రోల్ మోడ‌ల్ రేవంత్‌

రేవంత్ బెయిల్ పై విడుద‌ల‌య్యాక‌ వూరేగింపు, డాన్స్ ట‌పాకాయ‌ల మోత‌, ప‌త్రిక‌ల‌కు ఇంట‌ర్వూలు ముగిసిన త‌రువాత పార్టీ కార్యాల‌యంలో అభినంద‌న స‌భ ఏర్పాటు చేశారు.
                 బాబు మైకు అందుకుని  రేవంత్ పార్టీలో త‌న వంతు పాత్ర పోషించినందుకు  ధ‌న్య‌వాదాలు. ఇచ్చి పుచ్చుకోవ‌డం మాన‌వ నాగ‌రిక‌త‌లో కీల‌క‌భాగం . ఇవ్వ‌డం తెలియ‌నివాడు పుచ్చుకోలేడు.  పుచ్చుకోవ‌డం తెలియ‌ని వాడు ఇచ్చుకోలేడు. దీన్ని అర్థం చేసుకోలేని వారు చ‌చ్చుపుచ్చు మాట‌లు మాట్లాడుతారు. తెలుగుదేశం అంటే ఏమిటంటే తెలుగు వాళ్ళ‌ని దేశంలోనే ముందుకు తీసుకెళ్ళ‌డం, ముందుకు పోవ‌డం అంటే ప‌ది మంది మ‌న గురించి  మాట్లాడేలా చేయ‌డం. ఇప్పుడు నేను చేసింద‌దే. రేవంత్ గురించి దేశ‌విదేశాల్లో మాట్లాడుకుంటున్నారు.  త‌న‌కొచ్చిన పేరుతో ఉబ్బిత‌బ్బిబ్బ‌యిన రేవంత్ మీసం  మెలేసి తొడ‌కొడుతున్నాడు. 30 ఏళ్ళు పోరాడుతానంటున్నాడు. పొరాట‌మంటే డ‌బ్బు తీసుకొని ప్ర‌త్య‌ర్థుల ఇళ్ళ‌కు పోయిరావ‌డం. అవ‌స‌ర‌మైన‌పుడు కొనాలి, డిమాండ్ వున్న‌పుడు అమ్మాలి. ఇది ప్రాధ‌మిక సామాజిక సూత్రం, స‌మాజం, రాజ‌కీయం రెండూ వేర్వేరు కాదు. లెక్క‌ల్లోకంటే జీవితంలోనే ఎక్కువ సూత్రాలుంటాయి. అవ‌న్నీ నేర్చుకోవ‌డం వ‌ల్లే రెండెక‌రాల నుంచి వేల కోట్ల‌కు చేరుకున్నాను.
                రేవంత్ నుంచి, నా నుంచి మీరు నేర్చుకోవ‌ల‌సిన సూత్ర‌మేమిటంటే దేనికి సిగ్గుప‌డ‌క‌పోవ‌డం, దొంగ‌త‌నం చేసిన వాడే దొంగా దొంగా అని అర‌వాలి. గుమ్మ‌డి కాయ‌లు కోసుకున్న భుజాలు త‌డుముకోవ‌డం, రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా హ్యాండ్స‌ప్ అన‌కూడ‌దు. దోపిడి మ‌న‌మే చేసి కాప‌లాకుక్క‌లా అర‌వాలి. చేనులు మేసిన కంచెల్లా నీతులు చెప్పాలి.
                అన్నిటికి మించి ఒక విష‌యంలో స్ప‌ష్ట‌త వుండాలి. ప్ర‌జాస్వామ్య‌మంటే ప్ర‌జ‌ల్ని స్వాహా చేయ‌డం. అంటే వాళ్ళ‌ని గొర్రెలు చేసి బ‌లివ్వ‌డం. రాజ‌ధాని నిర్మాణానికి అటెండ‌ర్ నుంచి అధికారి వ‌ర‌కూ ఒక రోజు జీతం డ‌బ్బులు వ‌సూలు చేసి ఆ డ‌బ్బుతో తెలంగాణ‌లో ఎమ్మెల్యేల‌ను కొన‌డ‌మే మ‌న చాతుర్యం. టీవీల్లో నోట్ల నెంబ‌ర్ల‌తో స‌హా క‌నిపిస్తూ వుంటే రాజ‌కీయాల్లో నీతి, నేతిబీర‌కాయ‌ల్లో నేతి అని నేను మాట్లాడుతున్నానంటే అది నా గుండె ధైర్యం. ప్ర‌జ‌లు బ‌క‌రాల‌నే బండ ధైర్యం. కాబ‌ట్టి మీకు చెప్పేదేమిటంటే అవినీతి మ‌న తెలుగుదేశం పార్టీ సంస్కృతి. దీన్ని మ‌నం కాపాడుకుందాం. ప్ర‌జ‌లు శుంఠ‌లు... రుణ‌మాఫీ చేయ‌క‌పోయినా మ‌న‌ల్నేం చేయ‌లేరు. అబ‌ద్దాలు చెప్పి వాళ్ళ‌ని న‌మ్మించ‌డం సులువు.
రేవంత్ మ‌న‌కి ఆద‌ర్శం, పార్టీ రాజ్యాంగంలో ఆయ‌న‌కంటూ ఒక పేజీ వుంది. ఎవ‌రూ స్ప‌ష్టించ‌క‌పోతే చ‌రిత్ర ఎలా పుడుతుంది. నీతి నిజాయితి  అనే దేవ‌తా వ‌స్త్రాలు ధ‌రించి మ‌నం ఆర‌కంగా ముందుకు పోదాం  అని బాబు ముగించాడు.
     త‌మ్ముళ్ళు చ‌ప్ప‌ట్లు కొట్టి ట‌పాసులు కెళ్ళారు.
- రాహుల్‌

Back to Top