విజయనగరం: రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మేలు జరిగిందని, మంచి చేసే వారికే ఓటు వేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గరివిడి మండలం కోనూరు గ్రామంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. పలువురు యువకులు మంత్రి సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బొత్స మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మనంవేసే ఓటు ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని, భరోసా కల్పించేలా ఉండాలన్నారు. అలాంటి భరోసా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోనే ప్రజలకు కలిగిందన్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అమలుచేసిన నవరత్న పథకాలతో ప్రతీ ఇంటా వెలుగులు ప్రసరించాయన్నారు. అమ్మఒడి, జగనన్న విద్యాకానుకలు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, నాడు–నేడు వంటి పథకాలతో పేదకుటుంబాల చదువుకు భరోసా కలిగిందన్నారు. వైయస్ఆర్ రైతు భరోసా కింద రైతన్నలకు ఏటా పెట్టుబడి సాయం ఠంచన్‌గా అందుతోందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల సాధించుకున్నామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో జిల్లా ప్రగతిపథంలో పయనిస్తుందన్నారు. పేదలకు వైద్యభరోసా కల్పిస్తూ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఆర్థిక పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.25లక్షలకు ప్రభుత్వం పెంచిందన్నారు. తోటపల్లి కాలువలను తవ్వించి సాగునీటి సమస్యకు తెరదించామని చెప్పారు. 58 నెలల పాలనలో ఒక్క కోనూరు గ్రామంలోని లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాల కింద రూ.15 కోట్ల నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమచేసిన ఘనత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. చంద్రబాబు పచ్చి మోసకారి అని, ఎన్నికల వేళ ఆయన చెప్పే అబద్ధాలను నమ్మొద్దన్నారు. రుణాలు మాఫీ చేస్తానంటూ 2014లో అధికారంలోకి వచ్చి రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశాడన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ..వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఇంటా ‘నవరత్న’ వికాసం కనిపి స్తోందన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కోనూరు గ్రామస్తులు వైయస్ఆర్‌సీపీ హయాంలో జరిగిన మేలును గుర్తుచేసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ధీర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బొత్స సందీప్‌బాబు, వైస్ ఎంపీపీ జి.రామకృష్ణరాజు, సర్పంచ్ బూడి శ్రీరాముల నాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల విశ్వేశ్వరరావు, జి.శ్రీరాములనాయుడు పాల్గొన్నారు.