పట్టు వదలని విక్రమార్కుడు స్మశానంలో నెమ్మదిగా ముందుకు నడుస్తున్నాడు.నిశ్శబ్ధాన్ని చీల్చుకుంటూ కీచురాళ్లు మొత్తుకుంటున్నాయి.దూరంగా నక్కలు ఊళలు పెడుతున్నాయి.నిర్వికారంగా చెట్టువైపుకు సాగుతున్నాడు విక్రమార్కుడు.విక్రమార్కుని అల్లంత దూరం నుంచి చూడగానే బేతాళుడు శవంలోంచి లేచాడు."రా విక్రమార్కా..! ఎప్పుడొస్తావా అని నీకోసమే ఎదురు చూస్తున్నా. మాట్లాడదామంటే ఒక్క దెయ్యం పిల్ల కూడా ఇటు వైపు రావడం లేదు. ఎవరూ లేక బోరు కొట్టేస్తోంది. "అని బేతాళుడు ఆత్రంగా అన్నాడు.విక్రమార్కుడు నవ్వి...బేతాళుని భుజాలకెత్తుకున్నాడు.
ఎంత దారుణం బేతాళా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందరూ అనుకుంటోన్నట్లుగా విమాన ప్రమాదంలో చనిపోలేదట.అసలు ఆయన స్వాతంత్ర్యానికి ముందే చనిపోయారన్న వార్తలోనూ నిజం లేదట. ఇంచుమించు 1960లు దాటాక కూడా నేతాజీ తన కుటుంబానికి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడట..వాళ్లూ నేతాజీకి టచ్ లోనే ఉన్నారట బతికున్న మనిషిని చనిపోయినట్లు ప్రచారం చేయడం ఎంత దారుణం?"అని విక్రమార్కుడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.బేతాళుడు నవ్వి...." మీ మనుషులు మహ మాయగాళ్లయ్యా.బతికున్నవాళ్లని శవాలుగా చెలామణీ చేసేయనూ గలరు..చనిపోయిన వారిని బతికున్నవాళ్లుగా చిత్రీకరించనూ గలరు మీ మాయల ముందు మా భూత..ప్రేత..పిశాచ లోక మాయలు..మర్మాలూ ఎందుకూ పనికిరావనుకో...అయినా ఇపుడు మనకీ ఇష్యూ ఎందుకులే కానీ..నేనో కథ చెబుతాను అలసట తెలీకుండా సావధానంగా విను..అని కథ చెప్పడం మొదలు పెట్టాడు.
"విక్రమార్కా...ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది.అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుంది. పోలవరం వస్తే మొత్తం ఏపీ అంతా సస్యశ్యామలం అయిపోతుంది. నిజంగానే అదొక వరం. అలాంటి వరాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేసి ఎందుకూ పనికిరాని పట్టిసీమ ప్రాజెక్టు వైపు మొగ్గు చూపారు. పోలవరం వస్తే..పట్టిసీమ ప్రాజెక్టు వృధా అయిపోతుంది. అంచేత దానిపై 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం బూడిదలో పోసిన పన్నీరైపోతుందని ప్రతిపక్షాలు..ప్రజాసంఘాలు పదే పదే మొత్తుకున్నాయి.
అయినా చంద్రబాబు పట్టిసీమవైపే ముందడుగు వేశారు.ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండానే ఆదరా బాదరాగా ప్రారంభోత్సవానికి రెడీ అయిపోయారు. విపక్షాలన్నీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టు పనులు పూర్తికాకుండా..అక్కడ పంపులను పూర్తిగా అమర్చకుండా గోదావరి జలాలను కృష్ణాలో కలిసేశామని నదులు అనుసంధానం అయిపోయిందని చంద్రబాబు తో పాటు ఆయన మంత్రులు ప్రచారం చేసేసుకుంటున్నారు. పట్టిసీమ తర్వాత పోలవరాన్నీ కడతామని చంద్రబాబు అంటున్నారు. మొత్తం ప్రతిపక్షాలన్నీ విమర్శిస్తోన్నా..చెడ్డపేరును మూటగట్టుకోవలసి వస్తుందని తెలిసినా..చంద్రబాబు నాయుడు పట్టిసీమ విషయంలో అంత మంకు పట్టుదలతో ఎందుకు వున్నారు? నదులు అనుసంధానం కాకముందే అయిపోయిందని అబద్ధాలు చెప్పి అందరి ముందూ నవ్వులపాలెందుకు అవుతున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? .. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసీ కూడా చెప్పకపోయావా నీ తల వెయ్యి చెక్కలైపోతుంది"అని బేతాళుడు కథ ముగించాడు.
విక్రమార్కుడు ఒక్కసారిగా నిట్టూర్చి సమాధానం చెప్పడం మొదలు పెట్టాడు."బేతాళా..పోలవరం ప్రాజెక్టు కు నువ్వు చెప్పినట్లు కేంద్రమే నిధులిస్తుంది. దాని టెండర్లూ కేంద్రమే ఖరారు చేస్తుంది. నిర్మాణమంతా కేంద్రమే పర్యవేక్షిస్తుంది. అంతా కేంద్రమే చేస్తే రాష్ట్రంలో ఉండే పాలకులకు కిక్ బ్యాక్స్ ఎవరిస్తారు? అదే పట్టిసీమ ప్రాజెక్టు అనుకో. నామమాత్రంగా టెండర్లు వేసేశారు. అవి కూడా వాళ్లకి కావల్సిన ఇద్దరు మాత్రమే టెండర్లు వేశారు. టెండర్ దక్కించుకున్న చిన్న పార్టీ దగ్గర...టెండర్ కోల్పోయిన రెండో పార్టీ సబ్ కాంట్రాక్టర్ గా పనులు చేపట్టింది. అదికూడా నిబంధనలకు విరుద్ధంగా 21 శాతం ఎక్కువగా టెండర్ కోట్ చేశారు. ఏడాది లోపు పనులు పూర్తి చేయాలని కండిషన్ పెట్టి...ఏడాదిలో పూర్తి చేసినందుకు గానూ 16 శాతం బోనస్ ప్రకటించారు. ఈ మొత్తం గందరగోళంలో ఓ అయిదు వందల కోట్ల రూపాయల దాకా పాలక పక్షానికి ముట్టిందని కర్ణపిశాచులు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఇలా ముడుపులు వస్తాయి కాబట్టే చంద్రబాబునాయుడి ప్రభుత్వం అందరూ వద్దని వారిస్తోన్న పట్టిసీమవైపు మొగ్గు చూపారు. ఇక పట్టిసీమ ప్రాజెక్టు పూర్తికాకుండానే నదుల అనుసంధానం అయిపోయిందని చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఎందుకు నాటకాలాడుతోందని అడిగావు. దానికి కారణం ఒకటే. పట్టిసీమ ద్వారా నదులు అనుసంధానం అయిపోయిందని ప్రచారం ఊపందుకుంటే...ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో రియల్టర్లు హుషారవుతారు. నీళ్లొచ్చేస్తున్నాయని ప్రచారం జరిగితే...అమాంతం అక్కడి భూముల ధరలు పదింతలు పెరిగిపోతాయి. రాజధాని ప్రతిపాదిత ప్రాంత పరిసరాల్లో భూములన్నీ టిడిపి అనుకూల వర్గాలే కొనుగోలు చేసి ఉండడంతో వాళ్ల భూముల విలువ అమాంతం పెరిగిపోతుంది. దానికోసమే ...చెంబులతోనూ..బిందెలతోనూ నీళ్లు తీసుకెళ్లి పోలవరంలో పోసి నదుల అనుసంధానం అయిపోయిందని నమ్మబలుకుతున్నారు" అని విక్రమార్కుడు ముగించాడు.ఆ సమాధానం సంతృప్తి పర్చడంతోనే బేతాళుడు మాయమై తిరిగి చెట్టుకు వేలాడాడు.
-వీర పిశాచి