స్టీల్‌ ప్లాంట్‌లకు కోకింగ్‌ కోల్‌ కొరత 

రాజ్యసభలో  ఎంపీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ : దేశంలో ఉక్కు పరిశ్రమలు కోకింగ్ కోల్ కొరతను ఎదుర్కొంటున్న విషయం వాత్సవమేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  ప్రహ్లాద్ జోషి అంగీకరించారు. సొంత బొగ్గు గనులు లేక ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు మీ దృష్టికి వచ్చాయా అని రాజ్యసభలో సోమవారం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ దేశంలో కోకింగ్ కోల్ కొరత కారణంగా ఉక్కు పరిశ్రమలు విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకుంటన్నట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్లకు అవసరమయ్యే కోకింగ్ కోల్ దేశంలో తగినంత పరిణామంలో  అందుబాటులో లేదు. స్టీల్‌ ప్లాంట్‌లలో తక్కువ బూడిద పరిణామం కలిగిన (లోయాష్‌) కోకింగ్‌ కోల్‌ను మాత్రమే వినియోగిస్తారు. మన దేశంలో శుభ్రపరచని కోకింగ్ కోల్‌లో బూడిద సగటున 22 నుంచి 35 శాతం ఉంటుంది. సాంకేతికంగాను, పర్యావరణ పరిరక్షణ పరంగాను  స్టీల్‌ ప్లాంట్‌లలో వినియోగించే కోకింగ్‌ కోల్‌లో బూడిద 10 నుంచి 12 శాతం మాత్రమే ఉండాలి. దేశంలో లభ్యమయ్యే కోకింక్‌ కోల్‌ను శుభ్రపరిచిన తర్వాత కూడా అందులో బూడిద 18 నుంచి 20 శాతం వరకు ఉంటుంది. అందుకే స్టీల్‌ కంపెనీలు తమకు అవసరమైన లోయాష్‌ కోకింగ్‌ కోల్‌ను అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. దేశంలో వివిధ స్టీల్‌ ప్లాంట్లకు ప్రభుత్వం కేటాయించిన సొంత బొగ్గు గనుల వివరాలను మంత్రి వెల్లడిస్తూ 2015లో గనులు, ఖనిజాల చట్టం సవరించిన అనంతరం ఈ ఆక్షన్‌ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుగుతున్నట్లు చెప్పారు. వాణిజ్యపరమైన అవసరాల కోసం బొగ్గు గనుల బ్లాక్‌ కేటాయింపు ఇటీవల కాలంలో ప్రారంభమైంది. ప్రభుత్వ రంగ సంస్థలు తమ బొగ్గు అవసరాల కోసం ఈ వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు.

Back to Top