ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

విజయవాడ: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం దర్యాప్తు నుంచి ఎన్‌ఐఏను తప్పించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అత్యవసరంగా ఈ కేసును విచారించాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.

వైయస్‌ జగన్‌పై అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన విషయం విధితమే. ఎయిర్‌పోర్టులోని టీడీపీ నేత హర్షవర్ధన్‌కు చెందిన క్యాంటీన్‌లో పని చేస్తున్న శ్రీనివాస్‌ అనే యువకుడు వైయస్‌ జగన్‌పై కోడికత్తితో దాడి చేశారు. ఈ కేసును ఇటీవలే హైకోర్టు ఎన్‌ఐఏకు అప్పగించింది. దీంతో ఎన్‌ఐఏ  అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ కేసు నుంచి ఎన్‌ఐఏను తప్పించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను శనివారం హైకోర్టు తిరస్కరించింది.
 

Back to Top