నేను రైతు బాంధ‌వుడిని..కాదు రైతు సైంద‌వుడివి

చంద్ర‌బాబు రైతు యాత్ర మొద‌లుపెట్టాడు. యాత్ర‌కు ముందు కొబ్బ‌రికాయ కొట్టి ఆయ‌న వీర‌భ‌క్తులు ఉప‌న్యాసం మొద‌లుపెట్టారు.``చంద్ర‌బాబంటే మామూలు వ్య‌క్తికాదు, శ‌క్తి రైతుల్ని తుఫానులా ముంచెత్తే శ‌క్తి. ఈ రోజు కొబ్బ‌రికాయ కొడుతున్నామంటే కొబ్బ‌రి రైతుల‌కి మేలు చేస్తున్నామ‌ని అర్థం, కొబ్బ‌రి నాయ‌కులు తిన్న‌, చిప్ప‌మాత్రం రైతుల‌కి గ్యారంటీ`` అన్నారు.

గ‌న్‌మ్యాన్ల‌ను వెంటేసుకుని పొలాల వెంట బాబు న‌డ‌క‌సాగించాడు. ఒక చోట ఒకాయ‌న  తాళ్ళు  అమ్ముతూ క‌నిపించాడు.
బాబు వాడిని పిలిచి `` అరే తిక్క‌లోడా, చేద‌బావులు ఎండిపోయి ఏళ్ళ‌యింది క‌దా, ఇప్పుడే తాళ్ళు ఎవ‌రికి అమ్ముతున్న‌వ్‌`` అని అడిగాడు.
`` బాబూ మీ ద‌య వ‌ల్ల బావులేక‌దా, పంట‌లు కూడా ఎండిపోయాయి. రైతుల్ని ఆదుకునేవాడు, చేదుకునే వాడు లేడు. పండితే ధ‌ర‌వుండ‌దు, పండ‌క‌పోతే అన్న‌ముండ‌దు. ఒక‌వేళ పండుతాయ‌ని ఆశ‌ప‌డినా ఆ భూముల్ని మీరు ఎలాగోలా లాక్కుంటారు. అందువ‌ల్ల రైతుల‌కి బ‌త‌క‌డం కంటే చ‌చ్చిపోవ‌డ‌మే ఇప్పుడు సుల‌భం, ప‌ల్లెటూళ్ళల్లో ఇప్పుడు మూడుముళ్ళేసుకునే వాళ్ళ‌కంటే తాడుముళ్ళు వేసుకునే వాళ్ళే ఎక్కువ‌య్యారు. 
నేనూ రైతునే బాబు, రైతుల క‌ష్టం చూడ‌లేక త‌క్కువ ధ‌ర‌ల‌కి ఈ తాడుని అమ్ముతున్నా, నొప్పి తెలియ‌కుండా వుండ‌డానికి తాళ్ళ‌కి నూనె కూడా రాశాను. ఈ తాళ్ళ‌ను కానీ మీ చేతుల‌తోనే రైతుల‌కి నాలుగు పంచండి బాబూ ధ‌ర్మ ప్ర‌భువులు ``అన్నాడు తాళ్ళు అమ్మేవాడు.
``ఇదంతా కుట్ర‌, ప్ర‌తిప‌క్షాలు నా మెడ‌కి తాడు బిగించాల‌ని చూస్తున్నాయి. రైతుల‌కి నేను ఎంతో చేశాను`` అన్నాడు బాబు కోపంగా 
``అవును చాలా చేశారు. నీళ్ళు ఎపుడొస్తాయో తెలియ‌ని ప‌ట్టిసీమ‌ని జాతికి అంకితం చేశారు``
`` విడియో కాన్ఫ‌రెన్స్‌లు పెట్టి రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాను``
``కంపూట‌ర్ల‌లో రైతుల క‌నీ్న‌ళ్ళు క‌నిపిస్తాయా సామీ, రైతులు అర్థం కావాలంటే ముందు మీ గుండెల్లో త‌డి వుండాలి. నాయ‌కుడితో త‌డిలేక‌పోతే మ‌డిపార‌దు``
`` నేను రైతు బాంధ‌వుడిని``
`` కాదు రైతు సైంద‌వుడివి`
``వీడి నోరు మూయించండి``
పోతీసులొచ్చి తాళ్ళ‌వాడిని లాక్కెళ్ళారు.
``ఒక నోరు మూయిస్తే వంద‌నోళ్ళు తెరుచుకుంటాయి బాబు గారూ``
ఇంత‌లో రెండు అస్తిపంజ‌రాలు బాబు ద‌గ్గ‌ర‌కొచ్చాయి. కెవ్వున కేకేశాడు. ఆ అస్తిపంజ‌రాలు ఏదో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాయి.
`` దెయ్యాలు, దెయ్యాలు`` అని బాబు అరిచాడు
``దెయ్యాలు కాదు చంద్ర‌బాబు, మీ పాల‌న‌లో ఎండిపోయిన రైతులు వాళ్ళు మీరిపుడు చేయాల్సింది ప‌రామార్శ‌యాత్ర కాదు, రైతుల అంతిమ‌యాత్ర రైతుల్ని శిలువ‌వేయించిన పుణ్యం మీకే ద‌క్కుతుంది`` అన్నాడు తాళ్ళ‌వాడు.
అస్తిపంజ‌రాల్ని గ‌న్‌మెన్ త‌రిమేశారు.
`` రైతుల‌కి నేనెంతో చేశాను. పురుగుల మందుల్ని స‌బ్సిడిగా ఇచ్చాను`` అని ఉప‌న్యాసం ఎత్తుకున్నాడు బాబు
`` వాటిని అన్నంలో క‌లుపుకుని రైతులు తింటున్నారు`` అని గొణుక్కుంటూ తాళ్ళ‌వాడు వెల్ళిపోయాడు
యాత్ర సాగింది
Back to Top