కావ్..కావ్..కావ్.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అదృష్టవంతులు.

ఆయన్ను అర్ధం చేసుకుని..కష్టకాలంలో కాపాడుకునే మిత్రులు ఉండడం నిజంగానే చంద్రబాబు అదృష్టం. ఎవరినైనా ప్రశ్నించేస్తానంటూ జన సేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కూడా ..చంద్రబాబు మిత్రమండలిలో చేరడం బాబు చేసుకున్న అదృష్టం కాక మరేమిటి?

ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చినపుడు గిట్టని వారంతా చంద్రబాబు పని అయిపోయిందనుకున్నారు. మేథావులు...విలువలు గట్రా పట్టుకుని వేలాడే చాదస్తులు..ఓటుకు నోటు కేసు చూసి అసహ్యించుకుంటే అసహ్యించుకోగాక..వాటి వల్ల చంద్రబాబునాయుడికి కించిత్ నష్టం లేదు.

కానీ ఓటుకు నోటు కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తర్వాత నెలరోజులకు పైగా  జనసేనాని పవన్ కళ్యాణ్ మౌనంగానే ఉండిపోయారు. ఆయన నోరు తెరిస్తే..ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును ఎక్కడ తప్పు పడతారో..టిడిపికి ఎక్కడ  కటీఫ్ చెప్తారోనని  టిడిపి నేతలు చాలా మంది కంగారు పడ్డారు. రేవంత్ అరెస్ట్ అయి ..నెల  రోజుల తర్వాత విడుదలైన తరుణంలో  ఓటుకు నోటు గురించి మాట్లాడతానంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో   పోస్టర్ అతికించారు.ఇక  చంద్రబాబు పని అయిపోయింది ..పవన్  కళ్యాణ్ తప్పు చేసిన వాళ్ల తాట తీస్తారు అని చాలా మంది అమాయకులు అనుకున్నారు.

అనుకున్న తరుణం రాగానే పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.

సేమ్ టూ సేమ్ సింహంలాగే గెడ్డం గీసుకోకుండా  మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్..చివరి పంచ్ కోసం అసలు ప్రయత్నమే చేయలేదు.

 గంటసేపు మాట్లాడిన పవన్  పాపం ఒక్క ప్రశ్న కూడా సంధించలేదు. ఓటుకు నోటు గురించి ఏదో చెప్తారనుకుంటే..దానికి ముందూ..వెనకా ఏం జరిగిందో చూడాలి అంటూనే...ఓటుకు నోటు కేసు కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడను అన్నారు.

ఫోను ట్యాపింగ్ చాలా సీరియస్ అయిన విషయమని నొచ్చుకున్నారు.అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఎక్కడా దాఖలాలు లేవు. చంద్రబాబు ఫోను మాటలను స్టీఫెన్ సన్ ఫోను లో రికార్డు చేశారని ఏసీబీ వాళ్లు కనీసం వంద సార్లు చెప్పారు.  ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది కేవలం టిడిపి ఆరోపణ మాత్రమే. దాన్నే  సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాన్ ఓ ముఖ్యమంత్రి ఫోనునే ట్యాప్ చేస్తే ఎలా...ఇలా చేసుకుంటూ పోతే అంతర్యుద్ధం వచ్చేస్తుందని బెదిరించారు.

చంద్రబాబు నాయుడు దేశంలో లేని ముహూర్తం చూసుకుని..బాబుగారు జపాన్ లో  బిజీగా ఉన్న టైమ్ చూసుకుని..పవన్ కళ్యాన్ పెట్టిన మీడియా సమావేశంలో ....పవన్ మాటలు అచ్చం చంద్రబాబు నాయుడి మాటల్లాగే అనిపించాయి అందరికీ. రేవంత్ రెడ్డి తరపునో..చంద్రబాబు తరపునో వకాల్తా పుచ్చుకుని.. మాట్లాడినట్లే పవన్ మాట్లాడారని సీనియర్ జర్నలిస్టులు భావిస్తున్నారు.ఓటుకు నోటు కేసు కోర్టులో ఉండచ్చు..కానీ అది తప్పా..కాదా అన్నది చెప్పడం కోర్టు ఉల్లంఘన కిందకి రాదు.పవన్ కళ్యాణ్ మాత్రం ఆ బూచిని చూపి తాను మద్దతునిచ్చిన టిడిపి పరువు జారిపోకుండా కాపాడే ప్రయత్నం చేశారు.

సెక్షన్ 8 కీ చంద్రబాబు కేసుకీ సంబంధం లేదంటూనే...ఫోను ట్యాపింగులు చేసుకుంటూ పోతే దాని అవసరమూ వచ్చేస్తుందని చాలా గడుసుగా చెప్పారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడో...ఏం కొంపలంటుకుంటాయో అని భయపడుతూ భయపడుతూ టీవీలకు అతుక్కుపోయిన టిడిపి నేతలు మీడియా సమావేశం అంతా చూసి  రిలాక్స్డ్ గా నవ్వుకున్నారు.

తెలంగాణ ప్రజలను కూడా కాస్త ఎంటర్ టెయిన్ చేయాలనుకున్న పవన్ కళ్యాన్ యాదాద్రి దేవాలయ  నిర్మాణానికి సీమాంధ్రకు చెందిన  ఆర్కిటెక్ట్ ను నియమించడం ద్వారా కేసీఆర్ తెలుగు ప్రజల ఐక్యతకు మొదటి అడుగు వేశారని జోక్ చేశారు. ఆర్కిటెక్ట్ ను  నియమించడం ద్వారా తెలుగు ప్రజల మధ్య ఐక్యత ఎలా  కుదురుతుందో అర్ధం కాక జర్నలిస్టులు జుట్టు పీక్కున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ సుబ్బారావును ఏంటి సార్ మీ ఒపీనియన్ అని అడిగితే ఆయన ఒకటే చెప్పాడు.

ఒక ఊరికి ఓ ఏనుగు వచ్చిందట. ఏనుగుతో పాటే మావటి వాడూ వచ్చాడు. ఏనుగును అంత దగ్గరగా చూడ్డం ఆ ఊరి ప్రజలకు అదే మొదటి సారి.అందులో కొంతమంది కొంటె వాళ్లకి ఓ అనుమానం వచ్చింది. మనుషులు..ఇతరత్రా జంతువుల అపాన వాయువు విడుదల సమయంలో ఎంతో కొంత శబ్ధం వస్తుంది. అలాంటిది అంత పెద్ద ఏనుగు అపాన వాయువు విడుదల చేస్తే ఎంత గట్టిగా శబ్ధం వస్తుందోనని వాళ్లకి తెలుసుకోవాలనిపించింది. మావటి వాణ్ని అదే అడిగారు. ఓ అరగంట సేపు కూచోండి ఏనుగు అపాన వాయువు విడుదల చేసే సమయం అయ్యింది అని మావటి వాడు చెప్పి ..తన పనిలో పడ్డాడు. జనం ఒక్కో నిముషం  లెక్కపెట్టుకుంటూ చెవులు రిక్కించి చూస్తూ ఉన్నారు . నలభై నిముషాల తర్వాత మావటి వాడు వచ్చి ఇక నెగండి బాబూ..ఏనుగు అపాన వాయువు విడుదల చేసి చాలా సేపయ్యింది అన్నాడు. అదేంటి అస్సలు వినిపించనే లేదు అని అందరూ నిరాశ పడిపోయారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అలానే ఉందని  సుబ్బారావు చెప్పేసి.. తర్వాతి  కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిపోయాడు.

-కవి కాకి.
Back to Top