ నెల (నవంబర్) 22న తెలంగాణలోకి అడుగుపెడుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని పుల్లూరు గ్రామం వద్ద షర్మిల పాదయాత్ర తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశిస్తుందని, అలాగే షాద్‌నగర్ మీదుగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోకి అడుగుపెడుతుందని ఆయన చెప్పారు. తెలంగాణలోని మహబూబ్‌ నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. మహానేత వైయస్ తెలంగాణలో పలు సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసినందున, ఆయన కుమార్తె షర్మిల పాదయాత్రకు పెద్ద యెత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన తెలంగాణ ప్రాంత ప్రజలను కోరారు. శుక్రవారం ఆయన జిట్టా బాలకృష్ణారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కె.కె.మహేందర్ రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ షర్మిల పాదయాత్ర వివరాలు తెలిపారు.
షర్మిల పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పది జిల్లాల వైయస్ఆర్ సీపీ నేతలతో శుక్రవారం హైదరాబాద్‌లో ఒక సన్నాహక సమావేశాన్ని నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. పది జిల్లాల పార్టీ కన్వీనర్లు, ఇన్‌చార్జ్‌లు, పార్టీ అనుబంధసంఘాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారని బాజిరెడ్డి చెప్పారు.
దివంగత మహానేత వైయస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల కష్టాలు, కడగండ్లు చూసి నాటి తన 'ప్రజాప్రస్థానా'న్ని చేవెళ్ల నుండి ప్రారంభించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. సాగునీటికి నోచుకోని తెలంగాణకు వైయస్ పలు ప్రాజెక్టులు ఇచ్చారన్నారు. చేవెళ్ల-ప్రాణహిత వంటి ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది వైయస్సేనన్నారు. కొన్ని చోట్ల 90 శాతం పనులు పూర్తి అయి పనులు నిలిపోయాయన్నారు. కేవలం 10 శాతం నిధులిస్తే ప్రాజెక్టులు కొన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయన్నారు. కనుక వాటిని పూర్తి చేయించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. షర్మిల తన పాదయాత్రలో అలాంటి ప్రాజెక్టులను సందర్శిస్తారనీ, రైతుల సమావేశాలలో మాట్లాడతారనీ బాజిరెడ్డి చెప్పారు. మహానేత వెళ్లిపోయి మూడేళ్లయినా తెలంగాణ ప్రజలు ఆయనను మరచిపోలేదన్నారు. ఆయన కుమార్తె షర్మిల పాదయాత్ర కోసం తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. షర్మిల తన తండ్రి, అన్నలాగే విశ్వసనీయతను పుణికిపుచ్చుకున్నారన్నారు. రాజన్నరాజ్యం, సువర్ణయుగం వాగ్దానాలతో షర్మిల ప్రజలకు భరోసా ఇస్తున్నారన్నారు. అందుకే షర్మిల పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. దీనికి భిన్నంగా విశ్వసనీయత లేని చంద్రబాబు పాదయాత్రకు జనం కరువయ్యారన్నారు. తన హయాంలో ప్రజావ్యతిరేక విధానాలు అవలంబించిన చంద్రబాబుకు అన్ని వర్గాలూ దురమయ్యాయన్నారు. అందుకే  వైయస్ సంక్షేమ పథకాలనే అమలు చేస్తామంటూ చంద్రబాబు వాగ్దానాలు చేస్తున్నారని బాజిరెడ్డి ఎద్దేవా చేశారు.

Back to Top