వెంకయ్యకి తెలీక కాదు..అన్నీ తెలుసు సుమీ..!


 ఆంధ్ర ప్రదేశ్ ను  ప్రత్యేక హోదా బారి నుండి రక్షించి..హోదాకు అడ్డుపడి  చంద్రబాబు నాయుడికి  కేంద్రం నుంచి ప్రత్యేక సాయం ఇప్పించినందుకు తెలుగు వెలుగు  ముప్పరపు వెంకయ్య నాయుణ్ని తెలుగు సమాజం ఘనంగా సన్మానించింది. తెలుగు సమాజం అంటే తెలుగుదేశం.. బిజెపిలో తెలుగుదేశం జపం చేసే  ఓ వర్గం కలబోత అన్నమాట.
తెలుగు రాష్ట్రాన్ని నలుదెశలా అభివృద్ధి పర్చేందుకు వెంకయ్యనాయుడు అహోరాత్రులూ శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా వక్తలందరూ కొనియాడారు.
పెద్ద సంఖ్యలో పెద్దలు వచ్చి వెంకయ్య నాయుడి ఘనకీర్తిని పొగిడారు. పూల మాలలతో  సత్కరించారు. సన్మాన కార్యక్రమం అయిపోయాక వెంకయ్య నాయుడు  మీడియా ప్రతినిథుల తో ఇష్టాగోష్ఠి నిర్వహించారు.

అందరిలోకీ బాగా సీనియర్  జర్నలిస్ట్ అయిన సుబ్బారావు  మైక్ అందుకుని 
"అయ్యా నాయుడుగారూ... ప్రత్యేక హోదా  రాదని మీకు ముందే తెలుసా" అని ఆశ్చర్యంగా అడిగారు.
వెంకయ్యనాయుడు చిరునవ్వు నవ్వి " అవునండీ. నాకు ఆనాడే తెలుసు. ప్రత్యేక హోదా వచ్చేది కాదని" అని బదులిచ్చారు.
" రాదని తెలిసినపుడు మరి పార్లమెంటులో మీరు ప్రత్యేక హోదా ఎందుకు అడిగినట్లండీ? అని   వెంకట్రావు అనే మరో జర్నలిస్ట్ ఆరా తీశారు.
" అడక్క ఏం చేయమంటారండీ?  హైదరాబాద్ లోనూ ఖమ్మంలోనూ నా దిష్టి బొమ్మ తగలేశారు. వాతావరణం అంతా వేడిగా ఉంది. అందుకే ఒళ్లు మండి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని రాజ్యసభలో గట్టిగా అడిగాను" అని  వెంకయ్య చెప్పుకొచ్చారు.
"మరయితే  అక్కడితో ఆగిపోవచ్చు కదా. మీరు మేని ఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు పెట్టారండి? అది అమలు చేయలేమని మీకు తెలీదా? అని  కొంటె బాబూరావు ప్రశ్నించారు.
బాబూరావు కేసి కాస్త చికాగ్గా చూసిన వెంకయ్య నాయుడు " ఎందుకు తెలీదయ్యా బాబూ. తెలుసు.  అయినా అడక్క తప్పదు ఏం చేయమంటావు? " అని ఎదురు ప్రశ్నించారు.

"అదేంటండీ  అడక్క తప్పకపోవడమేంటి? "అని మరో జర్నలిస్ట్ అడిగారు
ఈ పాటి కూడా తెలీదా అన్నట్లు ఆ జర్నలిస్ట్ కేసి లుక్కేసిన వెంకయ్య " అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదయ్యా బాబూ. ఎలక్షన్లలో ఓటర్లు  మాకు ఓటేయాలంటే ఏదో ఒక తాయిలం ప్రకటించాలి కదా. అందుకే మేనిఫెస్టోలో అలా పెట్టాం "అన్నారు.
అది సరే కానీ నాయుడు గారూ.. పట్టిసీమ ప్రాజెక్టులోనే బోలెడు అవక తవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు పీకల దాకా ఇరుక్కున్నారు. అలాంటి వ్యక్తి చేతిలో జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ఎందుకు పెట్టారండి? అని   ఓజర్నలిస్టు ప్రశ్నించారు.
"చంద్రబాబు నాయుడి గారికి చేతివాట తనం ఉందని మాకు తెలీక కాదు. తెలుసు.   అయినా పోలవరం ఎందుకిచ్చామంటే..  ప్రత్యేక హోదా గురించి  నోరు మెదపకుండా ఉంటామని ఆయన మాటిచ్చారు. అందుకే పోలవరం ఆయనకు ఇచ్చాం"  అన్నారు వెంకయ్య.

ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేంటని మీరూ చంద్రబాబు నాయుడుగారూ  పదే పదే అంటున్నారు కదా.. హిమాచల ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా వల్ల బోలెడు పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలూ వచ్చాయి కదా. మరి మీరు అబద్ధం ఎందుకు చెబుతున్నారు?
"అబద్ధం చెప్పకపోతే..నిజాలు చెప్పడానికి నేనేమన్నా సత్యహరిశ్చంద్రబాబు నాయుడనుకున్నావా ఏంటి?  అవసరమైనపుడల్లా అబద్ధాలు చెప్పాలి. అదే రాజకీయ నీతి శాస్త్రం. హోదా వల్ల వచ్చే లాభాల గురించి చెబితే..తెలుగు ప్రజలు హోదా ఎందుకు తేలేదు అని నా కాలర్ పట్టుకుంటారు.  అందుకే అబద్ధం చెప్పాం" అని వెంకయ్య వివరించారు.
"ప్రత్యేక హోదాకు బదులు  ప్రత్యేక సాయం అంటున్నారు కదా. ప్రత్యేక సాయంలో ఏమేం వస్తాయి ఏపీకి?" అని సుబ్బారావు అడిగారు.
"ప్రత్యేక సాయంలో భాగంగా చంద్రబాబు నాయుడిపై  ఉన్న ఓటుకు కోట్లు కేసు ముందుకు సాగకుండా చూస్తాం. రాజధాని కోసం భూములు గుంజుకుని అక్కడ చంద్రబాబు చేసిన రియల్ ఎస్టేట్ దందాల్లో ఆయనకీ ..టిడిపి మంత్రులకీ ఉన్న పాత్రని బయటకు రాకుండా కాపాడతాం. పోలవరం ప్రాజెక్టు పనులు ఆయనకే అప్పగించాం కాబట్టి ఆయన తనకు నచ్చిన వాళ్లకి కాంట్రాక్ట్ ఇచ్చుకుని నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు  సహకరిస్తున్నాం. వచ్చే రెండున్నరేళ్లూ  ఆయన   చేసే తప్పులన్నింటినీ కూడా మేం క్షమించేసి  వదిలేస్తాం" అని వెంకయ్య నాయుడు  వివరించారు.

జర్నలిస్టులంతా ఒకరి మొహాలొకరు చూసుకుని   ఇష్టాగోష్ఠి ముగించారు.
మర్నాడు పత్రికల్లో " ఆంధ్ర ప్రదేశ్  కు దేశంలోనే అగ్రగామిని చేస్తామని వెంకయ్య నాయుడు భరోసా " అంటూ కొన్ని పత్రికల్లో బ్యానర్ స్టోరీలు వచ్చాయి.
చంద్రబాబు పరిపాలన చాలా అద్భుతంగా ఉందని వెంకయ్య కితాబు నిచ్చినట్లు కొన్ని టీవీ చానెళ్లు  హెడ్ లైన్ స్టోరీలు ఇచ్చాయి.
ఇష్ఠాగోష్టిలో మాట్లాడిన దానికీ ఈ స్టోరీలకు సంబంధం లేకపోవడం చూసి  ఇష్ఠాగోష్ఠి లో పాల్గొన్న కొత్త జర్నలిస్ట్  అయోమయానికి గురయ్యాడు.

తాజా ఫోటోలు

Back to Top